17న అఖిలపక్ష భేటీకి ప్రభుత్వం పిలుపు

ఈ నెల 18 నుండి ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుపుతున్న దృష్ట్యా 17న మధ్యాహ్నం 4.30 గంటలకు ప్రభుత్వం పార్టీల సభా పక్ష నేతలు (ఫ్లోర్ లీడర్స్ ) సమావేశం నిర్వహిస్తుంది. ఈ విషయాన్ని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ ట్విట్టర్ (ఎక్స్) ద్వారా వెలువరించారు.  

ఈ భేటీకి సంబంధిత నేతలకు ముందుగా వారివారి ఇమెయిల్స్ ద్వారా తెలియచేశారు. తరువాత వారికి లేఖలు పంపించడం జరుగుతుందని మంత్రి ఓ ప్రకటన వెలువరించారు. దీనికి సంబంధించి కన్నడ అనువాదాన్ని కూడా పొందుపర్చారు. కన్నడలో ఈ ట్వీటు వెలువరించడం విశేషంగా మారింది. జోషి కర్నాటకలోని ధార్వాడ్ నియోజకవర్గ ఎంపిగా ఉన్నందున తమ భాషలో కూడా దీనిని పొందుపర్చారు.

ఇలా ఉండగా, పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఎజెండాపై ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం రాత్రి కేంద్రం వెల్లడించింది. రాజ్యసభ, లోక్‌సభ సచివాలయాలు బులిటెన్‌ రూపంలో విడుదల చేశాయి. సెప్టెంబరు 19న నూతన పార్లమెంటు భవనంలోకి మారుతున్న నేపథ్యంలో 18న 75ఏళ్ల పార్లమెంటరీ ప్రస్థానం గురించి చర్చించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. 
 
రాజ్యాంగ నిర్మాణ సభ నుంచి ఇప్పటి వరకూ సాధించిన విజయాలు, ఎదురైన అనుభవాలు, జ్ఞాపకాలు, నేర్చుకున్న పాఠాల గురించి ఇందులో చర్చిస్తారు. సెప్టెంబరు 18న తొలిరోజు ఉదయం సభ కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను పార్లమెంట్ ముందించిన వెంటనే ఉభయ సభల్లో ‘రాజ్యాంగ పరిషత్ నుంచి ప్రారంభమైన 75 ఏళ్ల పార్లమెంటరీ ప్రస్థానం- విజయాలు, అనుభవాలు, జ్ఞాపకాలు, పాఠాలు’ అన్న అంశంపై చర్చ జరుగుతుందని అందులో పేర్కొన్నారు. 
 
తర్వాత ఉభయ సభల ముందుకు ఐదు బిల్లులను తీసుకురానున్నారు. ఆగస్టు 3న రాజ్యసభ ఆమోదించిన ది అడ్వకేట్స్‌ సవరణ బిల్లు-2023, ది ప్రెస్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ పీరియాడికల్స్‌ బిల్లు-2023 లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. రాజ్యసభలో ఆగస్టు 10న ప్రవేశపెట్టిన పోస్టాఫీసుల బిల్లు 2023, ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఇతర కమిషనర్ల (అపాయింట్‌మెంట్‌, కండీషన్స్‌ ఆఫ్‌ సర్వీస్‌ అండ్‌ టర్మ్‌ ఆఫ్‌ ఆఫీస్‌) బిల్లు 2023, జులై 27న లోక్‌సభ ఆమోదించిన వివిధ నిరర్ధక చట్టాల రద్దుకు సంబంధించిన ‘ది రిపీలింగ్‌ అండ్‌ అమెండింగ్‌ బిల్లు-2023’వాటి పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు.