తెలుగు విద్యార్థిని మృతి పట్ల అమెరికా పోలీస్ వాఖ్యలపై ఆగ్రహం

నార్త్‌ ఈస్ట్రన్‌ యూనివర్సిటీలో చదువుతున్న తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల (23) రోడ్డు ప్రమాద ఘటనపై అమెరికా పోలీసు అధికారి చేసిన  జాతి దురహంకార వ్యాఖ్యలు, ప్రవర్తించిన తీరు సర్వత్రా విస్మయం కలిగిస్తోంది. అటు అమెరికా ఇటు భారత్‌లో ఆగ్రహావేశాలు రగులుతున్నాయి. దీనిపై శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారతీయ కాన్సులేట్‌ కార్యాలయం తీవ్రంగా స్పందించింది. 

దౌత్యాధికారి తరణ్‌జీత్‌ సింగ్‌ సంధూ ఈ విషయాన్ని వాషింగ్టన్‌ డీసీలోని సీనియర్‌ అధికారులు సహా సియాటెల్‌, వాషింగ్టన్‌ రాష్ట్ర అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లారు. జాహ్నవి కేసుపై పోలీసుల దర్యాప్తు తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.  ఘటనపై లోతైన దర్యాప్తు చేయాలని భారత్‌  అమెరికా ప్రభుత్వాన్ని కోరింది.

దీంతో స్పందించిన అధ్యక్షుడు బైడెన్‌ బృందంలోని సీనియర్‌ అధికారులు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తామని సంధూకు హామీ ఇచ్చారు. ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన జాహ్నవి కందుల ఎంఎస్‌ చేసేందుకు సియాటిల్‌లోని నార్త్‌ ఈస్ట్రన్‌ యూనివర్సిటీలో 2021 సెప్టెంబరు 20వ తేదీన చేరారు.

ఈ ఏడాది జనవరి 23న సౌత్‌లేక్‌ యూనియన్‌ ప్రాంతంలో రోడ్డు దాటుతుండగా పోలీసు పెట్రోలింగ్‌ వాహనం ఢీకొనడంతో ఘటనాస్థలిలోనే మరణించారు. ఆ సమయంలో ఆ వాహనాన్ని కెవిన్‌ డేవ్‌ అనే పోలీసు అధికారి నడుపుతున్నారు. దర్యాప్తు నిమిత్తం వచ్చిన పోలీసు అధికారి డానియల్‌ ఆడెరెర్‌ అక్కడే జోకులు వేయడం, నవ్వడం అతని బాడీకామ్‌ కెమెరాలో రికార్డయ్యింది.

 ఘటన స్థలం నుంచే సియాటెల్‌ పోలీసు ఆఫీసర్స్‌ గిల్డ్‌ అధ్యక్షుడు మైక్‌ సోలెన్‌కు డానియల్‌ ఫోన్‌ చేసి.. ప్రమాద వివరాలు తెలియజేశారు. ‘ఆమె చనిపోయింది’ అని నవ్వడం, ‘ఆమె మామూలు మనిషే. 11 వేల డాలర్ల చెక్కు రాయండి చాలు’ అంటూ నవ్వడం రికార్డయ్యాయి. అంతేకాక ‘వయసు 26 ఉండొచ్చు. ఆమె జీవితానికి విలువ తక్కువ’ అంటూ అవమానకరంగా మాట్లాడుతూ డ్రైవర్‌ తప్పు లేదని, క్రిమినల్‌ దర్యాప్తు అక్కర్లేదని తెలిపారు.

ఈ వీడియోపై సియాటిల్‌ కమ్యూనిటీ పోలీసు కమిషన్‌ తీవ్రంగా పరిగణించడంతో పాటు డేనియల్‌, అతని సహౌద్యోగి మధ్య జరిగిన సంభాషణ దిగ్భ్రాంతి కలిగించిందని.. దీనిపై విచారణ జరుపుతున్నట్లు తెలిపింది.

దర్యాప్తు అధికారి డానియల్‌ మాటలు విని భారత్‌లోని జాహ్నవి కుటుంబసభ్యులు మాన్పడిపోయారు. ‘మేం మా బిడ్డను కోల్పోయాం. కానీ ఇది మమ్మల్ని అంతకుమించిన కుంగుబాటుకు గురిచేసింది’ అని జాహ్నవి తాతయ్య వాపోయారు. జాహ్నవి ప్రాణానికి విలువ లేదా? అని ప్రశ్నించారు. జాహ్నవి జనవరిలో చనిపోతే నివేదిక ఇప్పుడు బయట పెట్టడమేంటని ప్రశ్నించారు. జాహ్నవి తల్లి రెండ్రోజులుగా షాక్‌లో ఉన్నారని, ఆహారం తీసుకోవడం లేదని మీడియా వద్ద కన్నీరు పెట్టుకున్నారు.

జాహ్నవిని ఢీకొట్టే సమయానికి పెట్రోలింగ్‌ వాహనం 119 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. సరిగ్గా ఘటన సమయానికి స్పీడో మీటరులో 101 కిలోమీటర్లు చూపించింది. జీబ్రాలైన్‌లో రోడ్డు దాటుతున్న జాహ్నవి వాహనం తగిలిన ధాటికి 138 అడుగుల అవతల ఎగిరిపడ్డారు. ఈ మార్గంలో 40 కిమీలకి మించి వేగం దాటరాదు. అయితే, వాహనం నడిపిన పోలీసు అధికారి తప్పేం లేదన్నట్టు డానియల్‌ నివేదిక ఇచ్చారు.

మరణం తర్వాత కుటుంభం సభ్యులకు డిగ్రీ

ఇలా ఉండగా, జహ్నవి కందులకు మరణం తర్వాత నార్త్‌ ఈస్ట్రన్‌ యూనివర్సిటీ గౌరవించింది. ఆమె ఎంఎస్ పట్టా అందనుంది. ఈ విషయాన్ని నార్త్‌ఈస్ట్రన్‌ యూనివర్సిటీ అధికారికంగా ప్రకటించింది. జాహ్నవి తరపున ఆమె కుటుంబ సభ్యులకు ఎంఎస్‌ పట్టా అందజేస్తామని నార్త్‌ఈస్ట్రన్‌ యూనివర్సిటీ వీసీ తెలిపారు. 

జాహ్నవి ప్రమాదంలో చనిపోవడం దిగ్భ్రాంతి కలిగించిందని నార్త్ ఈస్ట్రన్‌ ఛాన్సలర్‌ పేర్కొన్నారు. ఇది ఒక విషాద ఘటన.. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో తమ వర్శిటీ క్యాంపస్‌లోని భారత విద్యార్థులు తీవ్రంగా ప్రభావితులయ్యారని చెప్పుకొచ్చారు. ఈ సమయంలో వారికి తాము అండగా ఉంటామని, అలాగే ఈ ఘటనలో బాధ్యులకు తప్పకుండా శిక్ష పడుతుందని ఆశిస్తున్నామని చెప్పారు. జాహ్నవికి మరణానంతరం డిగ్రీ ప్రదానం చేయాలని నిర్ణయించామని.. ఆమె కుటుంబంసభ్యులకు పట్టాను అందిస్తామని తెలిపారు.