ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం

* విజేతలకు అమిత్ షా, రాజ్‌నాథ్, నడ్డా అభినందనలు 
 
ప్రతిష్టాకరమైన దేశరాజధాని నగరంలోని ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘ ఎన్నికలలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) అభ్యర్థులు ఘన విజయం సాధించారు. అధ్యక్ష, కార్యదర్శి, జాయింట్ కార్యదర్శి పదవులను భారీ ఆధిక్యతలతో గెల్చుకున్నారు. కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం  ఎన్‌ఎస్‌యూఐ కేవలం ఉపాధ్యక్ష పదవితో సరిపెట్టుకుంది.
 
కరోనా కారణంగా మూడు సంవత్సరాల తర్వాత జరిగిన ఎన్నికలలో  ఎబివిపి అభ్యర్థులకు లభించిన ఈ ఘనవిజయం దేశంలో ప్రజల రాజకీయ అభిప్రాయాలకు సంకేతంగా నిలుస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. చివరిసారిగా 2019లో జరిగిన ఎన్నికలలో సహితం ఎబివిపి అభ్యర్థులు మూడు పదవులను కైవసం చేసుకున్నారు. 

ఎన్నికలు గురువారం జరుగగా, శుక్రవారం ఓట్ల లెక్కింపు జరిగింది. పోటీ ప్రధానంగా ఎబివిపి,  ఎన్‌ఎస్‌యూఐ   అభ్యర్థుల మధ్యనే నెలకొంది. ఈ రెండు విద్యార్ధి సంఘాలతో పాటు ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఎఇఎస్ఎ), స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ)లతో సహా మొత్తం 24 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

ఎబివిపికి చెందిన తుషార్ దేధా ఎన్‌ఎస్‌యూఐకి చెందిన హితేష్ గులియాను ఓడించి అధ్యక్ష పదవిని గెలుచుకున్నారు.ఎబివిపి నుండి అపరాజిత,  సచిన్ బైస్లా వరుసగా కార్యదర్శి , సంయుక్త కార్యదర్శి పదవులను గెలుచుకున్నారు.  ఎన్‌ఎస్‌యూఐకి చెందిన అభి దహియా ఉపాధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నారు.
 
ఎబివిపి అభ్యర్థి తుషార్ దేధా 3,115 ఓట్ల తేడాతో ఎన్‌ఎస్‌యూఐకి చెందిన హితేష్ గులియాను ఓడించి అధ్యక్ష పదవిని గెలుచుకున్నారు. దేధాకు 23,460, గులియాకు 20,345 ఓట్లు వచ్చాయి. కాగా, ఎన్‌ఎస్‌యూఐ అభ్యర్థి అభి దహియా 22,331 ఓట్లు పొంది 1,829 ఓట్ల తేడాతో ఏబీవీపీకి చెందిన సుశాంత్ ధంకర్‌పై విజయం సాధించి ఉపాధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు.
 
ఎబివిపికి చెందిన అపరాజిత 12,937 ఓట్ల తేడాతో ఎన్‌ఎస్‌యుఐకి చెందిన యక్షణ శర్మపై కార్యదర్శిగా గెలుపొందగా, సచిన్  బైస్లా 9,995 ఓట్ల తేడాతో ఎన్‌ఎస్‌యూఐకి చెందిన శుభం కుమార్ చౌదరిపై విజయం సాధించి సహాయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు.  ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికలలో విజయం సాధించిన ఎబివిపి అభ్యర్థులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ , బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా తదితరులు అభినందించారు. ఎబివిపి విజయం యువ తరానికి చెందిన విశ్వాసానికి నిదర్శనమని అమిత్ షా పేర్కొన్నారు.
 
“జాతీయ ప్రయోజనాలకు మొదటి స్థానం” అనే భావజాలం. యువతలో స్వామి వివేకానంద ఆదర్శాలను, జాతీయతా స్ఫూర్తిని సజీవంగా ఉంచేందుకు ఎబివిపి కార్యకర్తలు దృఢ సంకల్పంతో పనిచేస్తారని తనకు పూర్తి విశ్వాసం ఉంది’’ అని షా ట్వీట్ చేశారు.  “బలమైన, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి దేశంలోని యువత కట్టుబడి ఉన్నారని ఎబివిపి విజయం సూచిస్తుంది. గెలుపొందిన విద్యార్థి సంఘ నేతలకు అభినందనలు” అని చెబుతూ  రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు.
 
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ స్వామి వివేకానంద ఆశయాల నుంచి ఏబీవీపీ స్ఫూర్తి పొందిందని పేర్కొన్నారు. “ఈ విజయం మన యువతరంలో ‘దేశం మొదటిది’ అనే భావజాలానికి సర్వత్రా ఆమోదం వ్యక్తం చేస్తుంది. వారు మన జాతి రేపటి భవిష్యత్ ను  తీర్చిదిద్దుతారు” అని నడ్డా ట్వీట్ చేశారు.
 
గెలుపొందిన ఏబీవీపీ అభ్యర్థులకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అభినందనలు తెలిపారు. “#ABVP #DUSUని కైవసం చేసుకుంది. రాహుల్ గాంధీ ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికలలో ప్రచారం చేసారు, ఇది ఎబివిపి తన ఓట్ల వాటాను పెంచుకోవడానికి సహాయపడింది!  గెలిచిన ఎబివిపి అభ్యర్థులందరికీ అభినందనలు. అందుకు తోడ్పడిన కార్యకర్తలకు శుభాకాంక్షలు!” అంటూ మంత్రి ట్వీట్ చేసారు.
 
బిజెపి ఎంపి, పార్టీ యువజన విభాగం యువమోర్చ అధ్యక్షుడు తేజస్వి సూర్య, “డియుఎస్‌యు ఎన్నికల్లో గెలిచినందుకు టీమ్ ఎబివిపికి అభినందనలు. దేశంలో మన విద్యార్థులు, యువకులు తీసుకుంటున్న సైద్ధాంతిక అభిప్రాయాలకు ఈ ఫలితాలు స్పష్టమైన సూచక. వందేమాతరం” అని పోస్ట్ చేశారు.