నుహ్‌ అల్లర్ల కేసులో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అరెస్ట్‌

హ‌ర్యానాలోని నుహ్‌ జిల్లాలో చెలరేగిన హింసాకాండ కేసులో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మమ్మన్‌ ఖాన్‌ ను పోలీసులు తాజాగా అరెస్ట్‌ చేశారు. జులై 31న హిందూ సంస్థ నిర్వహించిన ఊరేగింపులో నుహ్‌లో మత ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. యాత్ర అనంతరం చెలరేగిన హింసలో కాంగ్రెస్ ఎమ్మెల్యే హస్తం ఉందని హర్యానా పోలీసులు తెలిపారు. 
 
ఈ మేరకు గురువారం అర్ధరాత్రి సమయంలో ఎమ్మెల్యేని అదుపులోకి తీసుకున్నట్లు ఫిరోజ్‌పూర్‌ జిర్కా డీఎస్పీ సతీష్‌ కుమార్‌ శుక్రవారం వెల్లడించారు.  అన్ని సాక్ష్యాధారాలను పరిశీలించాకే ఎమ్మెల్యేను నిందితుడిగా పేర్కొన్నట్లు హర్యానా పోలీసులు కోర్టుకు వెల్లడించారు. ఫోన్ కాల్ రికార్డులు, ఇతర ఆధారాలు తమ వద్ద ఉన్నట్లు చెప్పారు. 
 
ఇదిలా ఉండగా అంతకుముందు విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్యేకు నుహ్‌ పోలీసులు రెండుసార్లు సమన్లు పంపారు. అయితే, ఆయన ఇతర కారణాలు చెప్పి విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేని తాజాగా పోలీసులు అరెస్ట్‌ చేశారు. మమ్మన్ ఖాన్‌ ప్రస్తుతం ఫిరోజ్‌పూర్ జిర్కా  అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 

తన అరెస్ట్‌ను ముందే ఊహించిన మమ్మన్ ఖాన్‌ ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు పంజాబ్- హర్యానా హైకోర్టులో మంగళవారం బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. హింస చెలరేగిన రోజున తాను నుహ్‌లో లేనని, తనను ఈ కేసులో అన్యాయంగా ఇరికించారని మమ్మన్ ఖాన్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఎమ్మెల్యే బెయిల్‌ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 19న జరగనుంది.జులై 31వ తేదీన వీహెచ్‌పీ మత ఊరేగింపు సందర్భంగా నూహ్ జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘర్షణలు క్రమంగా పొరుగున ఉన్న గురుగ్రామ్‌కు కూడా పాకాయి. గుర్‌గ్రామ్‌లోని బాద్‌షాపూర్‌లో ఓ రెస్టారెంట్‌తో పాటు 14 దుకాణాలను ధ్వంసం చేశారు. సెక్టార్‌ 66 పరిధిలో ఏడు దుకాణాలకు నిప్పుపెట్టారు. 

బైక్‌లు, కార్లలో వచ్చిన దాదాపు 200 మందితో కూడిన గుంపు ప్రధానంగా బిర్యానీ అమ్మే దుకాణాలు, ఇతర ఫుడ్‌స్టాళ్లపై దాడులు చేశారు. ఈ అల్లర్లలో ఆరుగురు మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘర్షణలకు సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు 100 మందికిపైనే అరెస్ట్‌ చేశారు.

నుహ్‌లో ఇంటర్నెట్ బంద్, 144 సెక్షన్

మరోవంక, నుహ్ జిల్లాలో తాజా అల్లర్లకు అవకాశం ఉందనే సమాచారంతో ఆ జిల్లాలో ఇంటర్నెట్  సర్వీసులను ప్రభుత్వం రద్దు చేసింది. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి శనివారం రాత్రి 11.59 గంటల వరకూ ఇది అమల్లో ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి తెచ్చింది.  శుక్రవారం ప్రార్థనలు ఇంట్లోనే చేసుకోవాల్సిందిగా కూడా ప్రజలను ప్రభుత్వ యంత్రాంగం కోరింది.
జూలై 31 నుహ్ జిల్లాలో చెలరేగిన హింసాకాండకు సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యే మమ్మన్ ఖాన్‌ను అరెస్టు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఆదేశాలిచ్చింది. అయితే ఆ విషయాన్ని ప్రభుత్వ ఉత్తర్వుల్లో ప్రస్తావించలేదు.  నెహ్ జిల్లాలో ఉద్రిక్తతలు, ఆందోళనలు, ప్రభుత్వ, ప్రజా ఆస్తుల ధ్వంసం, శాంతికి విఘాతం కలిగే అవకాశం ఉందని చెబుతూ జిల్లా డిప్యూటీ కమిషనర్ తనకు లేఖ రాయడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని హోం శాఖ అదనపు చీఫ్ సెక్రటరీ టీవీఎస్ఎన్ ప్రసాద్ తెలిపారు.