భారత్, కెనడా వివాదంలో సూత్రధారి అమెరికా?

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో భారత్, కెనడా మధ్య నెలకొన్న దౌత్యవివాదం వ్యవహారంలో సరికొత్త కోణం వెలుగు చూసింది. నిజ్జర్‌ హత్యకు సంబంధించిన కీలక ఇంటెలిజెన్స్‌  సమచారాన్ని కెనడాకు అమెరికానే అందించిందని విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని ఉటంకిస్తూ న్యూయార్క్‌ టైమ్స్‌ తాజా కథనం వెల్లడించింది.
 
అమెరికా నుంచి తమకు ఈ ఇంటెలిజెన్స్ సమాచారం అందిన తర్వాత కెనడా ప్రభుత్వం మరింత లోతుగా విచారణ చేపట్టి, అదనపు సమాచారాన్ని సమకూర్చిందని ఆ పత్రిక పేర్కొంది. తన విచారణలో భాగంగా భారత దౌత్యవేత్త కమ్యూనికేషన్లలోకి కెనడా చొరబడి కీలక సమాచారాన్ని సేకరించిందని, అదే ఇప్పుడు కచ్చితమైన ఆధారంగా మారిందని ఆ కథనం వెల్లడించింది. 
 
అందుకే జస్టిన్ ట్రూడో బహిరంగంగా భారత్‌పై అలాంటి తీవ్ర ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దర్యాప్తునకు బారత్‌ సహకరించాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ పిలుపునిచ్చారని పత్రిక తన కథనంలో పేర్కొన్నది. అంతేకాదు, ఫైవ్ ఐస్ భాగస్వామ్యుల వద్ద నిజ్జర్ హత్యకు సంబంధించి ఇంటెలిజెన్స్ సమాచారం ఉందని, అదే భారత్‌పై ట్రూడో ఆరోపణలు చేసేందుకు ప్రేరేపించిందని ఓ ప్రముఖ యూఎస్ దౌత్యవేత్త ధృవీకరించినట్టు మరో మీడియా స్పష్టం చేసింది. 
 
అయితే, ఈ అంశంపై మాట్లాడేందుకు వైట్‌హౌస్ అధికారులు సిద్ధంగా లేదు. ఎందుకంటే కెనడా, భారత్ రెండూ అమెరికాకు మిత్ర దేశాలు. ఈ రెండింటితో ఉన్న సంబంధాలకు అంతరాయం కలగకుండా ఉండాలన్న ఉద్దేశంతో అమెరికా చాలావరకు మౌనంగా ఉంది.  భారత్‌కు మద్దతు తెలుపుతున్నా ఈ వ్యవహారంలో ఎక్కువగా జోక్యం చేసుకోవడం లేదు. 
 
అటు, కెనడా ప్రభుత్వం, అధికారులు సైతం నిజ్జర్ హత్య కేసులో సేకరించిన సమాచారాన్ని విడుదల చేసేందుకు ఒప్పుకోవడం లేదు. ఒకవేళ ఈ సమాచారం బయటపెడితే  ఇది ‘రాయల్‌ కెనేడియన్‌ మౌంటెడ్‌ పోలీస్‌ సర్వీసు ఇన్వెస్టిగేషన్‌’ను దెబ్బతీస్తుందని వారు పేర్కొంటున్నారు.ఇదిలావుండగా,  అమెరికా, కెనడా, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్‌డమ్స్ కలిసి ఫైవ్ ఐస్ గ్రూప్‌గా ఏర్పడ్డాయి. ఇది ఒక గూఢచార కూటమి. ఈ దేశాలన్నీ ఇంటెలిజెన్స్‌ను పంచుకుంటాయి. ఇది భారీ మొత్తం ఇంటర్‌సెప్టెడ్‌ కాల్స్‌, ఇతర మార్గాల్లో సేకరించిన సమాచారం ఉంటుంది. ఈ క్రమంలోనే నిజ్జర్ హత్యకు సంబంధించిన ఇంటెలిజెన్స్‌ను కెనడాకు అమెరికా అందజేసింది. అదే ఇప్పుడు భారత్, కెనడా మధ్య దౌత్య వివాదానికి దారి తీసింది.

మరోవంక, కెనడాతోపాటు అమెరికా, యూకేల్లో ఉండే ఖలిస్థానీ ఉగ్రవాదులను గుర్తించాలని, తద్వారా వారు భారత్‌లోకి ప్రవేశించకుండా నియంత్రించేందుకు ఓసీఐ కార్డులను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ఆదేశించినట్టు మీడియా కథనాలు పేర్కొన్నాయి. విదేశాల్లో నివసిస్తున్న ఉగ్రవాదుల ఆస్తులను గుర్తించాలని కూడా సూచించిందని ఐఏఎన్‌ఎస్‌ పేర్కొన్నది. మరోవైపు, ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ భారతీయులకు కెనడా వీసాల జారీని కొనసాగిస్తున్నది.

కెనడా ప్రధాని జస్టిన్‌ టూడ్రోపై ఆ దేశానికి చెందిన బ్రిటిష్‌ కొలంబియా ప్రావిన్స్‌ ప్రీమియర్‌ డేవిడ్‌ ఇబీ మండిపడ్డారు. ఇంటర్నెట్‌ సమాచారం ఆధారంగా ట్రూడో భారత్‌పై ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. ఓపెన్‌ సోర్స్‌ ఇంటర్నెట్‌ సమాచారం ఆధారంగానే ఆయనకు నిఘా వర్గాల సమాచారం వచ్చిందని పేర్కొన్నారు.  దేశంలో ఖలిస్థానీ ఉగ్రవాదంపై కెనడా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని ఇండో-కెనడియన్‌ ఎంపీ, ట్రూడో సొంత పార్టీ అయిన లిబరల్‌ పార్టీ నేత చంద్ర ఆర్య తప్పుబట్టారు. ట్రూడో వ్యాఖ్యల పరిణామాల నేపథ్యంలో దేశంలో హిందువుల భద్రతపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.