ఉక్రెయిన్ – రష్యా యుద్ధంఫై మోదీకి బాసటగా మన్మోహన్

ఉక్రెయిన్ – రష్యా యుద్ధం విషయంలో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని  మాజీ ప్రధాన మంత్రి డా. మన్మోహన్ సింగ్ మెచ్చుకున్నారు. రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నపుడు ఎవరో ఒకరివైపు నిలబడేలా ప్రపంచ దేశాలపైన ఒత్తిడి పెరుగుతుందని తెలిపారు. 
 
అయితే, భారత దేశం ఈ ఒత్తిడికి తలొగ్గకుండా తటస్థంగా ఉండడం, దేశ సార్వభౌమత్వాన్ని, ఆర్థిక ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించడం గొప్ప నిర్ణయమని జి20 సదస్సు సందర్భంగా ఇండియన్ ఎక్సప్రెస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొనియాడారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ  ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు.
 
“శాంతి కోసం విజ్ఞప్తి చేస్తూనే తన సార్వభౌమాధికారం, ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా సరైన పని చేసింది” అని స్పష్టం చేశారు.  ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం జి20 సదస్సుపై ఉండే అవకాశం లేదని చెబుతూ భద్రతకు సంబంధిత వైరుధ్యాలను పరిష్కరించే వేదికగా జి20ని  ఎన్నడూ భావించలేదని స్పష్టం చేశారు. 
 
 వాతావరణం, అసమానత,  ప్రపంచ వాణిజ్యంపై విశ్వాసం వంటి సవాళ్లను పరిష్కరించడానికి భద్రతాపరమైన వైరుధ్యాలను పక్కనపెట్టి, విధాన సమన్వయంపై దృష్టి సారించడం జి20కి చాలా ముఖ్యం అని స్పష్టం చేశారు.  2008 ఆర్థిక సంక్షోభం సందర్భంగా డా. మన్మోహన్ సింగ్ హయాంలోనే ఉనికిలోకి వచ్చిన జి20కి రొటేషన్ లో భారత్ తన జీవిత కాలంలోనే అధ్యక్ష వహించగలగడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
 
విదేశాంగ విధానం ఎల్లప్పుడూ భారతదేశ పాలనా వ్యవహారాలలో ముఖ్యమైన అంశంగా ఉందని చెబుతూ, అయితే ఇది మునుపటి కంటే ఈ రోజు దేశీయ రాజకీయాలకు మరింత సందర్భోచితంగా, ముఖ్యమైనదిగా మారిందని చెప్పారు. ప్రపంచంలో భారతదేశం స్థానం దేశీయ రాజకీయాల్లో ఒక సమస్యగా ఉండాల్సి ఉండగా, పార్టీ లేదా వ్యక్తిగత రాజకీయాల కోసం దౌత్యం, విదేశాంగ విధానాన్ని ఉపయోగించడంలో సంయమనం పాటించడం కూడా అంతే ముఖ్యం అని ఆయన హితవు చెప్పారు.
 
ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ వివాదం, పాశ్చాత్య దేశాలు – చైనా మధ్య భౌగోళిక- రాజకీయ చీలిక తర్వాత అంతర్జాతీయ క్రమం ఇప్పుడు చాలా భిన్నంగా ఉందని తెలిపారు . ఈ కొత్త ప్రపంచ క్రమాన్ని నడిపించడంలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. రాజ్యాంగ విలువలతో కూడిన శాంతియుతమైన పెద్ద ప్రజాస్వామ్య దేశంగా, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి భారత్ నిర్మించబడిందని చెబుతూ భారీ ఆర్థిక వ్యవస్థగా, భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా అపారమైన గౌరవం పొందుతున్నదని పేర్కొన్నారు. 
 
ఢిల్లీలో జరుగుతున్న జీ20 సమావేశాలకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ గైర్హాజరు కావడం దురదృష్టకరమని చెబుతూ లఢఖ్ సరిహద్దుల్లో చైనాతో నెలకొన్న ఉద్రిక్తతల విషయంలో ప్రధాని మోదీ  జాగ్రత్తగా వ్యవహరిస్తారని, దేశ భూభాగాన్ని కాపాడుకునే అవసరమైన చర్యలు తీసుకుంటారని తాను నమ్ముతున్నట్లు మన్మోహన్ సింగ్ చెప్పారు
 
మారుతున్న ప్రపంచ క్రమంలో భారతదేశం విశిష్టమైన ఆర్థిక అవకాశాల అంచున నిలబడిందని చెబుతూ  పెద్ద మార్కెట్, సమృద్ధిగా ఉన్న మానవ- సహజ వనరులతో శాంతియుత ప్రజాస్వామ్యంగా, సేవలతో కలిపి తయారీ, ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా రాబోయే దశాబ్దాలలో భారతదేశం ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగగలదని మాజీ ప్రధాని భరోసా వ్యక్తం చేశారు.
 
ప్రపంచం పర్యావరణ అనుకూల అభివృద్ధి నమూనాకు మారుతున్నప్పుడు, మన ప్రజలకు ఉద్యోగాలు, శ్రేయస్సును అందించగల భారతదేశం పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉండాల్సిన గ్రీన్ మొబిలిటీ, ఖనిజాలు, క్లీన్ టెక్నాలజీల వంటి కొత్త మార్గాలను తెరుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.