హోంగార్డుల హక్కుల సాధన కోసం ముందుంటా!

ఆత్మహత్యకు ప్రయత్నించి హాస్పిటల్​లో చికిత్స పొందుతున్న హోంగార్డు రవీందర్‌​ను కంచన్​బాగ్​ అపోలో హాస్పిటల్​లో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి గురువారం పరామర్శించారు. గత 17 ఏండ్లుగా హోంగార్డ్ గా పనిచేస్తున్న రవీందర్ (35) ఆత్మహత్యాయత్నం ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ అందుకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.

తెలంగాణలో హోంగార్డుల విషయంలో శ్రమదోపిడీ జరుగుతోందని, వారికి కనీస హక్కులు ఇవ్వడం లేదని కేంద్ర మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
హోంగార్డు వ్యవస్థను ప్రభుత్వం పూర్తిగా అవమానిస్తున్నదని ధ్వజమెత్తారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హోంగార్డుల హక్కులు, సంక్షేమం కోసం చట్టసభలో ప్రభుత్వాన్ని నిలదీశానని గుర్తు చేశారు.

 
వీళ్ల విషయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు పరచలేదని,8 గంటల చేయాల్సిన ఉద్యోగాన్ని 16, 24 గంటలు పనిచేస్తున్నారని మండిపడ్డారు. హక్కుల కోసం గతంలో హోంగార్డులు పోరాటం చేస్తే ఆ సంఘ నాయకులను వేధించారని, కానీ వారికి న్యాయం చేయలేదని కిషన్ రెడ్డి విమర్శించారు. హోంగార్డులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గుర్తించాలని, సెలవులు, ఇతర అలవెన్సులు ఇవ్వాలని, వారి ఆరోగ్యం విషయంలో కూడా సరైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
హోంగార్డులకు డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్లు ఇస్తానని ఇవ్వకపోవడంతో వారికి న్యాయం జరగలేదని తెలిపారు. ఎండ, వాన ఇతర ఇబ్బందుల్లో హోంగార్డులు విధుల్లో స్పృహ తప్పిపోయిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. రవీందర్ ఆత్మహత్యాయత్నానికి సంబంధించిన ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరగాలని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.  రవీందర్​ ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
 
బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత హోంగార్డుల సంక్షేమం కోసం అన్ని రకాలుగా కృషి చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. హోంగార్డులు ధైర్యంగా ఉండి పోరాడాలి కానీ..ఆత్మహత్యలకు పాల్పడవద్దని హితవు చెప్పారు.  హోంగార్డుల హక్కుల కోసం శాంతియుతంగా అందరం కలిసి పోరాటం చేద్దామని తెలిపారు. ఎవరూ తొందరపడవద్దని కోరారు.
 
రవీందర్​ కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని, రవీందర్​ ఆరోగ్యాన్ని కాపాడేందుకు పూర్తి ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ హోంగార్డ్ లకు ఇచ్చిన హామీలను ఇప్పటికైనా నిలబెట్టుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.