అక్షర్‌ధామ్ ఆలయంలో రిషి సునక్ దంపతులు

జీ 20 సదస్సులో పాల్గొనడం కోసం భారత్ వచ్చిన యూకే ప్రధాని రిషి సునక్, అక్షతా మూర్తి దంపతులు ఆదివారం ఉదయం ఢిల్లీలోని అక్షర్ ధామ్ ఆలయాన్ని సందర్శించారు. జీ20 సమ్మిట్ బిజీ షెడ్యూల్ నుంచి కాసేపు బయటకొచ్చిన రిషి  తన భార్యతో కలిసి అక్షర్‌ధామ్ ఆలయానికి వెళ్లి పూజలు చేశారు.
 
జీ20 సమ్మిట్ రెండో రోజు సదస్సు ప్రారంభం కావడానికి ముందు రిషి సునక్ కాన్వాయ్ ఆలయానికి చేరుకుంది. యూకే ప్రధాని ఆలయాన్ని సందర్శించడానికి ముందే అక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అక్షర్‌ధామ్‌లో రిషి, అక్షతా దంపతులు పూజ చేసి హారతి ఇచ్చారు. దేవాలయంలో దాదాపు ఓ గంటసేపు గడిపారు. 
 
ఈ దేవాలయం డైరెక్టర్ జ్యోతీంద్ర దవే మాట్లాడుతూ, రుషి సునాక్ హిందూ సంప్రదాయాలను పాటిస్తూ, భగవంతుడిని దర్శించుకున్నారని చెప్పారు. దేవాలయం ప్రాంగణంలో పాదరక్షలు లేకుండా నడుస్తూ భక్తిశ్రద్ధలతో దర్శనం చేసుకున్నారని తెలిపారు. ఆయన సనాతన ధర్మానికి చాలా సన్నిహితుడనే విషయాన్ని ఆయనను కలిసిన తర్వాత అర్థమైందని తెలిపారు. 
 
ఆయన అంతకుముందు తమను సంప్రదించారని, ఏ సమయంలో రావచ్చు? అని అడిగారని, ‘‘మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు రండి’’ అని చెప్పామని తెలిపారు. దేవాలయంలో ఆయన సతీ సమేతంగా పూజలు చేశారని, హారతి ఇచ్చారని తెలిపారు. దేవీదేవతలందరికీ పుష్పాలు సమర్పించారని తెలిపారు. దేవాలయంలోని సాధువులందరితోనూ మాట్లాడారని చెప్పారు. దేవాలయంలోని ప్రతి అంశాన్నీ తాము వారికి వివరించామని, ఈ దేవాలయం నమూనాను వారికి బహుమతిగా ఇచ్చినట్లు తెలిపారు. ఇక్కడ ప్రతి క్షణం ఆయన చాలా ఆనందంగా గడిపారని చెప్పారు. అక్షత కూడా చాలా సంతోషించారని, అవకాశం దొరికిన ప్రతిసారీ తాను ఈ దేవాలయాన్ని సందర్శిస్తానని చెప్పారని వివరించారు.

తాను హిందువనని చెప్పుకోవడానికి గర్విస్తానంటూ భారత్ వచ్చే ముందే వ్యాఖ్యానించిన రిషి భారత్ కు వచ్చాక ఆలయాన్ని సందర్శించి పూజలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాని మోదీ అంటే తనకు అమితమైన గౌరవం ఉందన్న రిషి సునక్  జీ20 సదస్సు ఘన విజయం సాధించడానికి ఆయనకు మద్దతునిస్తానని పేర్కొన్నారు.