అసెంబ్లీలో విజిల్ ఊదుతూ ప్రభుత్వంపై బాలకృష్ణ నిరసన

టిడిపి అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రిమాండ్ కు వెళ్లిన తర్వాత ఆ పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రాజకీయంగా క్రియాశీలకంగా కనిపిస్తున్నారు.  ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో సైతం ఆయన గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. టిడిపి సభ్యులతో కలిసి ఆయన స్పీకర్ పోడియంలోకి వెళ్తున్నారు.

శుక్రవారంసభలో చంద్రబాబు సీటుపైకి ఎక్కి విజిల్ ఊదారు. విజిల్ ఊదుతూ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు విజిల్ ఊదిన బాలయ్యపై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. చంద్రబాబు సీటుపైకి ఎక్కడం ఎందుకు, ఆ సీట్లో కూర్చోవాలని ఎద్దేవా చేశారు. 

తండ్రిని చంపిన బావ కళ్లలో ఆనందం చూసేందుకు బాలకృష్ణ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల తర్వాత ఇంటికి వెళ్లి విజిల్ ఊదుకోవాల్సిందేనని చెప్పారు. మరోవైపు, చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని తిరస్కరించారు. దీంతో, టిడిపి సభ్యులు తన నిరసనను మరింత తీవ్రతరం చేశారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాల రెండో రోజు కూడా గందరగోళం కొనసాగింది. సభ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియంను ముట్టడించారు. సిఎం జగన్మోహన్‌ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అందుకు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అంబటి రాంబాబు  అభ్యంతరం వ్యక్తం చేశారు.  దరిద్రపు పాలన పోవాలని టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు.

సీఎం జగన్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తాము వూరుకోబోమని అంబటి హెచ్చరించారు. ఇది టీడీపీ ఆఫీస్ కాదని గుర్తు పెట్టుకోవాలని హితవు చెప్పారు. అయినా కూడా టీడీపీ సభ్యులు తగ్గలేదు. టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు కొనసాగిస్తున్నారు. ప్లకార్డులను వారి వద్ద నుంచి తీసుకోవాలని స్పీకర్‌ను మంత్రి జోగి రమేష్ కోరారు. 

అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని టీడీపీ ఎమ్మెల్యేల నినాదాలు చేశారు. చంద్రబాబుపై అక్రమ కేసులు ఎత్తివేయాలని నినాదాలు చేశారు. సైకో పాలన పోవాలని నినాదాలు చేశారు. టీడీపీ సభ్యుల నినాదాలు మధ్య.. అసెంబ్లీ ప్రారంభమైన క్షణాల్లోనే అసెంబ్లీని స్పీకర్ వాయిదా వేశారు.

కాగా, రెండో రోజు కూడా టిడిపి సభ్యులను సభ నుండి సస్పెండ్ చేయడంతో, అధికారపక్షం తీరుకు నిరసనగా ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించినట్లు టీడీపీ ఎమ్మల్యేలు ప్రకటించారు. రేపట్నుంచి శాసనసభ, మండలికి హాజరుకాబోమని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు.