తెరిపిలేని వర్షాలతో తడిసి ముద్దైన హైదరాబాద్ నగరం

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తోన్నాయి. ప్రత్యేకించి- తెలంగాణపై దీని తీవ్రత అధికంగా ఉంటోంది. హైదరాబాద్‌ను ఇప్పటికే అతి భారీ వర్షం ముంచెత్తింది. మరో మూడు రోజుల పాటు ఇవే పరిస్థితులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్‌ నగరం తడిసిముద్దయింది.
నగర పరిసర ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. జంట జలాశయాలు ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ పూర్తి స్థాయిలో నిండడంతో నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో, మూసీకి వరద పోటెత్తింది.  మూసీ పరివాహ లోతట్టు ప్రాంతాల ప్రజలను జిహెచ్‌ఎంసి అప్రమత్తం చేసింది. భారీ వర్షం నేపథ్యంలో ఐటి ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసుకోవాలని పోలీసులు సూచించారు.
అత్యవసరమైతే తప్ప, ప్రజలు బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు కురిసిన భారీ వర్షానికి నగరం అతలాకుతలమైంది.  పలు కాలనీలను వరద ముంచెత్తింది. కూకట్‌పల్లి ప్రగతినగర్‌ ఎన్నారై కాలనీలో ఆడుకునేందుకు ఇంటి నుంచి బైటకు వచ్చిన ఐదేళ్ల బాలుడు మిథున్‌ మూతలేని మ్యాన్‌హోల్‌లో పడి గల్లంతయ్యాడు. బాచుపల్లి నాలా కలిసే ప్రగతి నగర్‌ తుర్క చెరువులో ఆ బాలుడి మృతదేహాన్ని డిఆర్‌ఎఫ్‌ బృందాలు గుర్తించాయి. 
 
భారీ వర్షాలకు మూసీ నది ఉధృతి వల్ల ముసారాంబాగ్‌ బ్రిడ్జికి ఆనుకొని వరద ప్రవహిస్తోంది. దానితో మూసరాంబాగ్ బ్రిడ్జి రాకపోకలను ట్రాఫిక్ పోలీసులు నిలిపివేశారు. మూసీ వరద ఉధృతి పెరుగుతుండటంతో గత రాత్రి నుంచి రాకపోకలు నిలిపివేయడం జరిగింది. బ్రిడ్జిని తాకుతూ వరద ఉధృతి కొనసాగుతోంది. 
ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లకు భారీగా వరద పెరగడంతో నీటిని అధికారులు మూసీ నదిలోకి వదిలి వేస్తున్నారు.
నగరంలోని ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. పలుచోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మగూడలో ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఉంటున్న ప్రయివేటు హాస్టల్‌ మొదటి అంతస్తులోకి వరద నీరు చేరింది. సుమారు 15 అపార్ట్‌మెంట్లలోకి వరద నీరు చేరడంతో ఆ ప్రాంతం చెరువును తలపించింది. ఆందోళన చెందుతున్న విద్యార్థులను పొక్లెయిన్ల సాయంతో బయటకు తరలించారు.
 
పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు. వారిలో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన చిలువేరు సరిత (30), నేర్పాటి మమత (32) వ్యవసాయ కార్మికులు ఉన్నారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.  మిరప మొక్కలు నాటేందుకు వెళ్లిన వీరు మధ్యాహ్నం సమయంలో భారీ వర్షం కురవడంతో సమీపంలోని చెట్టు కింద తలదాచుకున్నారు. ఆ చెట్టుపై పిడుగుపడడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. కాటారం మండలం దామెరకుంటలో పొలంలో పని చేస్తుండగా పిడుగుపడి రైతు రాజేశ్వరరావు (46) మృతి చెందారు.
పలు ప్రాంతాలను భారీ వర్షం అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం హైదరాబాద్ సహా పలు జిల్లాలలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చేశారు.