23న రామ్‌నాథ్‌ కోవింద్ కమిటీ తొలి సమావేశం

జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి సిఫార్సులు చేసేందుకు ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తొలి సమావేశం సెప్టెంబర్‌ 23న జరుగుతుందని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రకటించారు. ఆ కమిటీకి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, మునిసిపాలిటీలు, పంచాయతీలకు దేశవ్యాప్తంగా ఒకే సారి ఎన్నికలు నిర్వహించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి, అవసరమైన సిఫారసులు చేయడానికి సెప్టెంబరు 2న కేంద్ర ప్రభుత్వం ఎనిమిది మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీకి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ను చైర్మన్ గా ప్రకటించింది. 

ఆ కమిటీ తొలి సమావేశం సెప్టెంబర్ 23న జరుగుతుందని కోవింద్ శనివారం వెల్లడించారు. కాగా, తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని, దీనికి ఏకకాల ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డి ఇదివరకే స్పష్టం చేశారు.

ఈ కమిటీలో కేంద్రహోం మంత్రి అమిత్‌ షా, లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత అధిర్‌ రంజన్‌, గులాం నబీ ఆజాద్‌, ఎన్‌కే సింగ్‌, హరీశ్‌ సాల్వే, సుభాష్‌ కశ్యప్‌, సంజయ్‌ కొఠారీ సభ్యులుగా ఉన్నారు. కేంద్ర సహాయ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఒకేసారి ఎన్నికల నిర్వహణ అంశంపై ఈ కమిటీ చట్టాలను పరిశీలించి రాజ్యాంగ, చట్ట సవరణలకు నిర్దిష్ట సిఫారసులు చేయనుంది. అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని, వినతులను స్వీకరించనుంది.

ఈ జమిలి ఎన్నికల కమిటీ తొలి సమావేశం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ముగిసిన మర్నాడే జరుగుతుండడం విశేషం. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ప్రభుత్వం సెప్టెంబర్ 18 నుంచి సెప్టెంబర్ 22 వరకు నిర్వహిస్తోంది. ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఎజెండాను కూడా ప్రభుత్వం గురువారం వెల్లడించింది. 

ఈ ప్రత్యేక సమావేశాల్లో భారత పార్లమెంటు 75 ఏళ్ల ప్రస్థానం పై ప్రత్యేక చర్చ జరుగుతుందని, అలాగే, మరో నాలుగు బిల్లులపై పార్లమెంటులో చర్చ జరుగుతుందని ప్రభుత్వం వెల్లడించింది. సెప్టెంబర్ 17న అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్స్ తో అఖిల పక్ష భేటీని కూడా నిర్వహిస్తున్నామని, అందుకు సంబంధించిన ఆహ్వానాలను పంపించామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు.