
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు శుక్రవారం అటు హైకోర్టులో, ఇటు ఎసిబి కోర్టులో చుక్కెదురైంది. ఆయన తరపున దాఖలైన క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. మరోవంక విజయవాడలోని ఎసిబి కోర్టు కేసు దర్యాప్తు నిమిత్తమై రెండు రోజులపాటు ఏపీ సిఐడి కస్టడీకి ఇచ్చేందుకు అనుమతించింది.
హైకోర్టులో 17ఏ, 409 సెక్షన్ల పై గత వారం చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో సిఐడి వాదనలతో ఏకీభవించిన హైకోర్టు చంద్రబాబు పిటిషన్లను తోసిపుచ్చింది. చంద్రబాబు తరపున హరీష్ సాల్వే, సీఐడీ తరపున ముఖుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. చంద్రబాబు నాయుడు రిమాండ్ గడువు ముగియడంతో శుక్రవారం ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏసీబీ న్యాయమూర్తి విచారించి 24వరకు రిమాండ్ పొడిగిస్తున్నట్లు ఎసిబి కోర్టు న్యాయమూర్తి ప్రకటించారు.
సెప్టెంబర్ 10న ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన తర్వాత ఎఫ్‌ఐఆర్ ను కొట్టేసి చేసి రిమాండ్ రద్దు చేయాలని చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుల్లో వాదనలు నాలుగు రోజుల క్రితమే పూర్తయ్యాయి. చివరకు హైకోర్టులో చంద్రబాబుకు నిరాశ తప్పలేదు. ఈ కేసులో న్యాయమూర్తి శ్రీనివాసరెడ్డి పిటిషన్ డిస్మిస్ అంటూ ఏక వాక్యంలో క్వాష్ పిటిషన్‌పై ఉత్తర్వులు వెలువరించారు. క్వాష్ పిటిషన్ కొట్టివేసిన కేసులో హైకోర్టు కీలక విషయాలను ప్రస్తావించింది. విచారణ కీలక దశలో క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఆపడం సరికాదని అభిప్రాయపడింది.
ప్రత్యేకమైన సందర్భాల్లో తప్ప ప్రతిసారి పిటిషన్‌ను క్వాష్ చేయలేమంది. విచారణ పూర్తి చేసే అధికారాన్ని దర్యాప్తు సంస్థకు ఇవ్వాలని ప్రస్తావించారు.సీఆర్‌పీసీ 482 కింద దాఖలైన పిటిషన్‌పై మినీ ట్రయల్ నిర్వహించలేమని తెలిపింది. 140 మందిని సీఐడీ విచారించిందని, నాలుగు వేల దాకా డాక్యుమెంట్లు సేకరించిందని పేర్కొంది.
ఈ దశలో ఈ విచారణలో జోక్యం చేసుకోలేమంటూ చెబుతూ క్వాష్ పిటిషన్ ను కొట్టివేస్తున్నట్లు తెలిపింది. హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు చంద్రబాబు తరపు న్యాయవాదులు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ అప్పీల్ కు వెళ్లనున్నారు. ఆ దిశగా ఆయన తరపున న్యాయవాదులు అడుగులు వేశారని తెలుస్తోంది.
క్వాష్ పిటిషన్ కొట్టివేయటంతో పాటు చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు తీర్పు ఇవ్వటంతో స్కిల్ స్కామ్ లో కీలక పరిణామాలుగా మారాయి. చంద్రబాబును ఐదు రోజులు కస్టడీ కోరుతూ సీఐడీ విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై ఇరువర్గాల వాదనలు ముగిశాయి.
కస్టడీ పిటిషన్ పై శుక్రవారం ఉదయమే తీర్పు ఉన్నప్పటికీ మధ్యాహ్నం తర్వాత న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
స్కిల్ స్కాంలో చంద్రబాబును రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో చంద్రబాబును కస్టడీలోకి తీసుకుని స్కిల్ స్కామ్ గురించి లోతుగా విచారించనుంది ఏపీ సీఐడీ. చంద్రబాబును జైల్లోనే విచారించేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటలలోపు విచారణ పూర్తి చేయాలని సీఐడీని ఆదేశిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు.
విచారణ సమయంలో చంద్రబాబు తరపున ఒక్కరు లేదా ఇద్దరు న్యాయవాదులు ఉండేలా అనుమతించారు. ఇక విచారణ జరిపే సీఐడీ అధికారుల పేర్లు ఇవ్వాలని కోరిన న్యాయమూర్తి.. చంద్రబాబు విచారణ వీడియోలు బయటకు రాకుండా చూడాలని స్పష్టం చేశారు.
More Stories
జమ్ముకశ్మీర్లో 12 మంది పాక్ చొరబాటుదారులు కాల్చివేత
రామ జన్మభూమిలో తొలి `కరసేవక్’ కామేశ్వర చౌపాల్ మృతి
ఐదేళ్లలో తొలిసారి వడ్డీ రేట్లు తగ్గింపు