హిందువుగా గర్విస్తున్నాను.. నా మూలాలు అవే!

హిందువుగా గర్విస్తున్నానని, తన మూలాలు అవేననీ జి20 సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీకి చేరుకున్న భారత మూలాలున్న బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ స్పష్టము చేశారు. ప్రధాన మంత్రి హోదాలో మొదటిసారిగా భారత్ లో పర్యటిస్తున్న ఆయన ఢిల్లీ చేరుకున్న తర్వాత ప్రముఖ వార్తా సంస్థ  ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇక్కడున్న ఈ రెండు రోజుల్లో తీరిక చేసుకుని ఏదైనా ఒక ఆలయాన్ని సందర్శిస్తానని చెప్పారు. 

రాఖీ పండగనూ సంప్రదాయబద్ధంగా జరుపుకొన్నామని, రాఖీలన్నింటినీ జాగ్రత్తగా దాచి పెట్టుకున్నానని తెలిపారు.  జీ20 సదస్సుకు రావాల్సిన ఉన్నందున శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను సరిగ్గా జరుపుకోలేక పోయానని, అందుకే ఏదైనా ఓ ఆలయాన్ని సందర్శిస్తానని పేర్కొన్నారు. భక్తి, విశ్వాసం అనేది అందరి జీవితాలను ప్రభావితం చేస్తుందని, అవే మనల్ని నడిపిస్తాయని తాను బలంగా నమ్ముతున్నానని చెప్పారు.

ప్రధానమంత్రి వంటి పదవిలో ఉన్నప్పుడు ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొనాల్సి ఉంటుందని, అలాంటప్పుడు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడానికి, మనో బలాన్ని పెంచుకోవడానికి ఈ భక్తి విశ్వాసాలే ప్రధానంగా దోహద పడతాయని రిషి సునాక్ అభిప్రాయపడ్డారు. జీ20 సదస్సు భారత్‌లో జరగబోతోండటం తనకు సంతోషాన్ని ఇస్తోందని తెలిపారు.

ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యా చర్యలను రిషి సునాక్ తప్పు పట్టారు. దీన్ని అక్రమ యుద్ధంగా అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలపై ఇది ప్రభావాన్ని చూపుతోందని, ప్రత్యేకించి ఆహార ధరల పెరుగుదలకు కారణమౌతోందని అన్నారు. జీ20లో ఈ అంశాన్ని తాను ప్రస్తావిస్తానని చెప్పారు.

ఉక్రెయిన్ నుంచి ప్రపంచంలోని చాలా పేద దేశాలకు ఆహార ధాన్యాలను సరఫరా చేస్తోందని రిషి సునాక్ గుర్తు చేశారు. రష్యా ఇటీవలే ధాన్యం ఒప్పందం నుంచి వైదొలిగిందని, ఫలితంగా వాటి ధరలు పెరగుతున్నాయని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది దీనివల్ల ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రష్యా చట్టవిరుద్ధంగా సాగిస్తోన్న యుద్ధం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తానని వివరించారు.
ఖలిస్థాన్ తీవ్రవాదంపై భారత్ తో కలిసి పనిచేస్తా

కాగా, ఖ‌లిస్తాన్ అనుకూల తీవ్ర‌వాదాన్ని ఎదుర్కొనేందుకు భార‌త ప్ర‌భుత్వంతో బ్రిట‌న్ క‌లిసి ప‌నిచేస్తోంద‌ని  రిషి సునాక్ చెప్పారు. ఢిల్లీ చేరుకున్న ఆయనను ఖ‌లిస్తాన్ అనుకూల తీవ్ర‌వాదం ఇటీవ‌ల పేట్రేగిపోతుండ‌టంపై ప్ర‌శ్నించ‌గా బ్రిట‌న్‌లో తీవ్ర‌వాదం లేదా ఏ రూపంలోనైనా హింస‌ను ఆమోదించ‌బోమ‌ని స్ప‌ష్టం చేశారు.

ఈ త‌ర‌హా తీవ్ర‌వాదం స‌రైంద‌ని తాను అనుకోవ‌డం లేద‌ని చెబుతూ ఈ వ్య‌వ‌హారంపై భార‌త్‌తో మాట్లాడేందుకు త‌మ భ‌ద్ర‌తా వ్య‌వ‌హారాల మంత్రి ఇటీవ‌ల ఇక్క‌డ‌ ప‌ర్య‌టించార‌ని గుర్తుచేశారు. హింసాత్మ‌క తీవ్ర‌వాదాన్ని తుద‌ముట్టించేందుకు ఇంటెలిజెన్స్‌, స‌మాచారాన్ని పర‌స్ప‌రం పంచుకునేందుకు త‌మ వ‌ర్కింగ్ గ్రూప్‌లు క‌లిసి ప‌నిచేస్తున్నాయ‌ని చెప్పారు.

లండ‌న్‌లో ఇటీవ‌ల ఖ‌లిస్తాన్ అనుకూల శ‌క్తులు భారత రాయ‌బార కార్యాల‌యంపై దాడిచేశాయి. భ‌వ‌నం ఎదురుగా ఉన్న స్తంభానికి త్రివ‌ర్ణ ప‌తాకాన్ని కింద‌కు లాగివేశారు. ఈ ఘ‌ట‌న‌పై భార‌త్ తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. 

భార్య అక్ష‌త మూర్తితో క‌లిసి భారత్‌కు వచ్చే ముందు బ్రిటన్‌లో మీడియాతో సునాక్‌ మాట్లాడుతూ  భారత్‌కు వెళ్లడం తనకు చాలా ప్రత్యేకమని చెప్పారు. ‘జీ20 లీడర్స్‌ సమ్మిట్‌ కోసం ఢిల్లీ పర్యటన నాకు చాలా ప్రత్యేకమైనది. నన్ను భారతదేశపు అల్లుడిగా పేర్కొంటున్నారు. ఆప్యాయతతోనే నన్ను అలా పిలుస్తున్నారని నేను ఆశిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు.