జమిలి ఎన్నికల ప్రతిపాదనను తిరస్కరించిన కాంగ్రెస్

జమిలి ఎన్నికల ప్రతిపాదనను కాంగ్రెస్‌ పార్టీ తిరస్కరించింది. జమిలి ఎన్నికలంటే రాష్ట్రాల హక్కులను హరించడమేనని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సిడబ్ల్యుసి) స్పష్టం చేసింది. హైదరాబాద్‌లోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో రెండు రోజుల సిడబ్ల్యుసి సమావేశం ఆ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన శనివారం ప్రారంభమైంది. 
 
కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మాజీ మంత్రులు సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణతోపాటు త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఇండియా వేదిక వ్యూహంపై ప్రధానంగా సిడబ్ల్యుసి దృష్టి పెట్టింది.  మొదటి రోజు సమావేశంలో చర్చించిన అంశాలను కేంద్ర మాజీ మంత్రి చిదంబరం మీడియాకు వెల్లడించారు.
కేంద్రం ఆలోచిస్తోన్న జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే అనేక రాజ్యాంగ సవరణలు అవసరమని, దానికి తగిన సంఖ్యా బలం అధికార పక్షానికి లేదని చెప్పారు. త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పరిస్థితి అశాజనకంగా ఉందని పేర్కొన్నారు.  ఇండియా వేదికను బలోపేతం చేయాలని, వీలైనంత వేగంగా సీట్ల సర్దుబాటు ఖరారు కావాలని సిడబ్ల్యుసి సభ్యులు అభిప్రాయపడ్డారని చెప్పారు.
సమావేశంలో రాజకీయ, ఆర్థిక, భద్రతా సవాళ్లకు సంబంధించి స్థూలంగా ముసాయిదా తీర్మానంలో ప్రస్తావించామని తెలిపారు.  బిజెపి పాలనలో రాజ్యాంగం, ఫెడరల్‌ వ్యవస్థలు బలహీనపడుతున్నాయని, రాష్ట్రాల ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని, దీనివల్ల బాధ్యతల నిర్వహణలో రాష్ట్రాలకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష ప్రదర్శిస్తోందని విమర్శించారు. 
 
మణిపూర్‌లో పరిస్ధితులు తీవ్రంగా, ఉద్రేకంగా ఉన్నా ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ పర్యటించకపోవడం విచారకరమని పేర్కొన్నారు. కాశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు లేవని, ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఆర్థిక, ఆహార ద్రవ్యోల్బణం పెరగడంపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతోందని విమర్శించారు. 
దేశంలో నిరుద్యోగం పెరిగిందని, ఆర్థిక వృద్ధి తగ్గుతోందని తెలిపారు.
కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు జైరాం రమేష్‌ మాట్లాడుతూ, కేరళ కాంగ్రెస్‌ పార్టీ నేత ఉమెన్‌ చాందీ మృతికి, మణిపూర్‌ దుస్సంఘటనల్లో ప్రాణాలు కొల్పోయిన వారికి సంతాపం తెలుపుతూ తీర్మానాలు ఆమోదించామని చెప్పారు. హిమాచల్‌ప్రదేశ్‌ ప్రకృతి వైపరీత్యాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానాన్ని సిడబ్ల్యుసి సమావేశం ఆమోదించిందని తెలిపారు.