మహానందిలో భక్తులు, ఆలయ సిబ్బంది మధ్య ఘర్షణ

నంద్యాల జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రం అయిన మహానందిలో గురువారం ఉద్రిక్తత ఏర్పడింది. భక్తులు- ఆలయ సిబ్బంది మధ్య వాగ్వాదం పెరిగి పరస్పర దాడికి దారితీసింది. దర్శనానికి రూ.150 చెల్లించాలని ఆలయ సిబ్బంది డబ్బులడగడమేంటి ? అని భక్తులు ఘర్షణకు దిగారు. చివరకు దర్శనం లేకుండానే వెనుదిరిగారు.
 
అనంతపురం జిల్లా నర్రప్పల మండలానికి చెందిన ఓ కుటుంబానికి చెందిన యాత్రికులు శ్రీ కామేశ్వరక సహిత మహానంధీశ్వర స్వామి దర్శనం కోసం మహానందికి వచ్చారు. సాయంత్రం ఐదున్నర గంటల నుండి ఆరున్నర గంటల వరకు స్వామి అమ్మవార్లకు అష్టాదశ మహా మంగళ హారతులు ఇస్తారు. ఈ సమయంలో సాధారణ భక్తుల దర్శనం ఆపుతారు.
 
మహామంగళహారతులు దర్శించుకోవాలనే భక్తులకు ఒకొక్కరికి రూ.150 రుసుం నిర్ణయించారు. అయితే ఆ సమయంలో అనంతపురానికి చెందిన భక్తులు గుంపులుగా వచ్చారు. దర్శనానికి అనుమతి ఇవ్వాలని అడగగా ప్రత్యేక రుసుం చెల్లించి దర్శించుకోవాలని ఆలయ సిబ్బంది సూచించారు. 
 
దీంతో స్వామి, అమ్మవార్లను దర్శించుకోవాలంటే భక్తులు ఎందుకు డబ్బులు  కట్టాలని నిలదీశారు. భక్తులు, ఆలయ సిబ్బంది మధ్య మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని సద్దుమణిగించారు. 
 
పరిస్థితి విషమించకుండా యాత్రికులందరిని స్థానిక మహానంది పోలీస్‌ స్టేషన్‌ తరలించి విచారించారు. దీంతో భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకోకుండానే వెనుదిరిగారు. ప్రస్తుతం ఈ గొడవపై విచారణ చేస్తున్నామని పోలీసులు చెప్పారు. మరోవైపు ఈ సమస్యకు పరిష్కారం చూపాలని భక్తులు కోరుతున్నారు.

ఉచిత దర్శనాల విషయంలో సరైన బోర్డులు లేకపోవడం, భక్తులు టిక్కెట్‌ రుసుం చెల్లించే వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడిందని కొందరు వాపోతున్నారు. అధికారులు భక్తులకు సరైన సూచనలు, ఉచిత దర్శనం, క్యూలైన్లకు సంబంధించిన బోర్డులు ఏర్పాటు చేయాలని భక్తులు డిమాండ్‌ చేస్తున్నారు.