21వ శతాబ్దిలోనే అత్యంత ప్రభావవంతంగా జి20 సదస్సు

దేశంలో జి20 సమావేశాలు గత డిసెంబర్ లో ప్రారంభమై తాజాగా ఢిల్లీలో ముగింపు వరకు విజయవంతంగా జరగడం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి  హర్షం వ్యక్తం చేశారు. ప్రజల సహకారంతో 21వ శతాబ్దిలోనే అత్యంత ప్రభావవంతమైన, విజయవంతమైన సమావేశాలను భారతదేశం నిర్వహించగలిగిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. 
 
వచ్చే రెండేళ్లపాటు జీ20 (ఆఫ్రికా యూనియన్ చేరిన తర్వాత జీ21గా మారింది) సమావేశాలను నిర్వహించనున్న బ్రెజిల్, ఆ తర్వాత దక్షిణాఫ్రికా దేశాలు.. ‘న్యూఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్‌’ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషిచేస్తాయని ఆయన  ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రపంచ దేశాల ఐక్యత, పరస్పర సహకారానికి భారతదేశం నేతృత్వం వహించడానికి ఢిల్లీలో జరిగిన జీ20 సమావేశాల ముగింపు భేటీ ద్వారా ఏకగ్రీవ ఆమోదం లభించిందని కిషన్ రెడ్డి తెలిపారు.
 
జీ20 లోకి ఆఫ్రికన్ యూనియన్‌ను శాశ్వత సభ్యదేశంగా చేర్చుకునే విషయంలో అన్ని సభ్యదేశాల ఆమోదాన్ని పొందడం ద్వారా ‘గ్లోబల్ సౌత్’ గొంతుక వినిపించే విషయంలో భారతదేశ అంకితభావాన్ని స్పష్టం చేసినట్లయిందని చెప్పారు. అమెరికా, యురోపియన్ యూనియన్, భారత్, సౌదీ అరేబియా, గల్ఫ్, ఇతర ఇస్లామిక్ దేశాలను కలుపుతూ సాగే సమగ్రమైన రైలు, నౌకాయాన (షిప్పింగ్) కనెక్టివిటీ నెట్‌వర్క్‌ను జీ20 సమావేశాల్లో ప్రకటించడం అంతర్జాతీయ అనుసంధానతలో ఓ మేలి మలుపుగా కిషన్ రెడ్డి అభివర్ణించారు.

‘న్యూఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్‌’ను చైనా, రష్యా దేశాలు కూడా అంగీకరించాయి. ఆ రెండు దేశాలతో మాట్లాడి ఏకాభిప్రాయం సాధించడం ఈ సమావేశాల ద్వారా సాధించిన మరో అద్భుతమైన విజయంగా చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ  9 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలతో ఏర్పర్చుకున్న సత్సంబంధాలు, ఆయన అంతర్జాతీయ  దౌత్యం.. విశ్వ నాయకుడిగా ఆయనకున్న గౌరవ ప్రతిష్టలకు ఇదొక ఉదాహరణ మాత్రమే అని తెలిపారు.
 
జీ20 లీడర్స్ డిక్లరేషన్‌ను ఏకాభిప్రాయంతో ఆమోదిస్తున్న సందర్భంగా.. ‘గోవా రోడ్‌ మ్యాప్‌ ఫర్  టూరిజం’ను సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు కీలకమైన అంశంగా’ ప్రాధాన్యత ఇవ్వడం భారతదేశం సాధించిన గొప్ప విజయంగా కిషన్ రెడ్డి తెలిపారు. భారతదేశం ఎంచుకున్న ఇతివృత్తం (థీమ్).. ‘వసుధైవ కుటుంబకం’కు అనుగుణంగా గోవా రోడ్ మ్యాప్.. సమాజం, ఆర్థిక వ్యవస్థ, పర్యావరణ నిర్వహణలో పర్యాటక రంగం పాత్రను నొక్కి చెబుతుందని చెప్పారు.

సంస్కృతి, సాంస్కృతిక వారసత్వం రక్షణతో పాటు ప్రచారం విషయంలో డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని కూడా న్యూఢిల్లీ డిక్లరేషన్ నిర్ణయించిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. సాంస్కృతిక, సృజనాత్మక రంగాలతోపాటుగా పరిశ్రమల అభివృద్ధికి డిజిటల్ ఫ్రేమ్‌వర్క్‌లను ఏర్పాటుచేసుకునేందుకు కూడా ఈ సమావేశం అంగీకారం  తెలిపిందని తెలిపారు.