24 నుంచి హైదరాబాద్- బెంగళూరు, విజయవాడ- చెన్నై వందే భారత్

 
* ఒకేసారి 9 వందే భారత్ రైళ్లు

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సెమీ హైస్పీడ్ వందే భారత్ రైళ్లు దేశంలోని వివిధ నగరాల మధ్య సేవలందిస్తున్నాయి. కాగా, రానున్న రోజుల్లో మరిన్ని రూట్లకు చైర్‌కార్, స్లీపర్, మినీ వందే భారత్ రైళ్ల సర్వీస్‌లను విస్తరించాలని కేంద్రంలోని ప్రధాని మోదీ సర్కార్ యోచిస్తోంది.

ఇక‌, సెప్టెంబర్ 24న మరో తొమ్మిది కొత్త వందే భారత్ రైళ్లు పట్టాలపైకి తీసుకొచ్చేందుకు ముహూర్తం ఖరారు చేసింది. పూరీ- రూర్కెలా, కాసర్‌గోడ్- త్రివేండ్రం, ఉదయపూర్- జైపూర్, రాంచీ-హౌరా, తిరునెల్వేలి- చెన్నై, పాట్నా-హౌరా, హైదరాబాద్- బెంగళూరు, జామ్‌నగర్- అహ్మదాబాద్, విజయవాడ- చెన్నై రూట్లలో ఈ కొత్త‌ వందే భారత్ ట్రైన్లు సేవలందించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక‌ హైదరాబాద్ – బెంగళూరుల మధ్య ప్రారంభం కానున్న వందే భార‌త్ రైలు కాచిగూడ నుంచి యశ్వంత్ పూర్‌కు మధ్య తిరుగుతుందని దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ఈనెల 24వ తేదీన 12.30 గంటలకు ప్రారంభిస్తారు. ఉదయం 5.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం రెండు గంటలకు వందే భారత్ రైలు యశ్వంత్ పూర్‌కు చేరుకుంటుంది.

మధ్యలో మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం స్టేషన్లలోనే ఆగుతుంది. మధ్యాహ్నం 2.45 గంటలకు యశ్వంత్‌పూర్ లోబయలుదేరి రాత్రి 11.15 గంటలకు కాచికూడ చేరుకుంటుంది.  అదే రోజున, విజయవాడ- చెన్నై వందేభారత్‌ రైలు కూడా ప్రారంభం అవుతుంది. ఇప్పటి వరకు గ్రాండ్‌ ట్రంక్‌ మార్గంలో చెన్నై వెళ్లే రైళ్లన్నీ గూడూరు మీదుగా సుళ్లూరు పేట వైపు ప్రయాణిస్తాయి. విజయవాడ నుంచి చెన్నై వెళ్లే రైళ్లన్నీ గూడూరు నుంచి నేరుగా చెన్నైకు వెళతాయి. 

వందే భారత్‌ రైలు మాత్రం గూడూరు నుంచి శ్రీకాశహస్తి, రేణిగుంట, అరక్కోణం, తిరువళ్లూరు మీదుగా చెన్నైకి వెళుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. తిరుపతి వెళ్లే ప్రయాణికుల సౌకర్యం కోసం ఈ రైలును శ్రీకాళహస్తి, రేణిగుంట మార్గంలో నడుపుతున్నట్లు తెలిపారు.  మరోవైపు తెలుగు రాష్ట్రాల నుంచి ఈనెల 24న పట్టాలు ఎక్కనున్న రెండు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో సౌకర్యాలను రైల్వేశాఖ మెరుగుపరిచింది.

కొత్త రైళ్లలో దాదాపు 25 రకాల మార్పులు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. వందేభారత్‌ రైళ్లన్నింటిలో కూర్చుని ప్రయాణించాల్సి ఉంటుంది.  గరిష్టంగా ఎనిమిదిన్నర గంటల ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ సీట్లలో ఎనిమిదిన్నర గంటలపాటు కూర్చోవాల్సి వస్తుండటంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు.

సీట్లు వెనక్కి వాలే అవకాశం లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ప్రయాణంలో మరింత వెనక్కి వాలి నిద్రపోయేలా పుష్‌బ్యాక్‌‌ సదుపాయంతో పాటు, సీట్ల మెత్తదనాన్ని పెంచారు.  మొబైల్‌ ఛార్జింగ్‌ పాయింట్‌ను, ఫుట్‌రెస్ట్‌ను అందుబాటులోకి తెచ్చారు. మరుగుదొడ్లలో వెలుతురు, వెంటిలేషన్ సదుపాయాలు అభివృద్ధి చేశారు. వాష్‌బేసిన్ల సైజు పెంచారు. సీట్లలో కూర్చునే వారికి ఏసీ అధికంగా రావడానికి ప్యానెళ్లలో మార్పులు చేశారు. ఏసీ అడ్జస్ట్‌మెంట్‌ సదుపాయాలు కల్పించారు.