కులాంతర వివాహాలు ధర్మ సమ్మతమే

కులాంతర వివాహాలు ధర్మ సమ్మతమే అని సామాజిక సమరసత జాతీయ కన్వీనర్ శ్యాం ప్రసాద్ స్పష్టం చేశారు.  కులాంతర వివాహాలు చేసుకొని, సుదీర్ఘకాలం అన్యోన్య దాంపత్యం గడుపుతున్న ఆదర్శ దంపతులను వరంగల్ లో కాకతీయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొంటూ  కులాంతర వివాహాలు చేసుకున్న వారికి అందరం అండగా నిలబడాలని ఆయన సూచించారు.
వివాహం కేవలం ఇద్దరి వ్యక్తుల మధ్య పరిమితమైన వ్యవస్థ కాదని, రెండు కుటుంబాల మధ్య బంధం, అనుబంధం ఏర్పరచే వ్యవస్థ అని ఆయన తెలిపారు. `మా పెళ్లి మా ఇష్టం’ అంటే సరిపోదని ఆయన యువతకు హితవు చెప్పారు. వివాహం విషయంలో తమ ఎంపికల గురించి తల్లిదండ్రులకు నచ్చ చెప్పాలని, వారి మనోభావాలను మన్నించాలని సూచించారు.  కులాంతర వివాహం చేసుకోవడంతో పూర్తి కాలేదని జీవితంలో సమస్యలు ప్రారంభం అయినట్లుగా గుర్తించాలని చెప్పారు. గృహస్తులుగా అన్యోన్యంగా ఉంటూ,మీరూ సామాజిక బాధ్యతలను నిర్వహిస్తూ, సంతానాన్ని సంస్కార వంతులుగా తీర్చి దిద్దినపుడే మీరు ఆదర్శ దంపతులు అవుతారని శ్యాంప్రసాద్ చెప్పారు.
మహా భారత కాలం వరకు వర్ణ వ్యవస్థ ఉండేదని పేర్కొంటూ వర్ణ వ్యవస్థకు ఆధారం గుణం అని, జన్మ కాదని స్పష్టం చేశారు. వశిష్ట, అరుంధతీలది వర్ణాంతర వివాహం అని, వారు ఆదర్శ దంపతులని పేర్కొన్నారు.  నేడున్నది కుల వ్యవస్థ అంటూ కులాల పేరున హెచ్చు తగ్గులు, అస్పృశ్యత పాటించడం తగదని స్పష్టం చేశారు. పైగా, ఇవి ధర్మ సమ్మతం కాదని తెలిపారు.
“హిందవః సోదరా సర్వే, హిందువులు అందరూ సోదరీ, సోదరులు. ఇది మన ఆలోచనలకు, వ్యవహారానికి దిక్సూచి కావాలి. కులాంతర వివాహం చేసుకున్న కారణంగా కన్న తల్లిదండ్రులకు సైతం తమ పిల్లలను చంపే హక్కు లేదు” అని శ్యాంప్రసాద్ వివరించారు.  పెద్దలు నిర్ణయం చేసిన వివాహం అయినా, కులాంతర వివాహం అయినా దంపతుల మధ్య సమస్యలు వస్తూ ఉంటాయని చెప్పారు.
చిన్న,చిన్న కారణాలతో పెరుగుతున్న విడాకులు, ఇద్దరినీ సర్డుబాటు చేయక విడాకులకు ప్రోత్సహిస్తున్న  తల్లిదండ్రుల నేటి ప్రవృత్తి ప్రమాదకరం అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.  కులాంతర వివాహం చేసుకున్న దంపతులు మరిన్ని సమస్యలు ఎదుర్కోవడానికి తయారు కావాలని సూచించారు. 
సభకు అధ్యక్షత వహిస్తూ సామజిక సామరస్యంకోసం కులాంతర వివాహాలను ఓ సామాజిక ఉద్యమంగా చేపట్టిన స్వామి దయానంద ఒక గొప్ప సామాజిక సంస్కర్త అని కాకతీయ విశ్వవిద్యాలయంకు చెందిన  మాజీ డీన్ ఆచార్య కె.విజయబాబు తెలిపారు. మన పూర్వీకులు అందించిన గొప్ప జీవన విలువలను కాపాడుకుంటూ, మధ్య కాలంలో వచ్చిన దురాచారాలను లేకుండా చేయడమే సామాజిక సంస్కర్తల ఆశయమని ఆయన చెప్పారు.
పశ్చిమాన స్వామి దయానంద, మహాత్మా జ్యోతిబా ఫూలే, తూర్పున రాజా రామ మోహన రాయ్, ఆంధ్ర ప్రదేశ్ లో కందుకూరి వీరేశలింగం, తెలంగాణలో భాగ్యరెడ్డి వర్మ ఈ సామాజిక సంస్కరణ ఉద్యమంలో అగ్రేసరులు అని ఆయన వివరించారు.  దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో సామాజిక సంస్కరణ ఉద్యమాల చరిత్రను వివరించారు.
వివాహ వ్యవస్థను కాపాడు కోవాలని, మన ప్రాచీన జీవన విలువలను కాపాడు కోవాలని కాకతీయ విశ్వవిద్యాలయంకు చెందిన ఆచార్య గిరిజా మనోహర బాబు చెప్పారు. ఆర్.ఎస్.ఎస్. వరంగల్ విభాగ్ సంఘ్ చాలక్ డా.చిలకమారి సంజీవ కూడా పాల్గొన్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న దంపతులు తమ అనుభవాలను వివరించారు. సమసతా సందేశం ఇచ్చే పాటను శ్రీ ఆప్పాల ప్రసాద్, తెలంగాణ సమరసత రాష్ట్ర కన్వీనర్, జాతీయ కళా మంచ్ కన్వీనర్ పాడారు. ఈ అభినందన కార్యక్రమాన్నిలక్ష్మణా చారి, విష్ణు
నిర్వహించారు.