మహిళా బిల్లుకు పార్లమెంటు ఆమోదం

చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ల బిల్లుకు రాజ్యసభ గురువారం ఆమోదముద్ర వేసింది. చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే 128వ రాజ్యాంగ సవరణ బిల్లుకు రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. నారీ శక్తి వందన్‌ అధినియమ్‌ పేరిట తీసుకొచ్చిన బిల్లును కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ రాజ్యసభలో ప్రవేశపెట్టారు.
 
ఈ బిల్లు ఇప్పటికే లోక్ సభలో బుధవారం ఆమోదం పొందగా, తాజాగా రాజ్యసభలో ఏకగ్రీవంగా ఆమోదం తెలపడంతో మొత్తం పార్లమెంట్ ఆమోదం తెలిపినట్లయినది.  రాజ్యసభలో సుమారు 11 గంటల పాటు బిల్లుపై చర్చ జరిగిన అనంతరం మాన్యువల్‌ పద్ధతిలో ఓటింగ్‌ నిర్వహించారు.  పార్టీలకతీతంగా సభ్యులందరూ ఈ బిల్లుకు మద్దతుగా నిలిచారు.
 
మొత్తం 215 మంది సభ్యులు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయగా.. బిల్లును ఒక్కరూ కూడా వ్యతిరేకించకపోవడం విశేషం. ఈ మేరకు ఓటింగ్‌ అనంతరం బిల్లును రాజ్యసభ ఆమోదించినట్టు రాజ్యసభ చైర్మన్‌, ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖర్‌ ప్రకటించారు. దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణకు నేటితో తెరపడినట్లు అయింది.
 
ఉభయ సభల్లోనూ ఆమోదం పొందిన ఈ బిల్లు జనగణన, డీలిమిటేషన్‌ ప్రక్రియ అనంతరం కార్యరూపం దాల్చే అవకాశంఉంది. లోక్‌సభ ఆమోదించిన మహిళా రిజర్వేషన్ల బిల్లును కేంద్ర ప్రభుత్వం గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఈ బిల్లుపై చర్చలో పాల్గొన్నారు. 
 
కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ మాట్లాడుతూ నూతన పార్లమెంట్‌ భవనానికి మంచి ప్రారంభం లభించిందని తెలిపారు. చరిత్రాత్మకమైన మహిళా రిజర్వేషన్ల బిల్లును నూతన పార్లమెంట్‌లో ఆమోదించుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు.  గత తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్నా.. మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఎందుకు తేలేదనే ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందిస్తూ ‘‘ఏకాభిప్రాయాన్ని తీసుకురావడాన్నే మేం నమ్ముతాం’’ అని స్పష్టం చేశారు.
 
ఈ సందర్భంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు, ఆ పార్టీ రాజ్యసభాపక్ష నేత మల్లికార్జున ఖర్ ఇప్పటికప్పుడు మహిళా రిజర్వేషన్‌ బిల్లును అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ‘‘చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలు ఎప్పటిదాకానో ఎందుకు? వచ్చే ఏడాది జరిగే ఎన్నికల నుంచే అమలు చేయండి. రాజ్యాంగ సవరణ పెద్ద పనికాదు. మీరు తలుచుకుంటే ఇప్పుడే చేసేయొచ్చు. ఐనా 2031 వరకు ఆగ డం అంటే అర్థం ఏమిటి?’’ అంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, ఆ పార్టీ రాజ్యసభా పక్ష నేత మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 
 
జిల్లా పరిషత్‌, పంచాయతీల్లో మహిళా రిజర్వేషన్‌ ఉన్నందున చట్టసభల్లోనూ అమలు చేసేందుకు ఇబ్బంది ఏమిటని నిలదీశారు. ఖర్గే విమర్శలను బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కొట్టిపారేస్తూ మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించి రాజ్యాంగం ప్రకారం సరైన పద్ధతిలో వెళ్లాలని భావిస్తున్నామని స్పష్టం చేశారు.
 
అంతకు ముందు, బుధవారం లోక్‌సభలో పార్టీలకతీతంగా 454 మంది ఎంపీలు బిల్లుకు మద్దతుగా నిలిచారు.  ఏఐఎంఐఎం పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు మాత్రమే దీనికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఉభయసభల్లోనూ ఈ బిల్లుకు ఆమోదముద్ర పడింది. దీని తర్వాత సుమారు దేశంలోని సగం అసెంబ్లీలు కూడా బిల్లుకు మద్దతు తెలపాల్సి ఉంది. 
 
ఈ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో వివిధ పార్టీలకు చెందిన 132 మంది సభ్యులు భాగస్వాములయ్యారని ప్రధాని మోదీ తెలిపారు. ఈ బిల్లుకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు.   ఈ బిల్లు ప్రకారం లోక్ సభ, అసెంబ్లీలో మూడోవంతుకు సమానమైన సీట్లను మహిళలకు కేటాయించాలి. 
 
అందులో మూడో వంతు సీట్లను ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన మహిళలకు కేటాయించాలి. లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలు, ఢిల్లీ అసెంబ్లీలలో మహిళలకు రిజర్వ్ అయిన సీట్ల రొటేషన్ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ అనంతరం ప్రారంభమవుతుంది.