చంద్రబాబు మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

చంద్రబాబు మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. విచారణను ఈ నెల 19కి వాయిదా వేస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రబాబు మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని ఏపీ సీఐడీని ఏసీబీ కోర్టు ఆదేశించింది. 
బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ పెండింగ్‌లో ఉండటాన్ని న్యాయమూర్తి ప్రస్తావించారు. మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ కొనసాగిస్తే క్వాష్‌ పిటిషన్‌పై ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు.  ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో సీఐడీ తనపై నమోదు చేసిన కేసులో మధ్యంతర బెయిలు మంజూరు చేయాలని కోరుతూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు గురువారం విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ కేసులో తన ప్రమేయంపై ప్రాథమిక ఆధారాలు లేకపోయినా సీఐడీ కేసు నమోదు చేసిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఏపీఎస్‌ఎస్‌డీసీ ఛైర్మన్‌ ఇచ్చిన ఫిర్యాదులో తన పేరు లేదని కేసులో తన పేరు ఎప్పుడు చేర్చారో కనీసం చెప్పలేదని పిటిషన్‌లో తెలిపారు. ఏ ఆధారాలతో తనను నిందితుడిగా చేర్చారో చెప్పేందుకు సీఐడీ వద్ద ప్రాథమిక వివరాలు లేవని, రాజకీయ ప్రతీకారంతో దురుద్దేశపూర్వకంగా నన్ను ఈ కేసులోకి లాగారని పేర్కొన్నారు. 

ముఖ్యమంత్రి ప్రోద్బలంతో కేసులో ఇరికించారని, ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని తనకు బెయిలు మంజూరు చేయాలని కోరారు. ప్రధాన వ్యాజ్యంపై హైకోర్టులో తేల్చేలోపు మధ్యంతర బెయిలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. దీనిపై విచారణ చేపట్టిన అనిశా కోర్టు విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. మరోవైపు చంద్రబాబు తరపున మధ్యంతర బెయిల్‌కు ప్రత్యేక కారణాలు చెప్పలేదని సిట్‌ అభ్యంతరం తెలిపింది.

మధ్యంతర బెయిల్‌ దరఖాస్తు చేసుకోడానికి కావాల్సిన అర్హతలు చంద్రబాబు పిటిషన్లో లేవని ప్రభుత్వ న్యాయవాదులు తెలిపారు. క్వాష్ పిటిషన్‌ వేసిన తర్వాత మళ్లీ మధ్యంతర బెయిల్ దాఖలు చేయడానికి ఎలాంటి అర్హతలు బాబుకు లేవని ప్రభుత్వ న్యాయవాదులు చెప్పారు.  చంద్రబాబును ఏపీసిఐడి కస్టడీ కోరుతూ వేసిన పిటిషన్లపై కౌంటర్లు వేయకుండా బెయిల్ పిటిషన్లు వేస్తున్నారని, తమ అభ్యంతరాలను ఏసీబీ కోర్టు కూడా పరిగణలోకి తీసుకుందని ప్రభుత్వ న్యాయవాదులు చెప్పారు. సెక్షన్ 438,439 ప్రకారమే మధ్యంతర బెయిల్ దరఖాస్తుకు అవకాశాలు ఉంటాయని కోర్టుకు వివరించారు.

భువనేశ్వరి ములాఖత్‌కు నిరాకరణ 
ఇలా ఉండగా, రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్నచంద్రబాబుతో ములాఖత్‌కు ఆయన భార్య భువనేశ్వరి చేసుకున్న దరఖాస్తును జైలు అధికారులు శుక్రవారం నిరాకరించారు. ఈ వారంలో రెండుసార్లు చంద్రబాబు కుటుంబసభ్యులు ములాఖత్‌ అయ్యారు. మూడోసారి ములాఖత్‌కు ఉన్నతాధికారుల అనుమతి కావాలని జైలు సిబ్బంది చెబుతున్నారు. 
 
ప్రస్తుతం జైలు సూపరింటెండెంట్‌ సెలవుల్లో ఉండటంతో భువనేశ్వరి దరఖాస్తును అధికారులు తిరస్కరించారు. వారానికి మూడుసార్లు ములాఖత్‌ ఇచ్చేందుకు అవకాశం ఉన్నా అనుమతిని తిరస్కరించడాన్ని టిడిపి తప్పుబట్టింది. చంద్రబాబు అరెస్టయినప్పటి నుండి భువనేశ్వరి రాజమండ్రిలోనే ఉంటున్నారు.  తన భర్తను అక్రమంగా అరెస్టు చేసిన ప్రభుత్వం ములాఖత్‌పైనా అమానవీయంగా వ్యవహరిస్తోందని భువనేశ్వరి ఆక్షేపించారు. నిబంధనల ప్రకారం ములాఖత్‌కు అవకాశం ఉన్నప్పటికీ ఇలా కాదనడం సరికాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.