మొరాకోలో 2 వేలు దాటిన భూకంప మృతుల సంఖ్య

ఉత్తర ఆఫ్రికా దేశమైన మొరాకోను భూకంపం కకావికలం చేసింది. పర్యాటక ప్రాంతమైన మరకేశ్‌కు 70 కిలోమీటర్ల దూరంలోని అట్లాస్‌ పర్వత ప్రాంతంలో శుక్రవారం రాత్రి 6.8 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపం ధాటికి భారీ సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. దీంతో ఇప్పటివరకు 2 వేల మందికిపైగా మృతిచెందారు. మరో 2,059 మంది గాయపడ్డారు. 
నివాసాలు నేలమట్టం కావడంతో భూకంప కేంద్రానికి సమీపంలోని మర్రాకేచ్‌ ప్రాంతం మరుభూమిని తలపిస్తోంది. ఎటుచూసినా నేలమట్టమైన భవనాల శిథిలాలు, వాటి కింద నలిగిపోయి ప్రాణాలదిలినవారి మృతదేహాలు, క్షతగాత్రుల హాహాకారాలతో ఆ ప్రాంతమంతటా భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి.  దేశంలో గత ఆరు దశాబ్దాల్లో సంభవించిన అతిపెద్ద విపత్తు ఇదేనని అధికారులు తెలిపారు. మరకేష్‌- సఫి ప్రాంతంలో ప్రాణ, ఆస్తి నష్టాలు అధికంగా ఉన్నాయి.
దాదాపు 45 లక్షల మంది ప్రభావితులయ్యారు. శిథిలాల కింది చిక్కుకుపోయినవారిని రక్షించేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  అయితే రహదారులపై వాహనాలు చిక్కుకోవడంతో ఇబ్బందులు తలెత్తాయి. రోడ్లపై పెద్ద పెద్ద రాళ్లు పోగుపడటంతో సహాయక బృందాలు బాధితుల వద్దకు చేరుకోవడం ఆలస్యమవుతున్నదని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని వెల్లడించారు.

కాగా, రెండు దశాబ్దాల క్రితం మొరాకోతో సంబంధాలు తెంచుకున్న పొరుగు దేశం అల్జీరియా కూడా విపత్తు వేళ సహయం చేయడానికి సిద్ధమైంది. తన మిలటరీని సహాయక చర్యల్లో పాల్గొనేందుకు పంపించింది. మొరాకో విద్రోహ చర్యలకు పాల్పడుతుందన్నదని అల్జీరియా ఆరోపిస్తున్నది. దీంతో 1994లోనే ఇరు దేశాల సరిహద్దులు మూతపడ్డాయి. 2021లో ఆకాశ మర్గాన్ని కూడా మూసివేశారు.

ఈ ప్రకృతి విలయంతో చారిత్రక కట్టడాలు ధ్వంసమయ్యాయి. పన్నెండో శతాబ్దంనాటి కౌటౌబియా మసీదు దెబ్బతింది. మరకేష్‌ పాత నగరంలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన రెడ్‌ వాల్స్‌ కూడా దెబ్బతిన్నాయి. ఉత్తర ఆఫ్రికాలో భూకంపాలు చాలా అరుదు అని అధికారులు చెప్పారు. 

ఈ పర్వత ప్రాంతంలో నమోదైన భూకంపాల్లో ఇది చాలా తీవ్రమైనదని తెలిపారు. అగడిర్‌ పట్టణంలో 1960లో సంభవించిన భూకంపం తీవ్రత భూకంప లేఖినిపై 5.8గా నమోదైందని, అప్పట్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. దీంతో మొరాకోలో భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు జరిగాయని పేర్కొన్నారు.

ఈ మహావిలయంలో ప్రాణాలు కోల్పోయినవారికి ఐక్యరాజ్యసమితి ప్రధానకార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కష్టకాలంలో మొరాకో ప్రభుత్వానికి, దేశ ప్రజలకు అండగా నిలుస్తామని ఆయన ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఆయన ప్రజలకు సహాయసహకారాలు అందించేందుకు ప్రభుత్వంతో కలిసిపనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.