అవకాశం దొరికినప్పుడల్లా రెజ్లర్లను వేధించిన బ్రిజ్‌భూషణ్‌

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మహిళా రెజ్లర్లపై అవకాశం దొరికినప్పుడల్లా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఢిల్లీ పోలీసులు రౌస్ ఎవెన్యూ కోర్టుకు ఆదివారం తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. 
ఆసియా క్రీడల్లో భాగంగా తజికిస్తాన్‌లో ఒక మహిళా రెజ్లర్‌ను బ్రిజ్ భూషన్ తన గదిలోకి పిలిచి కౌలిగించుకున్నాడని, ఆ రెజ్లర్ ప్రతిఘటించడంతో ఓ తండ్రిగా ఇలా చేశానని తన చర్యను ఆయన సమర్థించుకున్నాడని ఆ నివేదికలో తెలిపారు. బాధితురాలు రియాక్ట్ అయ్యిందా? లేదా? అన్నది ఇక్కడ ముఖ్యం కాదని, ఆమెకు అన్యాయం జరిగిందని పోలీసులు చెప్పారు.

అదే ఆసియా క్రీడల్ తన అనుమతి లేకుండా చొక్కాను పైకెత్తి, ఆమె నడుమును బ్రిజ్ భూషణ్ అసభ్యకరంగా తాకాడని ఓ మహిళ రెజ్లర్ ఫిర్యాదు చేసిన విషయాన్ని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఈ రెండు ఘటనల్ని బట్టి చూస్తే తాను చేస్తున్న చర్యల పట్ల బ్రిజ్ భూషణ్ పూర్తి అవగాహనతో ఉన్నాడని విషయం స్పష్టం అవుతుందని అధికారులు కోర్టుకు వెల్లడించారు. 

ఢిల్లీలోని డబ్ల్యుఎఫ్‌ఐ కార్యాలయం నుంచి వచ్చిన ఆరోపణల్ని సైతం ప్రస్తావించారు. గతంలోనూ  బ్రిజ్ భూషణ్‌పై మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పర్యవేక్షణ కమిటీ, అతడిని నిర్దోషిగా ప్రకటించలేదని కూడా కోర్టుకు తెలిపారు.  అయితే ఆ రిపోర్ట్‌ను బయటపెట్టలేదు. ఈ కేసుని విచారిస్తున్న ఢిల్లీ పోలీసులకు ఒక కాపీని అందించారు.

ఒక మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష పడుతుందని పోలీసులు పేర్కొన్నారు.  ఇదిలావుండగా,  బ్రిజ్ భూషణ్ తమపై లైంగిక ఆరోపణలకు పాల్పడ్డారని, తమకు న్యాయం చేయాలని కోరుతూ ప్రముఖ రెజ్లర్లు ఆమధ్య ఢిల్లీలో నిరసనలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల పాటు వాళ్లు ఆందోళన చేయడంతో  ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని, విచారణ చేయడం మొదలుపెట్టారు. 

ఓ మైనర్‌తో కలిపి మొత్తం ఏడుగురు మహిళా రెజ్లర్లు ఆయనపై ఫిర్యాదు చేశారు. తాను ఏ తప్పు చేయలేదని ఇన్నాళ్లూ బ్రిజ్ భూషణ్ నాటకమాడాడు. అయితే.. విచారణలో భాగంగా అతని చీకటి కోణాలు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు పోలీసులు కొన్ని కీలక ఆధారాల్ని సేకరించినట్టు తెలిసింది.