జ‌మ్మూక‌శ్మీర్‌లో ద రెసిస్టెన్స్ ఫ్రంట్‌ కలకలం

జ‌మ్మూక‌శ్మీర్‌లో పరిస్థితులు అదుపులోకి వచ్చాయని, ఉగ్రవాదంను కట్టడి చేస్తున్నామని భావిస్తున్న ప్రభుత్వం ఐదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధపడుతున్న సమయంలో గత మూడు రోజులుగా జరుగుతున్న కాల్పులలో ముగ్గురు సైనిక అధికారులు, మరో ఇద్దరు జవాన్లు కూడా మృతి చెందుతూ ఉండడంతో కలకలం రేగుతున్నది. ఈ ఉగ్రవాద కార్యకలాపాలకు కారణంగా భావిస్తున్న ద రెసిస్టెన్స్ ఫ్రంట్‌ పై ఇప్పుడు భద్రతా దళాలు ద్రుష్టి సారిస్తున్నాయి.
 
ల‌ష్క‌రే తోయిబాకు అనుబంధంగా ఆన్‌లైన్ సంస్థగా  క‌శ్మీర్‌లో ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు తర్వాత 2019 ఆగష్టు లో ఇది ఆవిర్భ‌వించింది. కొన్ని మీడియా క‌థ‌నాల ప్ర‌కారం పాకిస్థాన్‌లోని క‌రాచీ కేంద్రంగా టీఆర్ఎఫ్ ప‌నిచేస్తోంది. అయితే ల‌ష్క‌రే తోయిబా, తెహ్రీక్ ఈ మిలిటెంట్ ఇస్లామియా, ఘ‌జ్న‌వి హింద్ సంస్థ‌ల క‌ల‌యికే టీఆర్ఎఫ్‌. 

అయితే ఆ సంస్థ‌కు ఎటువంటి మ‌త‌ప‌ర‌మైన ఉద్దేశాన్ని క‌ట్ట‌బెట్ట‌వ‌ద్దు అన్న ఆలోచ‌న‌తో దానికి ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అని పేరు పెట్టిన‌ట్లు తెలుస్తోంది. కానీ ప్ర‌జా ఉద్య‌మంగా చూపించాల‌న్న ఉద్దేశంతో ఆ పేరును నిర్ణయించారు. ఫైనాన్షియ‌ల్ యాక్ష‌న్ టాస్క్ ఫోర్స్ నిఘా నుంచి దూరంగా ఉండేందుకు కూడా ఈ ఎత్తు వేసిన‌ట్లు తెలుస్తోంది.

ల‌ష్క‌రేతోయిబా, జైషే మ‌హ‌మ్మ‌ద్ సంస్థ‌ల‌కు మ‌త‌ప‌ర‌మైన క‌నెక్ష‌న్లు ఉన్నాయి. అయితే ఆ లింక‌ల‌ను పాకిస్థాన్ ఇష్ట‌ప‌డ‌డం లేదు. కానీ క‌శ్మీర్‌లో తీవ్ర‌వాదం స్థానిక‌త అంశంగా చిత్రీక‌రించాల‌న్న ఉద్దేశంతో ఈ పేరు పెట్టిన‌ట్లు భావిస్తున్నారు. పాకిస్తాన్‌లో ఉగ్ర క‌లాపాలు ఎక్కువ అవుతున్న నేప‌థ్యంలో పారిస్‌కు చెందిన ఎఫ్ఏటీఎఫ్ ఆ దేశంపై ఆంక్ష‌లు విధించిన విష‌యం తెలిసిందే.

ఉగ్ర‌వాద సంస్థ‌ల‌కు ఫైనాన్సింగ్ జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఆ ఆంక్ష‌ల నుంచి త‌ప్పించుకునేందుకు కొత్త పేర్ల‌తో ఎత్తులు వేస్తున్నట్లు అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. 2020 జ‌న‌వ‌రి నుంచి క‌శ్మీర్‌లో జ‌రుగుతున్న దాడుల‌కు తామే బాధ్యుల‌మ‌ని టీఆర్ఎఫ్ చెబుతోంది. సాజిద్ జాట్‌, స‌జ్జ‌ద్ గుల్‌, స‌లీమ్ రెహ్మని లాంటి వారు దీంట్లో నేత‌లుగా ఉన్నారు.

వీళ్లంతా ఒకప్పుడు ల‌ష్క‌రే తీవ్ర‌వాదులు. ల‌ష్క‌రేతో పాటు ఇత‌ర ఉగ్ర గూపుల నుంచి దృష్టి మ‌ళ్లించేందుకు తాజా దాడుల్ని తాము చేస్తున్న‌ట్లు టీఆర్ఎఫ్ చెప్పుకుంటోంద‌ని వాద‌న‌లు వినిపిస్తున్నాయి. మరోవంక, అనంత్‌నాగ్‌లో భ‌ద్ర‌తా ద‌ళాలు ఇంకా ఉగ్రవాద వ్యతిరేక ఆప‌రేష‌న్ కొన‌సాగిస్తున్నాయి. కోకెర్‌నాగ్ ఏరియాలో భారీ స్థాయిలో ద‌ళాలు మోహ‌రించాయి. అయితే శుక్ర‌వారం జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో గాయ‌ప‌డ్డ ఓ సైనికుడు మృతిచెందాడు. దీంతో అనంత్‌నాగ్ ఎన్‌కౌంట‌ర్ మృతుల సంఖ్య నాలుగుకు చేరింది.

కోకెర్‌నాగ్‌లో ఉగ్ర‌వాదులు దాచుకున్న‌ట్లు వార్త‌లు రావ‌డంతో బుధ‌వారం నుంచి అక్క‌డ ఎన్‌కౌంట‌ర్ మొద‌లైంది. భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు, ఉగ్ర‌వాదుల మ‌ధ్య ఎదురుకాల్పులు జ‌రిగాయి. ఆ కాల్పుల్లో ఆర్మీకి చెందిన క‌మాండింగ్ ఆఫీస‌ర్‌, కంపెనీ క‌మాండ‌ర్‌, డీఎస్పీ మృతిచెందారు. క‌ల్న‌ల్ మ‌న్‌ప్రీత్ సింగ్‌, మేజ‌ర్ ఆశిశ్‌, డీఎస్పీ హుమాయున్ భ‌ట్ మృతిచెందిన‌వారిలో ఉన్నారు. మ‌న్‌ప్రీత్ సింగ్‌, ఆశిశ్ దోంచాక్ పార్దీవ‌దేహాల‌ను పానిప‌ట్‌లోని స్వ‌గ్రామానికి శుక్ర‌వార‌మే చేర్చారు.

  కోకెర్‌నాగ్ ప్రాంతంలో సుమారు ముగ్గురు ఉగ్ర‌వాదులు త‌ల‌దాచుకున్న‌ట్లు భ‌ద్ర‌తా ద‌ళాల‌కు స‌మాచారం అందింది. గారోల్ గ్రామంలో కార్డెన్ సెర్చ్ ఆప‌రేష‌న్ ద్వారా ఉగ్ర‌వాదుల కోసం భ‌ద్ర‌తా ద‌ళాలు గాలింపు మొద‌లుపెట్టాయి. హీర‌న్ డ్రోన్ల‌తో పాటు క్వాడ్‌కాప్ట‌ర్ల‌ను .. నిఘా కోసం రంగంలోకి దింపారు. ఉగ్ర‌వాదులు జ‌రిపిన ఫైరింగ్‌లో ఓ క‌ల్న‌ల్ అక్క‌డిక్క‌డే మృతిచెందాడు. మ‌రో ఇద్ద‌రు అధికారులు తీవ్రంగా గాయ‌ప‌డి ఆ త‌ర్వాత హాస్పిట‌ల్‌లో మృతిచెందారు.