
ఇవాళ్టి ములాఖత్ ఆంధ్రప్రదేశ్‌కు చాలా కీలకమని చెబుతూ రాష్ట్రంలో వైసిపి వ్యతిరేక ఓటు చీలనీయనని స్పష్టం చేశారు. యుద్ధం కావాలంటే యుద్ధానికి సిద్ధమేనని అంటూ బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ దుస్థితిపై ప్రధాని మోదీ, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తానని వెల్లడించారు. వైసీపీ అరాచకాలను అడ్డుకునేందుకు వచ్చే ఎన్నిక్లలో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు.
‘‘వైఎస్‌ఆర్‌సిపిని సమష్టిగా ఎదుర్కొనే సమయం ఆసన్నమైంది. ఇది మా ఇద్దరి భవిష్యత్ కోసం కాదు. రాష్ట్ర భవిష్యత్ కోసమే. చంద్రబాబు రాజకీయవేత్త.. జగన్ ఆర్థిక నేరస్తుడు అని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. సైబరాబాద్ ను నిర్మించిన వ్యక్తిని జైల్లో పెట్టడం దారుణమని పేర్కొంటూ వైసీపీ నేతలు తమపై రాళ్లు వేసేటప్పుడు ఆలోచించుకోవాలని హితవు చెప్పారు.
తాము అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కర్ని వదలమని హెచ్చరించారు. డీజీపీ, సీఎస్ సహా ఎవరిపైనా సరే కేసులు తిరగదోడే అవకాశం ఉంటుందని గుర్తు చేశారు. “గత నాలుగున్నర సంవత్సరాలుగా ఏపీలో అరాచక పాలనను చూస్తున్నాం. అరాచక పాలనలో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి, చట్ట వ్యతిరేకంగా రిమాండ్ కు పంపించారు. ఆయనకు సంఘీభావం ప్రకటించడానికి ఇక్కడకు వచ్చాను” అని తెలిపారు.
దక్షిణ భారతంలో మోదీకి మద్దతు తెలిపిన మొదటి వ్యక్తిని తానే అని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ముంబయిలో ఉగ్రదాడి జరిగినప్పుడు దేశానికి బలమైన నాయకుడు కావాలని కోరుకున్నానని, అందుకే 2014లో మోదీ వచ్చిన తర్వాత ఆయనకు మద్దతు తెలిపానని చెప్పారు.
మోదీ పిలిచినప్పుడే తాను ఢిల్లీకి వెళ్లానే కానీ, తానంతట తానెప్పుడూ వెళ్లలేదని స్పష్టం చేశారు. విడిపోయిన ఏపీకి సమర్థవంతమైన నాయకుడు కావాలని కోరుకున్నానని, అందుకే చంద్రబాబుకు మద్దతు పలికానని తెలిపారు. చంద్రబాబుతో విధానపరంగా విభేదాలు ఉండొచ్చని, కానీ ఆయన అపారమైన అనుభవం రాష్ట్రానికి కావాలని చెప్పారు. స్కిల్ డెవలప్ మెంట్ లో తప్పులు జరిగితే దాని బాధ్యులైన అధికారులను శిక్షించాలని హితవు చెప్పారు.
More Stories
లోకేష్ సిఐడి విచారణ 10కి వాయిదా
చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా
టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్టు