తెలంగాణ గ్రూప్ -1 పరీక్షలు మళ్లీ రద్దు

తెలంగాణలో నిర్వహించిన గ్రూప్ – 1 పరీక్షపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది.  పరీక్షలో బయోమెట్రిక్ వివరాలు తీసుకోలేదని అనుమానం వ్యక్తం చేస్తూ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేశారు.  హాల్ టికెట్ నంబర్ లేకుండా ఓంఎఆర్ షీట్ ఇచ్చారని అభ్యర్థులు ఆరోపించారు. దీంతో అభ్యర్థుల పిటిషన్లను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు జూన్ 11న జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసింది.
దీనిపై విచారించిన ఉన్నత న్యాయస్థానం పరీక్షలను మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది.  ఈ నెల 11న గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్ష సాఫీగా ముగిసిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 994 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. పరీక్షకు 3,80,081 మంది దరఖాస్తు చేసుకోగా 2,33,248 మందే హాజరయ్యారు. హాజరు శాతం 61.37గా నమోదైంది.
టీఎస్‌పీఎస్సీలో లీకేజీ వ్యవహారం కారణంగా ప్రిలిమ్స్‌ పరీక్షను మళ్లీ నిర్వహించింది.  ఈ నేపథ్యంలో అన్ని పరీక్ష కేంద్రాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిబంధలను కఠినంగా అమలు చేశారు. అయితే, గత గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షలో అభ్యర్థుల బయోమెట్రిక్‌ తీసుకోగా ఈసారి అలా చేయలేదు.
 
కిషన్ రెడ్డి విమర్శ
 
కేసీఆర్ ప్రభుత్వ అసమర్థ ప్రజాపాలన, సరైన నిర్ణయాలు తీసుకోవడంలో వైఫల్యం కారణంగా వరుసగా రెండోసారి రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు రద్దుకావడం పట్ల కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.  ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న 4 లక్షల మంది యువతలో నైరాశ్యం నింపేలా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.

ఇటీవలే జరిగిన పేపర్ లీక్ ఘటన ఈ సందర్భంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కాస్తయినా జాగ్రత్తగా వ్యవహరిస్తోందనుకుంటే  మళ్లీ అదే అసమర్థత, అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందని కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.  గ్రూప్-1 పరీక్షలో అక్రమాలను అరికట్టేందుకు దరఖాస్తుదారుల బయోమెట్రిక్ తీసుకోవడం తప్పనిసరి అంటూ నియామక నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

 
అయినా, ఆ తర్వాత బయోమెట్రిక్ తప్పనిసరి కాదంటూ వ్యవహరించడం యువతకు న్యాయబద్ధంగా ఉద్యోగాలు కల్పించే విషయంలో బీఆర్ఎస్ సర్కారు ఆలోచన సరళిని స్పష్టం చేస్తుందని విమర్శించారు.  రాష్ట్రంలో యువత భవిష్యత్తుకు భద్రత, భరోసా కల్పించలేని కేసీఆర్ ప్రభుత్వానికి అధికారంలో ఉండే నైతిక అర్హత లేదని ఆయన స్పష్టం చేశారు.