జీ 20 సదస్సు ఎజెండా ఇదే

జీ 20 సదస్సుకు భారత్ ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా జీ 20 సదస్సు లక్ష్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు. వివిధ దేశాల అధినేతలను ఆహ్వానించే అవకాశం లభించడంపై హర్షం వ్యక్తం చేశారు.  జీ 20 సదస్సు లక్ష్యాలను, సదస్సు ఉద్దేశ్యాన్ని ప్రధాని మోదీ వివరించారు. ‘‘మానవీయత కేంద్రంగా సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంగా’’ ఈ సదస్సు నిర్వహిస్తున్నామని ప్రధాని మోదీ వెల్లడించారు. వివిధ దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు ఉపయుక్తంగా జరుగుతాయని ఆయన ఆకాంక్షించారు. 

18వ జీ 20 సదస్సు కు ఆతిథ్యం ఇవ్వడం తమకు ఎంతో సంతోషంగా ఉందంటూ జీ 20 కి అధ్యక్షత చేపట్టిన సందర్భంగా భారత్ ప్రకటించిన జీ 20 థీమ్ అయిన ‘వసుదైక కుటుంబం’ భావనను ప్రధాని మోదీ మరోసారి గుర్తు చేశారు. ‘‘ఒకే భూమి.. ఒకే కుటుంబం.. ఒకే భవిష్యత్తు’’ అనే భావనను జీ 20 సదస్సు థీమ్ గా నిర్ధారించారు. భారత్ దృష్టిలో ప్రపంచమంటే ఇదేనని పేర్కొన్నారు.

జి20 సదస్సులో ‘‘ఒకే భూమి.. ఒకే కుటుంబం.. ఒకే భవిష్యత్తు’’ సెషన్ కి ప్రధాని మోదీ అధ్యక్షత వహిస్తారు. ఈ సెషన్ లో ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారాలను వెతికే దిశగా చర్చ కొనసాగుతుంది. అలాగే బలమైన, సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంగా చేపట్టాల్సిన చర్యలను చర్చిస్తారు. 

జీ 20 అధ్యక్షత పై ప్రధాన మోదీ  స్పందిస్తూ ఇది నిర్ణయాత్మక, లక్ష్యపూరిత బాధ్యతగా అభివర్ణించారు. సమ్మిళిత అభివృద్ధి, బహుముఖియ అంతర్జాతీయ సంస్థలు 21వ శతాబ్దికి అవసరమని ప్రధాని మోదీ తెలిపారు. బహుముఖ అభివృద్ధికి టెక్నలజికల్ ట్రాన్స్ఫర్మేషన్, డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కీలకంగా మారనున్నాయని చెప్పారు. 

లింగ సమానత్వం దిశగా, మహిళల సాధికారత దిశగా, ప్రపంచ శాంతి దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. మహాత్మా గాంధీ సమాజంలో అట్టడుగున ఉన్నవారికి సంక్షేమ, అభివృద్ధి పలాలు దక్కాలన్న మహాత్మా గాంధీ ఆలోచనల దిశగా కృషి సాగించాల్సి ఉందని చెప్పారు. వివిధ దేశాల అధినేతలతో జరగనున్న ద్వైపాక్షిక సమావేశాలు ఫలవంతం అవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.