చారిత్రక మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

చారిత్రక మహిళా రిజర్వేషన్‌ బిల్లు (నారీ శక్తి వందన్ అధినియం)కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. సుమారు 8 గంటల చర్చ తర్వాత ఈ బిల్లుపై ఓటింగ్‌ నిర్వహించారు. రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉండటంతో స్లిప్‌ల ద్వారా ఓటింగ్‌ చేపట్టారు. సభలో ఉన్న మొత్తం 456 సభ్యుల్లో 454 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు.
 
ఎంఐఎంకు చెందిన ఇద్దరు సభ్యులు మహిళా బిల్లును వ్యతిరేకించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించే ఈ బిల్లుకు సుమారు 27 ఏండ్ల తర్వాత మోక్షం లభించింది. అయితే డీలిమిటేషన్‌ తర్వాతే మహిళలకు రిజర్వేషన్‌ కోటా అమలుకానున్నది.
 
కాగా, కొన్ని పార్టీలకు మహిళా రిజర్వేజన్ బిల్లు రాజకీయ అంశం కావచ్చేమో కానీ, బీజేపీకి ఎంతమాత్రం కాదని, తమ పార్టీకి, తమ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ బిల్లు మహిళా సాధికారతకు చెందిన అంశమని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కొత్త శకానికి ఆరంభమని, మహిళా ప్రగతికి సంబంధించిన విజన్‌ను ప్రధాని మోదీ జి-20లో ఆవిష్కరించారని చెప్పారు.
 
మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చలో అమిత్‌షా పాల్గొంటూ, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును తమ ప్రభుత్వం మంగళవారంనాడు పార్లమెంటులో ప్రవేశపెట్టిందని, భారత పార్లమెంటరీ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించవలసిన రోజు ఇదని తెలిపారు.  ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి మహిళా భద్రత, గౌరవం, సమప్రాధాన్యం అనేవి ప్రభుత్వానికి కీలక ప్రాధాన్యతలుగా ఉన్నాయని పేర్కొన్నారు. దేశానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం, విధానాల రూపకల్పనలో మహిళలకు భాగస్వామ్యాన్ని ఈ బిల్లు కల్పిస్తుందని అమిత్ షా చెప్పారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు గతంలో నాలుగుసార్లు పార్లమెంటు ముందుకు తీసుకువచ్చారని, కానీ ఆమోదానికి నోచుకోలేదని గుర్తు చేశారు. ఇది ఐదవ ప్రయత్నమని, ఇప్పుడైనా ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించాలని అమిత్‌షా కోరారు. మాజీ ప్రధాని దేవెగౌడ నుంచి మన్మోహన్ వరకూ బిల్లును తీసుకువచ్చేందుకు గతంలో ప్రయత్నాలు జరిగాయని, అయినా బిల్లు ఆమోదించకపోవడానికి కారణం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

ప్రస్తుతం జనరల్, ఎస్సీ, ఎస్టీ అనే మూడు కేటగిరిల్లో పార్లమెంటు సభ్యుల ఎన్నిక జరుగుతోందని, ఒక్కో కేటగిరిలో మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్ వర్తిస్తుందని ఆయన చెప్పారు. ఓబీసీలు, ముస్లింలకు రిజర్వేషన్ లేనందున బిల్లుకు మద్దతు ఉండకపోవచ్చంటూ కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని, బిల్లుకు మీరు (ఎంపీలు) మద్దతు ఇవ్వకుంటే రిజర్వేషన్ల సత్వర అమలు సాధ్యమయ్యే పనేనా? అని ఆయన ప్రశ్నించారు. ”మీరు మద్దతిస్తే, కనీసం ఒక గ్యారెంటీ అయినా ఉంటుంది” అని అమిత్‌షా సూచించారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత సోనియాగాంధీ అంతకు ముందు స్పష్టం చేశారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలన్నది తన భర్త, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్వప్నం అని ఆమె గుర్తు చేశారు.

కాగా, ఈ నెల 19న కొత్త పార్లమెంట్‌ భవనంలోని లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు చారిత్రక రోజుగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ బిల్లును ఆమోదించాలని ప్రతిపక్షాలను కోరారు. బుధవారం లోక్‌సభలో ఈ బిల్లుపై సుమారు ఎనిమిది గంటలపాటు చర్చ జరిగింది. 
 
సాయంత్రం ఓటింగ్‌ నిర్వహించిన తర్వాత చారిత్రక మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. కొత్త పార్లమెంట్‌ భవనంలో ఆమోదించిన తొలి బిల్లుగా ఇది చారిత్రకెక్కింది. 2010లో తొలిసారి రాజ్యసభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందింది. అనంతరం 13 ఏళ్ల తర్వాత బుధవారం లోక్‌సభలో కూడా ఆమోదించడంతో ఈ చారిత్రక బిల్లుకు మోక్షం లభించినట్లయ్యింది. దీంతో లోక్‌సభలో మహిళా సీట్ల సంఖ్య 181కు పెరుగనున్నది.