రేవంత్ కవితకు ఉన్న సంబంధం బయటపెట్టాలి

రేవంత్ కవితకు ఉన్న సంబంధం బయటపెట్టాలి
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితల మధ్యసంబంధం ఏంటో బయటపెట్టాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్యెల్యే నల్లు ఇంద్రసేనారెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ కంటే పెద్ద దగా కోరు పార్టీ కాంగ్రెస్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. గ్రౌండ్ కోసం కాంగ్రెస్ అప్లికేషన్ పెట్టలేదని పేర్కొంటూ పరేడ్ గ్రౌండ్ కోసం కాంగ్రెస్ రాసిన లెటర్ ఉంటే బయట పెట్టాలని కోరారు.
సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ పబ్లిక్ మీటింగ్ కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి కంటోన్మెంట్ బోర్డుకు ఏదైనా లేఖ రాశారా..? లేదా ఆన్ లైన్ లో అప్లికేషన్ ఇచ్చారా? రిపోర్టు బయటపెట్టాలని సవాల్ చేశారు. ఢిల్లీ హోంసెక్రటరీకి లేఖ రాశారా? ఫోన్ మెస్సేజ్ ఏమైనా పెట్టారా..? అని ప్రశ్నించారు.
ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి బయటికి వచ్చిన తర్వాత కేసు ఏమైంది? మీకు బీఆర్ఎస్‌తో బిజినెస్ సంబంధాలు లేవా? అంటూ ఆయన నిలదీశారు. 
కేసీఆర్‌తో పొత్తు పెట్టుకొని వారితో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ కాదా? ఎవరికీ ఎవరితో సంబంధాలు ఉన్నాయనేది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారని  ఇంద్రసేనారెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీలు ఒకటిగా కలవనున్నాయని ఆయన సవాల్ చేశారు. 
 
కలుస్తారని చెప్పడానికి గతంలో జరిగిన ఎన్నికలే ఉదాహరణ అని తెలిపారు. కిసాన్ సర్కార్ అంటూ దేశవ్యాప్తంగా కేసిఆర్ తిరుగుతున్నారని చెబుతూ తెలంగాణ ప్రజలను మోసం చేసింది సరిపోక దేశవ్యాప్తంగా మోసానికి బయల్దేరాడని ఎద్దేవా చేశారు. కేంద్రం ఇచ్చే ఎరువుల సబ్సిడీని కేసీఆర్ అందకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ హయాంలో ఎరువుల కోసం చెప్పులు లైన్‌లో పెట్టి రైతులు సొమ్మసిల్లారని ఆయన గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నిరకాలుగా రైతులను ఆదుకుంటున్నారని, ఎరువుల మీద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని బస్తా మీద ముద్రిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఈ విషయం రైతులకు తెలియకూడదని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం రామగుండంలో రూ.6,300 కోట్లకుపైగా వెచ్చించి పునరుద్ధరించిన రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌  (ఆర్‌ఎఫ్‌సీఎల్‌) ఫ్యాక్టరీతో దక్షిణ భారతదేశ వ్యాప్తంగా ఎరువుల కొరత లేకుండా చేసిందని తెలిపారు. అంతర్జాతీయంగా ఎరువుల ధరలు పెరిగినా ధరల భారం రైతులపై పడకుండా సబ్సిడీ పెంచి అందుబాటు ధరలో, సకాలంలో ఎరువులను అందిస్తోందని చెప్పారు. స్వదేశీ ఎరువుల ఉత్పాదకతను పెంచడంతో వ్యవసాయ ఉత్పాదకత పెరిగిన రైతులకు వ్యయభారం తగ్గించిందని వివరించారు. 

కేసీఆర్ ది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని ఇంద్రసేనారెడ్డి మండిపడ్డారు. గతంలో ఎరువుల కొరత ఉండేది.. కానీ నేడు ఎక్కడ అలాంటి పరిస్థితి లేదని తెలిపారు.  మూత పడ్డ 5 ఎరువుల కర్మాగారాలను ప్రధాని మోదీ రీ ఓపెన్ చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఓపెన్ చేయమని డిమాండ్ చేస, అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్ని మర్చిపోయారని దుయ్యబట్టారు. 

చేతగాని తనం తోనే కేంద్రం ఇచ్చే ఎరువులను కేసీఆర్ రైతులకు ఇవ్వలేకపొతున్నాడని ఇంద్రసేనారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కి రాజకీయం తప్ప ఇంకేమి చేతకాదని దుయ్యబట్టారు. మార్క్ ఫెడ్‌లో ఉన్న ఎరువులను 24 గంటల్లో రైతులకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే రైతులకు నేరుగా తామే  వాటిని అందజేస్తామని హెచ్చరించారు. “రాజకీయంగా పార్టీల తరపున కొట్లడదాం. కానీ రైతులతో మాత్రం చెలగాటం వద్దు’’ అని ఇంద్రసేనారెడ్డి హితవు పలికారు.