ఢిల్లీ డిక్లరేషన్ వెనుక భారత దౌత్యవేత్తల విశేష కృషి

జీ20 డిక్లరేషన్‌ను ఏకగ్రీవంగా అన్నిదేశాలు ఆమోదించడంపై అంతర్జాతీయంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.  జీ 20 శిఖరాగ్ర సదస్సులో నేతల మధ్య కుదిరిన ఢిల్లీ డిక్లరేషన్ పై ఏకాభిప్రాయం సాధించడానికి భారత దౌత్యవేత్తల బృందం విశేష కృషి చేసినట్టు షెర్పా అమితాబ్ కాంత్ ఆదివారం తెలిపారు. దాదాపు 200 గంటల పాటు నిరంతర చర్చలు జరిపినట్టు వెల్లడించారు. 

అదనపు కార్యదర్శులైన ఈనం గంభీర్, కె. నాగరాజు నాయుడుతో కూడిన దౌత్యవేత్తల బృందం 300ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించినట్టు తెలిపారు. వివాదాస్పద ఉక్రెయిన్ అంశంపై ఇతర దేశాల్లోని తమ సహచరులతో 15 ముసాయిదాలను పంచుకున్నట్టు వివరించారు. వీరందరి కృషి వల్లే జీ 20 సదస్సు తొలిరోజే నేతల మధ్య ఏకాభిప్రాయం సాధ్యమైందని ఆయన వెల్లడించారు. –

“ మొత్తం జి20 సదస్సు లో అత్యంత సంక్లిష్టమైన భాగం భౌగోళిక రాజకీయాలపై (రష్యా- ఉక్రెయిన్) ఏకాభిప్రాయం తీసుకురావడం . ఇది 200 గంటల పాటు నిరంతర చర్చలు, 300 ద్వైపాక్షిక సమావేశాలు, 15 ముసాయిదాల వల్లే సాధ్యమైంది. నాగరాజు నాయుడు, గంభీర్ ఈ విషయంలో తనకు ఎంతో సహకరించారు” అని అమితాబ్ కాంత్ చెప్పారు. డిక్లరేషన్‌లో పొందుపరిచిన 83 పేరాలపై ఎక్కడా అసమ్మతి వ్యక్తం కాలేదని, ఫుట్‌నోట్స్‌ ఇవ్వాల్సిన అవసరం కూడా తలెత్తలేదని, నూటికి నూరు శాతం ఏకాభిప్రాయం సాధించామని అమితాబ్‌ కాంత్‌ చెప్పారు.

ఈ ఘనత వెనుక ఉన్న కాకనూర్‌ నాగరాజ్‌ నాయుడు  విదేశాంగ మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన హైదరాబాద్ కు చెందినవారే. మరో సంయుక్త కార్యదర్శి ఈనామ్‌ గంభీర్‌తో కలిసి వివిధ దేశాల దౌత్యవేత్తలతో అనేకమార్లు చర్చించి జీ 20 డిక్లరేషన్‌ విషయంలో ఏకాభిప్రాయం సాధించారు. నాగరాజ్‌ నాయుడుఆర్టికల్‌ 370 రద్దును పాకిస్థాన్‌, చైనా అంతర్జాతీయ వివాదంగా మలిచేందుకు చేసిన ప్రయత్నాలను బలంగా తిప్పికొట్టారు. చైనాలో నాలుగు పర్యాయాలు భారత దౌత్య అధికారిగా పనిచేశారు. చైనీయుల భాషలో ఆయన అనర్గళంగా మాట్లాడగలరు. 

జీ20 కూటమి అధ్యక్ష హోదాలో భారత్ శనివారం పెద్ద విజయాన్ని నమోదు చేసింది. పలు అంశాలపై భాగస్వామ్య దేశాల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ, సంయుక్త ప్రకటనపై ఏకాభిప్రాయాన్ని సాధించగలిగింది. ఉక్రెయిన్ యుద్ధం అంశంలో తలెత్తిన పీటముడిని చాకచక్యంగా పరిష్కరించగలిగింది. సంయుక్త ప్రకటనలో సంబంధిత పేరాను సవరించడం ద్వారా అన్ని దేశాల మద్దతును గెల్చుకోగలిగింది. ఢిల్లీలో శిఖరాగ్ర సదస్సులో అధ్యక్ష స్థానంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈమేరకు ఒక అధికారిక ప్రకటన చేశారు.

భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ20 శిఖరాగ్ర సదస్సుపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ప్రశంసలు కురిపించారు. ఢిల్లీ డిక్లరేషన్ పై సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని తీసుకురావడంలో భారత్ చేసిన కృషిని కొనియాడారు. ఇది భారత్‌కు ఎంతో గర్వకారణమన్న ఆయన, మనదేశం తరఫున షెర్పాగా ఉన్న అమితాబ్ కాంత్ పాత్రను అభినందించారు.

 “అమితాబ్ కాంత్ ….బాగా పనిచేశారు. మీరు ఐఎఎస్ ఎంచుకున్నప్పుడు … ఐఎఫ్‌ఎస్ దూకుడైన దౌత్యవేత్తను కోల్పోయింది. రష్యా, చైనాతో జరిపిన చర్చల అనంతరం ఢిల్లీ డిక్లరేషన్‌పై ఓ ముసాయిదాను రూపొందించినట్టు చెప్పారు. జీ 20 సదస్సులో నిజంగా ఇది భారత్‌కు ఎంతో గర్వకారణం” అని శశిథరూర్ ట్విట్టర్ లో కొనియాడారు.