వయనాడ్‌లో రాహుల్ పోటీకి వామపక్షాల మోకాలడ్డు

బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో 28 పార్టీలు కలసి `ఇండియా’  పేరుతో కూటమిగా ఏర్పడినప్పటికీ పలు రాస్త్రాలలో ఎవ్వరి దారి వారధిగా కనిపిస్తున్నది. `సాధ్యమైనంత వరకు’ సీట్లు సర్దుబాటు చేసుకుంటామని ముంబైలో విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో పేర్కొనటమే వారిలో క్షేత్రస్థాయిలో ఐక్యత పలు చోట్ల ప్రశ్నార్ధకంగా మారినట్లు స్పష్టం అవుతుంది.

ముఖ్యంగా కేరళలో మాత్రం ఎవరిదారి వారిదిగా కనిపిస్తున్నది. ఇక్కడ కాంగ్రెస్- సిపిఎం ఒకరిపై మరొకరు కత్తులు కోరుకుంటూ ఉండగా, పశ్చిమ బెంగాల్ లో ఈ రెండు పార్టీలు కలిసి టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ పై కన్నెర్ర చేస్తున్నాయి. 

కేరళలో ప్రతిపక్ష ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలైన సిపిఎం, సిపిఐ వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన సీట్ల పంపకంపై ఒకపక్క కసరత్తు ప్రారంభించినప్పటికీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మళ్లీ వచ్చే ఎన్నికల్లో కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచే పోటీ చేసేందుకు వామపక్షాలు మోకాలడ్డుతున్నాయి.

కేరళలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వామపక్షాలు రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేయడం వల్ల బిజెపికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో జరగనున్న ఇండియా కూటమి పోరాటం బలహీనపడుతుందని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రాంతీయ స్థాయిలో పొత్తులు కొనసాగుతాయని ఇండియా కూటమిలో ఏకాభిప్రాయం వ్యక్తమవుతున్నప్పటికీ కేరళలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉండటం గమనార్హం.

జాతీయ స్థాయిలో ఒకే కూటమిగా ఏర్పడినా కేరళలో మాత్రం కాంగ్రెస్- ఐయుఎంఎల్ కూటమి, సిపిఎం-కూటమి, సిపిఐ కూటమి మధ్యనే ముఖాముఖీ పోటీ జరగనున్నది. ఇది జాతీయ స్థాయిలో ఇండియా కూటమి ఇమేజ్‌పై ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉంది. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీని వయనాడ్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో దింపి కాంగ్రెస్ తప్పు చేసిందని సిపిఎం నాయకులు స్పష్టం చేస్తున్నారు. 

కేరళలో ప్రధానంగా పోటీ ఈ రెండు కూటముల మధ్యనే ఉంటుండడంతో కాంగ్రెస్ ఈసారి ఈ తప్పు చేయకుండా వేరే రాష్ట్రం నుంచి పోటీ చేస్తే మంచిదని వామపక్షాలు సూచిస్తున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ తమిళనాడు నుంచి పోటీ చేసి ఉంటే తాము కూడా ఆయనకు మద్దతుగా ప్రచారం చేసి ఉండేవారమని వామపక్షాల నాయకులు చెబుతున్నారు. 

రానున్న లోక్‌సభ ఎన్నికల ప్రాధాన్యతను కాంగ్రెస్ గుర్తించి బిజెపి ఓటమికి అనుగుణంగా వ్యవహరిస్తే బాగుంటుందని కేరళకు చెందని సిపిఎం పోలిట్‌బ్యూరో సభ్యుడు ఎంఎ బేబీ స్పష్టం చేశారు. అయితే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ మాత్రం ఈ అంశంపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. రాహుల్ మళ్లీ వయనాడ్ నుంచి పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వడానికి నిరాకరించారు. కేరళలో కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ కలసి ఐక్యంగా పోటీ చేయడం సాధ్యం కాదని మాత్రం ఆయన తేల్చి చెప్పారు.  

2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కేరళలోని 20 స్థానాల్లో 19 స్థానాలు గెలుపొందాయి. ఈ సారి కూడా అదే జరిగితే జాతీయ స్థాయిలోనే వామపక్షాల ఉనికి ప్రశ్నార్ధకరంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.