‘రజాకర్’  సినిమా చూద్దామని కేటీఆర్ కు రాజాసింగ్ ఆహ్వానం

తెలంగాణలో ప్రస్తుతం ‘రజాకర్’ మూవీ రాజకీయంగా కలకలం రేపుతోంది. ఇటీవల ఈ మూవీ టీజర్ రిలీజ్ కాగా ఐటీ మంత్రి కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కొంతమంది తెలివితక్కువ బీజేపీ జోకర్లు.. వాళ్ల స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 
రజాకార్ సినిమా విషయంలోనూ అదే జరుతోందని, దీన్ని తాము సెన్సార్ బోర్డ్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పుకొచ్చారు.
తెలంగాణ పోలీస్‌లు కూడా శాంతిభద్రతల పరిస్థితి దెబ్బతినకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారు.  కేటీఆర్ వాఖ్యలపై తాజాగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్  తీవ్రంగా స్పందించారు. రజాకార్ టీజర్ విడుదల అయితేనే చాలా మంది నిజాం వారసులు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారని అంటూ ఎద్దేవా చేశారు.
మంత్రి కేటీఆర్ కూడా సెన్సార్‌కు ఫిర్యాదు చేస్తానని అన్నారని చెబుతూ బీజేపీ జోకర్ కాదని.. బీజేపీ అంటే హీరో అని చెప్పారు.  నిజాం కాలంలో మీర్ ఉస్మాన్ అలీఖాన్ అరాచకాల గురించి మీ నాన్న కేసీఆర్ మీకు చెప్పలేదా ? అని ప్రశ్నించారు. మూవీ చూసిన తర్వాత సినిమాపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నిర్ణయించుకొంటే బాగుంటుందని హితవు చెప్పారు.

“మీరు, మేము కలిసి సినిమా చూద్దాము. ఆ తర్వాత మీరు ఓ నిర్ణయానికి రావాలి” అని కేటీఆర్ కు సూచించారు.  మన స్వాతంత్ర పోరాటం జరిగిన తీరును ఇప్పటి యువకులకు ఈ సినిమా ద్వారా చూయించే ప్రయత్నం చేశారన్నాని రాజాసింగ్ చెప్పారు. స్వాతంత్రం కోసం హైదరాబాద్‌లో జరిగిన పోరాటాన్ని, హిందూవులను టార్గెట్ చేస్తూ సాగిన రజాకర్ల పాలనను ఈ సినిమాలో తెరకెక్కించారని పేర్కొన్నారు.

యాటా సత్యనారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘రజాకార్’. 1947లో దేశం మొత్తానికి స్వాతంత్ర్యం వచ్చినా హైదరాబాద్‌కు మాత్రం రాలేదన్న అంశంతో రజాకార్ టీజర్ మొదలైంది. కాగా.. ఆ సమయంలో హైదరాబాద్ సంస్థానంలో రజాకర్లు చేసిన దౌర్జన్యాలు, అరాచక చర్యలను టీజర్‌లో చూపించారు.

బ్రహ్మణుల యజ్ఞోపవీతాలను తెంపేయటం, తెలుగు మాట్లాడేవారి నాలుకలు కోసేయటం, ఇస్లాం మతంలోకి చేరని వాళ్లను మూకుమ్మడిగా ఉరి తీయటం లాంటి ఘోరాలను టీజర్‌లో చూపించారు. ఇది మత విద్వేషాలు రెచ్చగొట్టేలా రాజకీయ కోణంలో తీసిన సినిమా అని బీఆర్ఎస్ నేతలు అంటుండగా,జరిగిన వాస్తవాలే సినిమాలో చూపించారని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.