ఓ మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ కు సిరీస్‍

* గిల్, శ్రేయస్ సెంచరీలు.. సూర్య వీరబాదుడు

వన్డే ప్రపంచకప్‍ టోర్నీకి ముందు ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‍లో టీమిండియా మరోసారి సత్తాచాటింది. ఇండోర్ వేదికగా ఆదివారం జరిగిన రెండో వన్డేలో భారత్ 99 పరుగుల తేడాతో (డక్‍వర్త్ లూయిస్ పద్ధతి) ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. సీనియర్ల గైర్హాజరీలో కేఎల్ రాహుల్ సేన అదరగొట్టింది. 

దీంతో సిరీస్‍లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది భారత్. ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‍ను ఖాయం చేసుకుంది. ఈ మ్యాచ్‍లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 5 వికెట్లను 399 పరుగుల భారీ స్కోరు చేసింది. భారత బ్యాటర్లు శుభ్‍మన్ గిల్ (104), శ్రేయస్ అయ్యర్ (105) శతకాలతో అదరగొట్టగా,  సూర్యకుమార్ యాదవ్ (72 నాటౌట్), కేఎల్ రాహుల్ (52) అర్ధ శతకాలతో సత్తాచాటడంతో భారీ స్కోరు సాధ్యమైంది. 

ఆసీస్ బౌలర్లలో కామెరూన్ గ్రీన్ రెండు వికెట్లు తీశాడు. ఓ దశలో వర్షం పడి సమయం వృథా కావటంతో ఆస్ట్రేలియాకు డక్‍వర్త్ లూయిస్ పద్ధతిలో 33 ఓవర్లకు 317 పరుగుల టార్గెట్‍ను అంపైర్లు నిర్దేశించారు. అయితే, భారత బౌలర్లు సమిష్టిగా సత్తాచాటడంతో 28.2 ఓవర్లలో 217 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ (53), చివర్లో సీన్ అబాట్ (54) మాత్రమే రాణించగా, మిగిలిన వారు విఫలమయ్యారు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా చెరో మూడు వికెట్లు పడగొట్టారు. ప్రసిద్ధ్ కృష్ణ రెండు, షమీ ఓ వికెట్ తీశారు. మ్యాచ్ ఎలా సాగిందంటే..

భారీ లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియాకు శుభారంభం దక్కలేదు. రెండో ఓవర్లో భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ.. మాథ్యూ షార్ట్ (9)ను ఔట్ చేశాడు. ఆ తర్వాతి బంతికే ఆసీస్ సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ (0)ను గోల్డెన్ డక్ చేశాడు ప్రసిద్ధ్. దీంతో 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది ఆసీస్.  అయితే, మరోవైపు ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అదరగొట్టాడు. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ వేగంగా పరుగులు చేశాడు. ఆ తరుణంలో వర్షం పడటంతో లక్ష్యాన్ని 33 ఓవర్లకు 317 పరుగులుగా అంపైర్లు కుదించారు. అనంతరం కూడా వార్నర్ బాదుడు కొనసాగించాడు. 

మరోవైపు నెమ్మదిగా ఆడిన మార్నస్ లబుషేన్‍ (27)ను భారత స్టార్ స్పిన్నర్ అశ్విన్ బౌల్డ్ చేశాడు. డేవిడ్ వార్నర్ ఓ దశలో అశ్విన్ బౌలింగ్‍లో రైట్ హ్యాండ్ ఆడాడు. ఈ క్రమంలో 38 బంతుల్లోనే వార్నర్ అర్ధ శకతం చేశాడు. అయితే, అశ్విన్ బౌలింగ్‍లోనే 15వ ఓవర్లో ఎల్‍బీడబ్ల్యూగా వార్నర్ ఔటయ్యాడు. ఆ ఓవర్లోనే జోస్ ఇన్‍గ్లిస్ (6)ను కూడా అశ్విన్ ఔట్ చేశాడు. దీంతో 14.5 ఓవర్లలో 101 పరుగులకే ఐదో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది ఆసీస్. అనంతరం అలెక్స్ కేరీ (14), కామెరూన్ గ్రీన్ (19) ఎక్కువసేపు నిలువలేకపోయారు.

చివర్లో ఆస్ట్రేలియా బ్యాటర్ సీన్ అబాట్ మెరుపులు మెరిపించాడు. ఆజమ్ జంపా (5) ఔటైనా అతడికి జోస్ హాజిల్‍వుడ్ (23) సహకరించాడు. అయితే, అబాట్ మాత్రం వీర హిట్టింగ్ కొనసాగించాడు. భారత బౌలర్లలో టెన్షన్ పెంచాడు. ఈ క్రమంలో 29 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు అబాట్. వన్డేల్లో అతడికి ఇదే తొలి హాఫ్ సెంచరీ. 

అయితే, అబాట్ అదరగొట్టినా అప్పటికే మ్యాచ్ ఆసీస్ చేయిదాటిపోయింది. భారత ఫీల్డర్లు కొన్ని క్యాచ్‍లు కూడా మిస్ చేశారు. చివర్లో అబాట్‍ను భారత స్పిన్నర్ జడేజా బౌల్డ్ చేశాడు. దీంతో టీమిండియా విజయం పూర్తయింది.