వర్షంతో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ వాయిదా

ఆసియా క‌ప్‌లో భార‌త్, పాకిస్థాన్ సూప‌ర్ 4 మ్యాచ్ కు ఆదివారం వర్షంతో అంతరాయం ఏర్పడింది. వర్షం ఎంత‌కూ త‌గ్గ‌క‌పోవ‌డంతో అంపైర్లు మ్యాచ్‌ను ర‌ద్దు చేశారు. అయిత సోమవారం రిజ‌ర్వ్ డే ఉండ‌డంతో 50 ఓవ‌ర్ల ఆటకు అవ‌కాశం ఉంది. భార‌త జ‌ట్టు 24.1వ ఓవ‌ర్‌తో య‌థావిధిగా ఇన్నింగ్స్ కొన‌సాగించ‌నుంది. వ‌ర్షం త‌గ్గ‌డంతో 8. 30 నిమిషాల‌కు అంపైర్లు పిచ్‌ను పరిశీలించ‌డానికి వెళ్లారు.

అప్పటికే గ్రౌండ్ సిబ్బంది ఫ్యాన్ల‌తో పిచ్‌, ఔట్ ఫీల్డ్‌ను ఆర‌బెట్టేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నించారు. కానీ, ఆలోపే మ‌ళ్లీ చినుకులు మొద‌ల‌య్యాయి. దాంతో, అంపైర్లు ఇరుజ‌ట్ల కెప్టెన్ల‌తో మాట్లాడి మ్యాచ్ ర‌ద్దు చేశారు. తిరిగి సోమవారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఇదే స్టేడియంలో 50 ఓవ‌ర్ల ఆట కొన‌సాగ‌నుంది. కొలంబోలోని ప్రేమ‌దాస స్టేడియంలో భార‌త ఇన్నింగ్స్ ధాటిగా సాగుతున్న స‌మ‌యంలో మ్యాచ్‌కు వ‌రుణుడు అంత‌రాయం క‌లిగించాడు. 

24.1వ ఓవ‌ర్ స‌మ‌యంలో వాన మొద‌లైంది. అప్ప‌టికీ భార‌త్ 147/2 తో ప‌టిష్ట స్థితిలో ఉంది. విరాట్ కోహ్లీ(8), కేఎల్ రాహుల్(17) ఆడుతున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ‌(56 : 49 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), శుభ్‌మ‌న్ గిల్(58 : 52 బంతుల్లో 10 ఫోర్లు) శుభారంభం ఇచ్చారు.

పాక్ పేస్ త్ర‌యాన్ని ఉతికారేస్తూ బౌండ‌రీల‌తో విరుచుకుప‌డ్డారు. వీళ్ల ధాటికి భార‌త్ 15 ఓవ‌ర్ల‌లోనే 115 ర‌న్స్ కొట్టింది. అయితే.. షాదాబ్ ఖాన్ ఓవ‌ర్లో భారీ షాట్ ఆడిన రోహిత్ ఔట‌య్యాడు.  ఆ త‌ర్వాత షాహీన్ ఆఫ్రీదీ ఓవ‌ర్లో అఘా స‌ల్మాన్ చేతికి క్యాచ్ ఇచ్చి గిల్ వెనుదిరిగాడు. దాంతో, 124 ప‌రుగుల వ‌ద్ద ఇండియా రెండో వికెట్ కోల్పోయింది. అనంతరం కోహ్లీ, రాహుల్ మ‌రో వికెట్ ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌గా ఆడారు.