కెనడాలో వీసా సేవలు నిలిపేసిన భారత్.. మరో ఖలిస్థానీ హత్య

ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో కెనడా, భారత్ మధ్య దౌత్య సంబంధాలు ఇప్పటికే దెబ్బతినగా, ఇదే సమయంలో కెనడాలో మరో ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాది హత్యకు గురికావడం సంచలనం సృష్టించింది.  మరోవంక, కెనడా వాసులు భారత్ రావడానికి అవకాశం కల్పించే వీసా సేవలను గురువారం నుంచి నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. నిర్వహణ అంశాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

కెనడా వాసులు భారత్ వీసా పొందడానికి సంబంధించి కెనడాలో ఇంటర్నల్ సెక్యూరిటీ సేవలను అందించే బీఎల్ఎస్ సంస్థ తన వెబ్ సైట్ లో ఈ వివరాలను పొందుపర్చింది. ‘నిర్వహణ కారణాల వల్ల 21 సెప్టెంబర్ నుంచి భారతీయ వీసా సేవలు నిలిపివేయబడ్తున్నాయి. రెగ్యులర్ అప్ డేట్స్ కోసం తరుచుగా ఈ వెబ్ సైట్ ను చూడండి’ అని ఆ వెబ్ సైట్ లో నోట్ ను పెట్టారు. మళ్లీ ఎప్పుడు ఈ వీసా సేవలను పునరుద్ధరిస్తారన్న విషయాన్ని నోట్ లో తెలపలేదు.

కాగా, ఖలిస్థాన్ ఉగ్రవాది అర్షదీప్ సింగ్ అలియాస్ అర్ష దాలా అనుచరుడైన సుఖ్దూల్ సింగ్ కెనడాలోని విన్నిపెగ్ పట్టణంలో బుధవారం రాత్రి హత్యకు గురయ్యాడు.  రెండు గ్యాంగుల మధ్య గొడవలో భాగంగా ఇది చోటు చేసుకుంది. ఏ-కేటగిరీ గ్యాంగ్ స్టర్ అయిన సుఖ్దూల్ సింగ్ గతంలో పంజాబ్ నుంచి కెనడాకు పరారైన వ్యక్తి. 

అతడిపై ఏడు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఫోర్జరీ డాక్యుమెంట్ల ఆధారంగా 2017లో పాస్ పోర్ట్ సంపాదించి కెనడాకు పారిపోయాడు. ఇందుకు ఇద్దరు పోలీసులు సహకరించారు. అనంతరం ఆ ఇద్దరు పోలీసుల అరెస్ట్ కు గురయ్యారు.   అప్పటి నుంచి కెనడాలోనే ఉంటూ ఖలిస్థాన్‌ అనుకూల కార్యకలాపాలకు పాల్పుడుతున్నాడు.

అతను టెర్రరిస్ట్ అర్ష్‌దీప్ దల్లాకు అత్యంత సన్నిహితుడు. అదేవదిధంగా మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్స్‌తో అతడికి సంబంధాలు ఉన్నట్లు ఎన్‌ఐఏ తేల్చింది. కెనడాలో ఖలిస్థాన్‌ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కలిగి ఉన్న 43 మంది గ్యాంగ్‌స్టర్లలో ఒకడని పేర్కొంది. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కూడా కెనడాలో జూన్ 18న ఇలాగే గ్యాంగ్ వార్ లో చనిపోయాడు.

నిజ్జర్ పై దుండగులు 15 రౌండ్ల కాల్పులు జరిపారు. సుఖ్దూల్ సింగ్ అలియాస్ సుఖా దునెకె 2017 లో భారత్ నుంచి కెనడా పారిపోయాడు. అతడిపై భారత్ లో చాలా క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయి.  నిఘా వర్గాల సమాచారం ప్రకారం పంజాబ్ లోని దాదాపు 30 మంది గ్యాంగ్ స్టర్లు భారత్ వెలుపల, ముఖ్యంగా కెనడాాలో ఆశ్రయం పొందుతున్నారు. నకిలీ ధృవపత్రాల ద్వారా కానీ, ఫోర్జరీ చేసిన ట్రావెల్ డాక్యుమెంట్స్ తో నేపాల్ నుంచి కానీ వారు కెనడా చేరుకున్నారు.

ఇలా ఉండగా, సుఖా దునెకే హత్య తమపనేనని లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ సోషల్‌ మీడియాలో ప్రకటించింది. గ్యాంగ్‌స్టర్లు గుర్లార్‌బ్రార్‌, విక్కీ మిదిఖేరాల హత్యలో సుఖా ప్రధాన పాత్ర పోషించాడని, అతడు విదేశాల్లో ఉన్నా హత్యలకు ప్లాన్‌ చేసినట్లుగా బిష్ణోయ్‌ గ్యాంగ్‌ ఆరోపించింది. అతను మత్తుపదార్థాలకు బానిసని, ఎంతో మంది యువకులు, ప్రజల జీవితాలను నాశనం చేశాడని.. చివరకు చేసిన పాపాలకు శిక్ష అనుభవించాడని పేర్కొంది.
ఖ‌లిస్తానీ గ్రూపుల‌తో ఐఎస్ఐ భేటీ
ఈ నేప‌ధ్యంలో కెన‌డాలో మాటువేసిన ఐఎస్ఐ ఏజెంట్లు, ఖ‌లిస్తాన్ ఉగ్ర గ్రూపుల చీఫ్‌ల మ‌ధ్య వాంకోవ‌ర్‌లో ఇటీవ‌ల ర‌హ‌స్య భేటీ జ‌రిగింద‌ని నిఘా వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఐదు రోజుల కింద‌ట జ‌రిగిన ఈ స‌మావేశంలో సిఖ్స్ ఫ‌ర్ జ‌స్టిస్ (ఎస్ఎఫ్‌జే) చీఫ్ గుర్ప‌త్‌వంత్ సింగ్ ప‌న్నున్‌, ఖ‌లిస్తానీ సంస్ధ‌ల ఇత‌ర నేత‌లు పాల్గొన్నార‌ని నిఘా వ‌ర్గాల‌ స‌మాచారం.
 
ఐఎస్ఐ ఏజెంట్లు, ఖ‌లిస్తానీ గ్రూపుల మ‌ధ్య జ‌రిగిన ఈ భేటీలో వీలైనంత మేర భార‌త్ వ్య‌తిరేక ప్ర‌చారం వ్యాప్తి చేయాల‌ని ప్ర‌ణాళిక రూపొందించారు. ప్లాన్‌-కేగా చెబుతున్న ఈ ప్ర‌ణాళిక‌లో భాగంగా కెన‌డాలో గ‌త కొద్దినెలలుగా ఖ‌లిస్తానీ కార్య‌క‌లాపాల‌కు ఐఎస్ఐ పెద్ద‌మొత్తంలో నిధులు స‌మ‌కూరుస్తోంది.  ఈ నిధుల‌ను ప్ర‌జ‌ల‌ను నిర‌స‌న‌ల్లో పాల్గొనేలా రెచ్చ‌గొట్టేందుకు, భార‌త్ వ్య‌తిరేక ప్ర‌చారాన్ని చేప‌ట్టేందుకు పోస్ట‌ర్లు, బ్యానర్ల కోసం వెచ్చిస్తున్నార‌ని నిఘా వ‌ర్గాలు ప‌సిగ‌ట్టాయి.