ద్వైపాక్షిక బంధం బ‌లోపేతంపై మోదీతో చ‌ర్చించా

మాన‌వ హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ‌, స్వేచ్ఛాయుత మీడియా స‌హా ప‌లు అంశాల‌పై జీ20 వేదిక‌గా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో చ‌ర్చించాన‌ని అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ వెల్ల‌డించారు. ఢిల్లీలో జీ20 స‌ద‌స్సులో పాల్గొన్న అనంత‌రం వియ‌త్నాంలో ప‌ర్య‌టిస్తున్న బైడెన్ విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. 

దేశం శక్తిమంతంగా, సుసంపన్నంగా నిర్మించడానికి అవసరమైన మానవ హక్కులను గౌరవించాల్సిన ప్రాధాన్యతను, పౌర సమాజం పోషించే కీలక పాత్రను, పత్రికా స్వేచ్ఛను గురంచి ఎప్పటిలాగే  మోదీతో తాను విస్తృతంగా చ‌ర్చించాన‌ని చెప్పారు. భార‌త్‌-అమెరికా భాగ‌స్వామ్యాన్ని బ‌లోపేతం చేసే చ‌ర్య‌ల‌పై తాము సంప్ర‌దింపులు జ‌రిపామ‌ని పేర్కొన్నారు. 

ర‌క్ష‌ణ భాగ‌స్వామ్యంలో ద్వైపాక్షిక బంధాన్ని మ‌రింత ప‌టిష్టప‌రిచేందుకు క‌ట్టుబ‌డి ఉండాల‌ని ఇరు నేత‌ల స‌మావేశంలో చ‌ర్చ‌లు జ‌రిగాయి. ఈ ఏడాది జూన్‌లో మోదీ అమెరికా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఇరు దేశాల మ‌ధ్య నెల‌కొన్న భాగ‌స్వామ్యాన్ని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌ల‌పై తాము చర్చించామ‌ని బైడెన్ చెప్పారు.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు, స‌వాళ్ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో త‌మ చొర‌వ‌, నాయ‌క‌త్వ ప‌టిమ‌ను చాటేందుకు అమెరికాకు ఇది అందివ‌చ్చిన అవ‌కాశ‌మ‌ని బిడెన్ తెలిపారు.  ఉక్రెయిన్‌లో జరుగుతున్న చట్టవిరుద్ధమైన యుద్ధం గురించి కూడా సదస్సులో తాము చర్చించామని, న్యాయమైన, శాశ్వతమైన శాంతి స్థాపన అవసరంపై కూడా తమ మధ్య ఏకాభిప్రాయం ఏర్పడిందని ఆయన తెలిపారు.

స‌మ్మిళిత వృద్ధి, నిల‌క‌డ‌తో కూడిన అభివృద్ధికి పెట్టుబ‌డులు వెచ్చించ‌డం స‌హా వాతావ‌ర‌ణ మార్పులు, స‌వాళ్లు, ఆహార భ‌ద్ర‌త బ‌లోపేతం, విద్యా, వైద్య రంగాల్లో వినూత్న మార్పులు వంటివి కీల‌క అంశాలుగా ముందుకొచ్చాయ‌ని బైడెన్ వివరించారు. న్యూఢిల్లీ జి20 సదస్సును నిర్వహించినందుకు మోదీకి, ఆయన నాయకత్వానికి బైడెన్  ధన్యవాదాలు తెలియచేశారు.