కర్ణాటకలో బీజేపీ, జేడీఎస్‌ మధ్య పొత్తు ఖరారు

వచ్చే ఏడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కర్ణాటకలో జేడీఎస్‌, బీజేపీ మధ్య పొత్తు ఖరారైంది. మాజీ ప్రధాని, ఆ పార్టీ అధినేత హెచ్ డి దేవెగౌడ పార్టీకి నాలుగు సీట్లు కేటాయించేందుకు బీజేపీ అంగీకరించింది. బీజేపీ నేత, కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప శుక్రవారం ఈ విషయాన్ని ధృవీకరించారు.

దేవే గౌడ ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అయ్యారని, వారిద్దరి మధ్య కర్ణాటకలో కలిసి పోటీ చేయడంపై ఒప్పందం కుదిరిందని ఎడ్యూరప్ప తెలిపారు. జేడీఎస్ కు నాలుగు లోక్‌సభ సీట్లు ఇచ్చేందుకు అమిత్ షా అంగీకరించారని ఆయన చెప్పారు.  కాగా, జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడ ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. బీజేపీ, జేడీఎస్ మధ్య పొత్తు గురించి ఈ సందర్భంగా ఒక స్పష్టత వచ్చింది. మాండ్య, హసన్, బెంగళూరు (రూరల్) , చిక్‌బల్లాపూర్ స్థానాలను జేడఎస్ కోరింది. 

ఈ నేపథ్యంలో కర్ణాటకలో 25 లేదా 26 సీట్లు గెలిచేందుకు జేడీఎస్‌తో పొత్తు సహకరిస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు 2019 లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలోని మొత్తం 28 ఎంపీ స్థానాల్లో బీజేపీ సొంతంగా 25 స్థానాల్లో గెలిచింది. స్వతంత్ర అభ్యర్థి విజయానికి సహకరించడం ద్వారా 26 సీట్లు దక్కించుకుంది. కాంగ్రెస్‌, జేడీఎస్‌ చెరొక సీటులో విజయం సాధించాయి.

కర్ణాటకలో ఒకప్పుడు రాష్ట్రవ్యాప్తంగా గట్టి పట్టు ఉన్న జేడీఎస్ క్రమంగా తన ప్రభావం కోల్పోతూ వచ్చింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో జేడీఎస్ కి ఒకే ఒక స్థానం దక్కింది. అది కూడా దేవేగౌడ కుటుంబాన్ని గట్టిపట్టున్న హసన్ లోక్ సభ స్థానాన్ని మాత్రమే జెడిఎస్ గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో ఆ స్థానం నుంచి ఆయన మనవడు ప్రజ్వల్ రేవన్న గెలుపొందారు. అయితే ఆయన తప్పుడు అఫిడవిట్లో సమర్పించారన్న ఆరోపణలపై కర్ణాటక హైకోర్టు ఆయన ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది.

కాగా 2024 లోక్ సభ ఎన్నికల్లో జేడిఎస్ బిజెపి కలిసి పోటీ చేయడం రెండు పార్టీలకు ప్రయోజనకరమైన అని కర్నాటక రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఒక జాతీయ పార్టీతో, ఆ పార్టీ నాయకత్వంలోని ఎన్డీయేతో జత కూడడం జేడీఎస్ కు అత్యంత ఆవశ్యకతగా మారింది. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ 19 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఒకప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఇప్పుడు 19 స్థానాలకు పరిమితం కావడం గమనార్హం.