కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలే

ఏ రాజకీయ నాయకుడైనా హమీలు ఇచ్చాడంటే అమలు చేయాలి.. కాని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలయ్యాయని బిజెపి ఎమ్మెల్యే, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు కేసీఆర్ పేదలకు 10 లక్షల డబల్ బెడ్ రూంలు ఇస్తానన్నాడు.. వాటి జాడే లేదు, ఉద్యోగం లేని వారికి రూ. 3,016 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఎందుకు ఇవ్వడం లేదు? మనసు లేకనేనా అని ప్రశ్నించారు. 

75 ఏళ్ల స్వతంత్ర భారతంలో మహిళల దశాబ్ధాల నిరీక్షణకు తెరదించుతూ, వారి ఆకాంక్షను నెరవేరుస్తూ, చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన ‘నారీశక్తి వందన్‌ అధినియమ్‌’బిల్లును ప్రవేశపెట్టడంతో పాటు ఆమోదించేందుకు కృషిచేసిన ప్రధాని నరేంద్ర మోదీకి ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు.

రాష్ట్రంలో ఆయా పార్టీలు హామీలు, మేనిఫెస్టోలు రూపొందిస్తూ అనేక రకాల పథకాలు ప్రకటిస్తున్నరని,  రైతుల డిక్లరేషన్, యువత డిక్లరేషన్, ఉమెన్ డిక్లరేషన్… అంటూ కొందరు ఊదరగొడుతున్నారని తెలిపారు. సంక్షేమ పథకాలను ఉద్దేశిస్తూ తన అమ్ముల పొదిలో అనేక అస్త్రాలున్నాయని కేసీఆర్ స్వయంగా అసెంబ్లీ వేదికగా చెప్పిండని ఆయన గుర్తు చేశారు.

హుజురాబాద్ ఉపఎన్నికల సమయంలో ఎన్ని కష్టాలైనా దళితబంధు కోసం రూ.2 లక్షల కోట్లు అమలు చేస్తానన్నడని చెప్పారు.  రైతులకు ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ అంటూ అనేక హామీలిచ్చిన కేసీఆర్ ఆ హామీలు ఎందుకు అమలు చేయలేదు? అంటూ ఈటెల నిలదీశారు.  ఒడ్డు దాటే దాకా ఓడ మల్లన్న .. ఒడ్డు దాటినాక బోడ మల్లన్న అన్న మాదిరిగా ఉంది కేసీఆర్ తీరు అంటూ దుయ్యబట్టారు.

రింగురోడ్డు, కోకాపేట భూమల అమ్మకం, మద్యం దుకాణాల టెండర్ల ద్వారా వచ్చిన ఆదాయంతో రుణమాఫీ చేస్తున్నారని గుర్తు చేశారు. 3 నెలల ముందుగానే మద్యం దుకాణాల టెండర్లు వేయడమే కాకుండా  వైన్ టెండర్ల పేరుతో వ్యాపారస్తుల నుంచి రూ. 2,600 కోట్లు జేబులు కత్తిరించారని విమర్శించారు. 57  ఏళ్ళకే పెన్షన్లు, వితంతు పెన్షన్లు కూడా ఇస్తా అని మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ అంటూ డబ్బు లేకనే ఈ పథకాలను అమలు చేయడం లేదని రాజేందర్ స్పష్టం చేశారు. గతంలో ఎమ్మార్వో కు దరఖాస్తు చేసుకుంటే పెన్షన్ వచ్చేదని, ఇప్పుడు కేసీఆర్ ఓకే చేస్తే తప్ప పెన్షన్ వచ్చే పరిస్థితి లేదంటూ మండిపడ్డారు.

రాష్ట్రం దివాళా తీసింది అని ప్రచారం చేసే కాంగ్రెస్ వారిచ్చే హామీలు ఎలా అమలు చేస్తారో ఎందుకు చెప్పడం లేదు?  అంటూ  ప్రశ్నించారు. గతం లో ఆర్థిక మంత్రి గా పనిచేసిన అనుభవం తో చెబుతున్నా కాంగ్రెస్ వారు ఏది పడితే ఆ పథకం ప్రకటించకండి  అంటూ హెచ్చరించారు.  ప్రతి మహిళకు రూ. 2,500 చొప్పున పెన్షన్ ఇస్తామన్న కాంగ్రెస్  అందులో ఏ మహిళలకు ఇస్తారు? వయస్సు వారికి ఇస్తారు? ఎంత మందికి ఇస్తారనేది ఎందుకు చెప్పడం లేదు? అంటూ ప్రశ్నించారు.

ఆర్థిక మంత్రిగా పని చేసిన తనకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై అవగాహన ఉందని చెబుతూ కేంద్ర ప్రభుత్వ అండదండలతో సాధ్యమయ్యే మంచి స్కీమ్ లను తెలంగాణ లో ప్రవేశ పెడతామని వెల్లడించారు. అధిష్టానంతో, పార్టీ ఏర్పాటు చేసిన కమిటీ ఆధ్వర్యంలో రైతులు, కౌలు రైతులు, మహిళలు.. అన్ని వర్గాల ప్రజలకు ఏం అవసమో.. అమలుకు నోచుకునే అంశాలతో కూడిన మేనిఫెస్టోను రూపొందిస్తామని హామీ ఇచ్చారు.