ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూన్‌ ఆస్తుల స్వాధీనం

ఖలిస్తానీ ఉగ్రవాది, నిషేధిత వేర్పాటువాద సంస్థ సిక్కు ఫర్‌ జస్టిస్‌ (ఎస్‌ఎఫ్‌జె) అధినేత గురుపత్వంత్‌సింగ్‌ పన్నూన్‌కి చెందిన ఆస్తుల్ని ఎన్‌ఐఎ శనివారం స్వాధీనం చేసుకుంది. పంజాబ్‌లోని చండీగఢ్‌లోని అతని ఇంటితోపాటు, అమృత్‌సర్‌లో అతనికి చెందిన భూమిని ఎన్‌ఐఎ జప్తు చేసింది.  పంజాబ్‌లో పన్నూన్‌పై మూడు దేశద్రోహం కేసులతోపాటు 22 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి.
ఎన్‌ఐఎ జప్తు చేయబడిన ఆస్తులలో అమృత్‌సర్‌ జిల్లా శివార్లలో ఉన్న అతని పూర్వీకుల గ్రామమైన ఖాన్‌కోట్‌లోని 46 కెనాల్‌ (5.75 ఎకరాలు) ఆస్తులు ఉన్నాయని ఎన్‌ఐఎ తెలిపింది.  అలాగే చండీగఢ్‌లోని సెక్టార్‌ 15-సిలో 2033 నెంబర్‌ గల ఇంటిని ఎన్‌ఐఎ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  దీంతో చట్టవిరుద్ధమైన ఎస్‌ఎఫ్‌జె జనరల్‌ కౌన్సెల్‌ అయిన పన్నూన్‌ తన ఆస్తి హక్కులను కోల్పోయాడు.
ఇప్పుడు అతని ఆస్తులన్నీ ప్రభుత్వానికి చెందుతాయి. 2020లోనే అతని ఆస్తులు విక్రయించడానికి వీలు లేకుండా ఎన్‌ఐఎ అటాచ్‌ చేసింది. కాగా, కెనడాతో సహా.. వివిధ దేశాల నుంచి నిర్వహించబడుతున్న ఉగ్రవాద వేర్పాటువాద నెట్‌వర్క్‌పై దేశం అణచివేతకు ఈ చర్య పెద్ద బూస్ట్‌ అని ఎన్‌ఐఎ ప్రకటన తెలిపింది. పంజాబ్‌లోని సాహిబ్జాడ అజిత్‌ సింగ్‌ నగర్‌లోని ఎన్‌ఐఎ స్పెషల్‌ కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం గురుపత్వంత్‌సింగ్‌ ఆస్తుల్ని ఎన్‌ఐఎ స్వాధీనం చేసుకుంది.
 
కాగా, ఖలిస్తాన్‌ ఉగ్రవాది హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ హత్యపై రెండు దేశాల మధ్య దౌత్య వివాదాల నేపథ్యంలో ఇండో – కెనడియన్‌ హిందువులను దేశం విడిచి భారత్‌కి వెళ్లిపొమ్మని గురుపత్వంత్‌సింగ్‌ బెదిరించిన ఓ వీడియో వైరల్‌ అయింది.
 
 ‘ఖలిస్తాన్‌ అనుకూల సిక్కులు ఎల్లప్పుడూ కెనడాకు విధేయులుగా ఉంటారు. వారు కెనడా చట్టాలను, రాజ్యాంగాన్ని సమర్థిస్తారు.’ అని అని పన్నూన్‌ ఆ వీడియోలో అన్నారు. నిజ్జర్‌ హత్య కేసులో భారత్‌ హైకమిషనర్‌ సంజరుకుమార్‌ వర్మ కారణమా అనే దానిపై అక్టోబర్‌ 29వ తేదీన వాంకోవర్‌లో పన్నూన్‌ కెనడాలోని సిక్కులకు పిలుపునిచ్చారు.
 
2020 జులైలోనే కేంద్ర హోం మంత్రిత్వశాఖ పన్నూన్‌ని ఉగ్రవాదిగా ప్రకటించింది. అతనికోసం ఇంటర్‌పోల్‌ రెడ్‌ నోటీసు కోసం భారత్‌ అభ్యర్థించింది. అయితే భారత్‌ అభ్యర్థనను ఇంటర్‌పోల్‌ రెండుసార్లు తిరస్కరించింది. గురుపత్వంత్‌సింగ్‌ పన్నూన్‌ పంజాబ్‌, ఇతర ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యాకలపాలను ప్రోత్సహించడంలో కీలక పాత్రధారిగా ఉన్నాడని ఆరోపిస్తూ ఎన్‌ఐఎ 2019లో మొదటి కేసు నమోదు చేసింది.
ఫిబ్రవరి 3 2021న ఎన్‌ఐఎ ప్రత్యేక కోర్టు అతనిపై నాన్‌బెయిలబుల్‌ అరెస్టువారెంట్లు జారీ చేసింది.  గత ఏడాది నవంబర్‌ 29న ప్రకటిత నేరస్తుడి (పిఓ)గా ఎన్‌ఐఎ ప్రకటించింది. దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భద్రతను సవాల్‌ చేస్తూ.. ఖలిస్తాన్‌ రాష్ట్రం కోసం పోరాడాలని పంజాబ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్లు, యువతను పన్నూన్‌ రెచ్చగొట్టినట్లు దర్యాప్తులో తేలిందని ఎన్‌ఐఎ తెలిపింది.