జి20 వేదికగా పుతిన్ కు బ్రెజిల్ అధ్యక్షుడి భరోసా

ఢిల్లీలో విజయవంతంగా జరిగిన జి20 సదస్సుకు కేవలం అరెస్ట్ కావచ్చనే  భయంతోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ హాజరు కాలేకపోయారని అందరూ భావిస్తున్నారు. పుతిన్‌ పాల్గొనకుండా.. ఆయన ప్రతినిధిగా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్‌ను పంపించారు. ఈ విషయాన్నీ భారత్ నుండి అధ్యక్ష పదవి చేపట్టిన బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్‌ ఇనాసియో లూలా డ సిల్వా పరోక్షంగా ప్రస్తావించారు.

వచ్చే ఏడాది బ్రెజిల్ లో జరిగే జి20 సదస్సుకు పుతిన్ హాజరవుతారని ధృడమైన విశ్వాసం వ్యక్తం చేస్తూ తాను అధ్యక్షునిగా ఉన్నంతవరకు పుతిన్ ను అక్కడ ఎవ్వరూ అరెస్ట్ చేయలేరని అంటూ జి20 వేదికగా భరోసా కూడా ఇవ్వడం సంచలనం కలిగిస్తున్నది.  వచ్చే ఏడాది జీ20 సమావేశాలు బ్రెజిల్‌లో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో 2024లో తమ దేశంలో జరిగే జీ20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ హాజరవుతారని, అక్కడ పుతిన్‌ అరెస్టయ్యే అవకాశమే లేదని ఆయన స్పష్టం చేశారు.

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో యుద్ధ నేరాల చట్టం కింద అంతర్జాతీయ న్యాయస్థానం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు అరెస్ట్‌ వారెంజ్‌ జారీచేసింది. ఈ ఏడాది మార్చిలో పుతిన్‌కు అరెస్ట్‌ వారెంట్‌ జారీ అయినప్పటి నుంచి తనను అరెస్ట్ చేస్తారనే భయంతో ఆయన దేశం దాటి బయటికి రావడంలేదు. 

భారత్‌లో ముగిసిన జీ20 సమావేశాలకు కూడా అదే భయంతో పుతిన్‌ డుమ్మా కొట్టారు. ఈ నేపథ్యంలో బ్రెజిల్‌ అధ్యక్షుడి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వచ్చే ఏడాది జీ20కి తాను ఆయన్ను ఆహ్వానిస్తున్నానని చెప్పారు. అంతేకాదు రష్యాలో జరిగే బ్రిక్స్‌ సమావేశానికి తాను హాజరయ్యేందకు ప్లాన్‌ చేసుకొంటానని తెలిపారు.

”పుతిన్‌ బ్రెజిల్‌కు చాలా తేలిగ్గా రాగలరు. అప్పటికి నేనే అధ్యక్షుడిగా ఉంటే మాత్రం ఆయన్ను అరెస్టు చేసే అవకాశమేలేదని చెప్పగలను” అని హామీ ఇచ్చారు. అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు ఏర్పాటు కోసం జరిగిన రోమ్‌ ఒప్పందంలో బ్రెజిల్‌ కూడా సంతకం చేసింది. అయినా ఢిల్లీ జీ20 వేదికగానే పుతిన్‌కు బ్రెజిల్‌ అధ్యక్షుడు ఆహ్వానం పలకడం సంచలనం కలిగిస్తున్నది.