తిరుమలలో `ఆపరేషన్ చిరుత’లో చిక్కిన ఇదో చిరుత 

తిరుమలలో ఆపరేషన్ చిరుతలో తాజాగా తిరుమలలో మరో చిరుత చిక్కింది. అలిపిరి-తిరుమల నడక మార్గంలో నరసింహస్వామి ఆలయం దగ్గర కొత్త మండపం వద్ద ఏర్పాటు చేసిన బోనులో బంధించినట్లు అధికారులు తెలిపారు. ఈ చిరుతతో కలిపి రెండు నెలల కాలంలో మొత్తం ఐదు చిరుతలను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. 
 
నాలుగు రోజుల క్రితమే ఈ చిరుత కెమెరా కంట పడగా అప్పటి నుంచి అధికారులు చిరుతను బంధించేందుకు చర్యలు చేపట్టారు. ఇటీవల అలిపిరి నడక మార్గంలో చిరుత దాడి చేయడంతో నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన ఆరేళ్ల బాలిక లక్షిత మృతిచెందడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. 
 
టీటీడీ, అటవీశాఖ అధికారులు ఆపరేషన్ చిరుతను చేపట్టారు.  ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి వారి సంచారాన్ని గమనిస్తున్నారు. అలిపిరి తిరుమల నడక మార్గంలో బోనులు ఏర్పాటు చేశారు. ఇలా మొత్తం ఐదు చిరుతలను బంధించారు. మరోవైపు అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులకు టీటీడీ చేతికర్రలను పంపిణీ చేసింది. 
 
ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి పాల్గొన్ని భక్తులకు చేతికర్రలు అందజేసి వారి అభిప్రాయం తెలుసుకున్నారు. భక్తులు చేతికర్రలతో కొండకు చేరుకున్న తర్వాత నర్సింహా తీర్థం వద్ద భక్తులు కర్రలను టీటీడీ సిబ్బందికి అప్పజెప్పాలని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సూచించారు.


చేతి కర్ర ఇవ్వగానే భక్తులు కృూర మృగాలతో పోరాడుతారని కాదని, భక్తుల్లో ఆత్మవిశ్వాసం నింపడమే దానివెనకున్న ఉద్దేశమని ఆయన వెల్లడించారు. శాస్త్రీయంగా కూడా చేతిలో కర్ర ఉంటే ఎలాంటి జంతువులు మనుషులపై దాడి చేయవని పేర్కొన్నారు. భక్తులు గుంపులు గుంపులుగా వెళ్లాలని కోరారు. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు ధైర్యంగా ఉండాలని చెబుతూ ఇప్పటికే నాలుగు చిరుతలను బంధించామని భూమన తెలిపారు.
శేషాచలం అటవీ ప్రాంతంలో దాదాపు 45 చిరుతలు ఉన్నాయని అటవీ శాఖ లెక్కలు చెబుతున్నాయి. వీటిలో కొన్ని మాత్రమే తిరుమల మెట్ల మార్గానికి సమీపంలోకి వస్తున్నాయి. చిన్నారి లక్షితపై దాడి చేసిన చంపేసిన తర్వాత అలిపిరి మార్గంలో 200కెమెరాలను ఏర్పాటు చేశారు. కొండపైకి చేరుకుని మార్గానిక ఇరువైపులా 500 మీటర్ల పరిధిలో కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిలో చిరుతల కదలికలను అధికారులు గుర్తిస్తున్నారు.