జమిలి ఎన్నికలపై రాజకీయ పార్టీల అభిప్రాయాలు ఆహ్వానం

జమిలి ఎన్నికల నిర్వహణపై సూచనలు, అభిప్రాయాల సేకరణకు గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు, పార్లమెంటులో ప్రతినిధులు కలిగిన పార్టీలు, గుర్తింపు పొందిన ఇతర రాష్ట్ర పార్టీలను ఆహ్వానించాలని మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్రం నియమించిన కమిటీ నిర్ణయించింది.
 
దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలు అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన ఈ కమిటీ తొలి భేటీని శనివారం  నిర్వహించింది. ఈ భేటీలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు.  ఢిల్లీలో తొలిసారి సమావేశమైన జమిలి ఎన్నికల కమిటీ భేటీలో ముందుగా ఛైర్మన్ కోవింద్ సభ్యులకు సమావేశ అజెండాను వివరించారు. ఈ క్రమంలోనే జమిలి ఎన్నికలపై సూచనలు, అభిప్రాయాలను సేకరించేందుకు గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీలను ఆహ్వానించాలని కమిటీ నిర్ణయం తీసుకుంది.
 
వీరితో పాటు లా కమిషన్ ప్రతినిధుల్ని కూడా ఆహ్వానించాలని కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు కమిటీ తరఫున ఓ ప్రకటన విడుదల చేశారు. మరోవైపు జమిలి ఎన్నికలకు అవసరమైన దస్త్రాల సన్నద్ధత, సంబంధిత పక్షాలతో సంప్రదింపులు ఎలా నిర్వహించాలి, జమిలి ఎన్నికలపై అధ్యయనం వంటి అంశాలపై ఈ భేటీలో చర్చించినట్లు ప్రకటనలో వెల్లడించారు. 
 
దీంతో ఈ కమిటీ రెండో భేటీ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఉండబోతోందని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల నిర్వహణకు వీలుగా కేంద్రం వేగంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా జమిలి ఎన్నికలపై నియమించిన కమిటీ త్వరలో తమ నివేదిక ఇస్తే దానికి అనుగుణంగా ఎన్నికల కమిషన్ తో మిగతా చర్యలు చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని కేంద్రం యోచిస్తోంది.