వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు మోదీ శంకుస్థాపన

ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి శనివారం నాడు శంకుస్థాపన చేశారు. మహదేవుని నగరంలో శివతత్వం ఉట్టిపడే డిజైన్‌తో నిర్మిస్తున్న ఈ స్టేడియాన్ని మహదేవునికే అంకితం చేస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. 
 
కాశీ లోని అంతర్జాతీయ స్టేడియం నిర్మాణంతో స్థానిక క్రీడాకారులకు ఎంతో ప్రయోనం చేకూరుతుందని చెబుతూ  పూర్వాంచల్ ప్రాంతానికి ఈ స్టేడియం తలమానికమని పేర్కొన్నారు. ఈ స్టేడియం యువతకు ఆశీర్వాదంగా ఉంటుందని, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో శిక్షణ పొందే అవకాశం ఉంటుందని ప్రధాని మోదీ చెప్పారు.
 
‘ఈరోజు ప్రపంచం క్రికెట్‌తో భారత్‌తో ముడిపడి ఉంది. ఇప్పుడు అనేక దేశాలు క్రికెట్ ఆడుతున్నందున, మ్యాచ్‌ల సంఖ్య పెరుగుతుందని,  దానితో మనకు మరిన్ని స్టేడియంలు అవసరమవుతాయని భావిస్తున్నారు. బనారస్ క్రికెట్ స్టేడియం డిమాండ్‌ను తీర్చడంలో సహాయపడుతుంది. ఇది మన హోరిజోన్‌లో స్టార్‌ అవుతుంది. స్టేడియం అభివృద్ధిలో బీసీసీఐ ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. ఇందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని మోదీ తెలిపారు.
 
ఈరోజు నుంచి ఆసియన్ గేమ్స్ ప్రారంభమవుతున్నాయని చెబుతూ ఈ క్రీడల్లో భారతదేశం సాధిస్తున్న విజయాలు క్రీడల పట్ల మన దృక్కోణం మారుతోందనడానికి సాక్షంగా నిలుస్తోందని ప్రధాని తెలిపారు. క్రీడాకారులకు ప్రతి స్థాయిలోనూ ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందని హామీ ఇచ్చారు. అలాంటి ప్రభుత్వ పథకాల్లో టీఓపీఎస్ ఒకటని తెలిపారు.
 
ఒకప్పుడు ఆటలాడుకుంటామంటే పిల్లలను తల్లిదండ్రులు మందలిచేవారని, కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆయన చెప్పారు. ఒక ప్రాంతంలో క్రీడలకు సంబంధించిన మౌలిక సౌకర్యాలు కల్పించడం వల్ల ఆ ప్రాంతంలో యువ క్రీడాకారులకు ప్రోత్సహం లభించడమేకాకుండా స్థానికంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ప్రధాని పేర్కొన్నారు.  మొట్టమొదటిసారి ఉత్తర్ ప్రదేశ్‌లో బిసిసిఐ ఆధ్వర్యంలో వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్హానం కానున్నదని, దీనికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయడం సంతోషదాయకమని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. 
 
ఈ కార్యక్రమంలో ప్రముఖ క్రీడాకారులు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి, మదన్‌లాల్, దిలీప్ వెంగ్‌సర్కార్, బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా , సెక్రటరీ జే తదితరులు పాల్గొన్నారు. సచిన్ టెండూల్కర్ ప్రధానికి టీమిండియా జెర్సీ బహూకరించారు. ‘నమో’ అని రాసి ఉన్న ఆ ప్రత్యేకమైన జెర్సీని సచిన్ చేతుల మీదుగా అందుకున్న మోదీ హర్షం వ్యక్తం చేశారు.
ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.451 కోట్లు. యూపీ ప్రభుత్వం ప్రకారం, స్టేడియం కోసం భూమిని సేకరించడానికి రూ. 121 కోట్లు వెచ్చించగా, బీసీసీఐ దాని నిర్మాణానికి రూ. 330 కోట్లు ఖర్చు చేస్తుంది.ఈ స్టేడియంలో 30,000 మంది ప్రేక్షకులకు ఆతిథ్యం ఇవ్వగల సామర్థ్యం కలిగి ఉంటుందని భావిస్తున్నారు. 
 
స్టేడియంలో నెలవంక ఆకారపు పైకప్పు కవర్లు, త్రిశూలం ఆకారంలో ఉన్న ఫ్లడ్‌లైట్లు, బెల్ ఆకులను పోలి ఉండే నమూనాలు, శివుడి ‘ఢమరుకం ‘ ఆకారంలో ఉన్న నిర్మాణాలలో ఒకటి ఉంటాయి. స్టేడియంలోని ప్రేక్షకుల గ్యాలరీ వారణాసి ఘాట్‌ల మెట్లను పోలి ఉంటుంది. రాజాతలాబ్ ప్రాంతంలోని రింగ్ రోడ్ సమీపంలో ఉన్న ఇది డిసెంబర్ 2025 నాటికి సిద్ధంగా ఉంటుందని తెలుస్తోంది.