మహాత్మా గాంధీకి నివాళులర్పించిన జీ20 నేతలు

జీ 20 దేశాల నేతలు ఆదివారం ఉదయం న్యూఢిల్లీలోని రాజ్‌‌‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. వీరంతా ఖద్దరు శాలువలు ధరించడం విశేషం. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ట్వీట్‌లో, మహాత్మా గాంధీకి జీ20 కుటుంబ సభ్యులు నివాళులర్పించారని తెలిపారు. శాంతి, సేవ, కారుణ్యం, అహింసలకు దిక్సూచి మహాత్మా గాంధీ అని చెప్పారు.
వైవిధ్యభరితమైన దేశాలు సమావేశమవడంతో, సమ్మిళిత, సౌభాగ్యవంతమైన ప్రపంచ భవిష్యత్తు కోసం మనందరి ఉమ్మడి దార్శనికతను గాంధీజీ ఆదర్శాలు మార్గదర్శనం చేస్తాయని తెలిపారు. దీనిపై ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ చైర్మన్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ, స్వయం సమృద్ధ భారత్‌కు చిహ్నం ఖాదీ అని తెలిపారు. ఖాదీ మన సంస్కృతిలో భాగమని చెప్పారు. నేడు ఖాదీని విదేశీ అతిథులకు బహుమతిగా ఇవ్వడం మన దేశానికి గర్వకారణమని తెలిపారు.

జి20 శిఖరాగ్ర సమావేశాలు రెండో రోజైన ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ కూటమిలోని దేశాల నేతలు రాజ్‌ఘాట్ నుంచి భారత మండపానికి చేరుకున్నారు. మద్యాహ్నం 12:30 వరకు భారత మండపంలో ‘ఒకే భవిష్యత్’ అంశంపై చర్చలు జరిపారు.  ఢిల్లీలో రెండురోజుల పాటు జ‌రిగిన జీ-20 స‌ద‌స్సు ఆదివారం ముగిసింది. మ‌రోవైపు ఆఫ్రిక‌న్ యూనియ‌న్‌ను శాశ్వ‌త స‌భ్యుడిగా జీ20 స్వాగ‌తించింది.

ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేప‌ధ్యంలో విశ్వ శాంతిని కాంక్షిస్తూ జ‌రిగిన ప్రార్ధ‌న‌ల‌తో స‌ద‌స్సు ముగిసిన‌ట్టు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్ర‌క‌టించారు. జీ20 స‌ద‌స్సు ముగిసిన‌ట్టు ప్ర‌క‌టిస్తున్నాను..వ‌సుధైక కుటుంబానికి రోడ్‌మ్యాప్ దిశ‌గా మ‌నం ముందుకు సాగుతామ‌ని ఆకాంక్షిస్తున్నా అని మోదీ త‌న ముగింపు ఉప‌న్యాసంలో పేర్కొన్నారు. 

జీ20 అధ్య‌క్ష అధికార దండాన్ని బ్రెజిల్ అధ్య‌క్షుడు లూయిజ్ లూలా డిసిల్వాకు ప్ర‌ధాని మోదీ అంద‌చేశారు. స‌ద‌స్సులో చ‌ర్చించిన అంశాల‌పై స‌మీక్షించేందుకు ఈ ఏడాది న‌వంబ‌ర్ మాసాంతంలో వ‌ర్చువ‌ల్ భేటీ జ‌ర‌గాల‌ని మోదీ ప్ర‌తిపాదించారు. స‌ద‌స్సులో ముందుకొచ్చిన సూచ‌న‌లు, అంశాలపై చ‌ర్య‌లు, పురోగ‌తిని స‌మీక్షించాల్సిన అవ‌సంర ఉంద‌ని చెప్పారు. 2024లో జీ20 అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌డుతున్న బ్రెజిల్ అధ్యక్షుడిని ప్ర‌ధాని మోదీ అభినందించారు. 

దాదాపు 30 దేశాల అగ్ర నేతలు, ఉన్నతాధికారులు పాల్గొన్న జీ20 సమావేశాలు విజయవంతంగా ముగిశాయి.  ఈ శిఖరాగ్ర సదస్సులోని మూడో సెషన్ ‘ఒకే భవిష్యత్తు’పై దృష్టి సారించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గ్లోబల్ విలేజ్ భావనకు అతీతంగా గ్లోబల్ ఫ్యామిలీ స్వప్నాన్ని సాకారం చేసుకోవడం కోసం కృషి జరగాలని సూచించారు.

ప్రధాని మోదీ మధ్యాహ్నం పలు దేశాల నేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్‌కు మోదీ వర్కింగ్ లంచ్ ఇచ్చారు. ఆ తర్వాత కొమొరోస్, తుర్కియే (టర్కీ), యూఏఈ, దక్షిణ కొరియా, యురోపియన్ యూనియన్, బ్రెజిల్, నైజీరియా అధినేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు.