టిటిడి బోర్డులో నేర చరితులపై హైకోర్టు నోటీసులు

టిటిడి ట్రస్ట్ బోర్డ్ సభ్యులుగా నేర చరితులకు అవకాశం కల్పించారంటూ దాఖలైన పిటిషన్‌పై ఎపి హైకోర్ట్ బుధవారం విచారణ జరిపింది. ఈ మేరకు  జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, ఢిల్లీ లిక్కర్‌ స్కాం నిందితుడు అరబిందో గ్రూప్‌ డైరెక్టర్‌ పి.శరత్‌చంద్రారెడ్డి, అవినీతి ఆరోపణలతో మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌గా తొలగించిన డాక్టర్‌ కేతన్‌ దేశాయ్‌లకు నోటీసులు ఇచ్చింది. 

ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబరు 1కి వాయిదా వేసింది. వీరి నియమకాన్ని సవాల్ చేస్తూ విజయవాడకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి చింతా వెంకటేశ్వర్లు పిటిషన్ దాఖలు చేశారు.  వీరి నియామకం దేవదాయ చట్టంలోని 18, 19 సెక్షన్లకు విరుద్ధంగా ఉందని.. వీరి విషయంలో జీవో అమలును నిలుపుదల చేయాలని అభ్యర్థించారు.

నేర చరిత్ర వున్నవారిని, అనర్హులను, మంచి నడవడిక లేని వారిని టిటిడి సభ్యులుగా నియమించడం చట్ట వ్యతిరేకమని వెంకటేశ్వర్లు తరపున న్యాయవాది ధర్మాసనానికి విన్నవించారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ రఘునందన్‌రావుల ధర్మాసనం ప్రభుత్వాన్ని వివరణ కోరింది. అయితే శిక్షపడని కారణంగా వారిని నేరస్థులుగా పరిగణించలేదని ప్రభుత్వం తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 

ఇదిలావుండగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యత్వం నుంచి తొలగించబడిన కేతన్ దేశాయ్, ఢిల్లీ లిక్కర్ స్కాంలో శరత్ చంద్రారెడ్డి విచారణ ఎదుర్కొన్నారని, సామినేని ఉదయభానుపై క్రిమినల్ కేసులు వున్నాయని పిటిషనర్ వాదించారు.  ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఎపి ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, విచారణను మూడు వారాలు వాయిదా వేసింది.