ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లో ముగ్గురు

ఆసియా కప్‌లో వరుస విజయాలతో జోరుమీదున్న భారత జట్టు అగ్రస్థానానికి మూడు పాయింట్ల దూరంలో మూడో స్థానంలో నిలిచింది. 118 పాయింట్లతో ఆస్ట్రేలియా, పాక్‌ తొలి రెండుస్థానాల్లో ఉండగ 116 పాయింట్లతో భారత్‌ మూడోస్థానంలో ఉన్నది. మరో వైపు వన్డే ర్యాకింగ్స్‌లో భారత క్రికెటర్లు సైతం దుమ్ములేపారు. 

శ్రీలంకలో జరుగుతున్న ఆసియా కప్‌లో బ్యాటింగ్‌లో అత్యుత్తమ నైపుణ్యం ప్రదర్శించిన ముగ్గురు ఆటగాళ్లు టాప్‌-10లోకి దూసుకెళ్తారు. ఆసియా కప్‌లో రెండు అర్ధ సెంచరీలతో 154 పరుగులు చేసిన శుభ్‌మన్‌ గిల్‌ కెరీర్‌లోనే తొలిసారిగా రెండో ర్యాకింగ్స్‌కు చేరుకున్నాడు.  ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే అగ్రస్థానికి చేరు అవకాశాలున్నాయి.

ప్రస్తుతం 863 పాయింట్లతో టాప్‌-1లో ప్లేస్‌లో పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజామ్‌ ఉండగా 759 పరుగులతో శుభ్‌మన్‌ గిల్‌ రెండో స్థానంలో ఉన్నాడు. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ సైతం రెండేసి స్థానాలు ఎగబాకి టాప్‌-10లో చోటు దక్కించుకున్నారు.  715 పాయింట్లతో విరాట్‌ 8వ స్థానంలో ఉండగా, 707 పాయింట్లతో రోహిత్‌ శర్మ 9వ స్థానానికి చేరుకున్నాడు.

దాదాపు నాలుగున్నరేళ్ల తర్వాత తొలిసారిగా ముగ్గురు భారత బ్యాటర్లు ఐసీసీ ర్యాకింగ్స్‌లో టాప్‌-10లో చోటు దక్కించుకున్నారు. ఇంతకు ముందు జనవరి 2019లో శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ టాప్‌లో-10లో కొనసాగారు. అలాగే, ప్రస్తుతం పాక్‌కు చెందిన ముగ్గురు బ్యాటర్లు సైతం టాప్‌-10కు చేరారు. ఇమామ్‌ ఉల్‌ హక్‌ ఐదో స్థానం, ఫఖర్‌ జమాన్‌ పదో స్థానంలో ఉన్నారు. ఆసియాకప్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల పడగొట్టిన స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ ఐదు స్థానాలు ఎగబాగి ఏడో స్థానానికి చేరుకున్నాడు. 

అలాగే, హైదరాబాదీ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నాడు. బౌలర్ల ర్యాకింగ్స్‌లో ఆస్ట్రేలియాకు చెందిన జోష్ హాజిల్‌వుడ్ 692 పాయింట్లతో టాప్‌ వన్‌లో నిలిచాడు. రెండో ప్లేస్‌లో మిచేల్‌ స్టార్క్‌, ట్రెంట్‌ బౌల్డర్‌ థర్డ్‌ ప్లేస్‌లో ఉన్నారు. ఇక ఇక ఆల్‌రౌండర్స్‌ ర్యాంకింగ్స్‌లో హార్దిక్‌ ప్యాండ్యా నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని ఆరో స్థానానికి చేరాడు.