ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టులో ముగిసిన విచారణ

జమ్మూ కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్లపై మంగళవారం విచారణ ముగిసింది.16 రోజుల పాటు వాదనలు విన్న రాజ్యాంగ ధర్మాసనం తీర్పును రిజర్వులో పెట్టింది.

ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్‌ను విభజించి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించడం అత్యంత సున్నితమైన, సమస్యాత్మక అంశం కావడం వల్ల వీటిపై విచారణ చేపట్టడానికి సుప్రీంకోర్టు ప్రత్యేకంగా రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయిదు మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్లను విచారించింది.
 
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యాన్ని వహించే ఈ ధర్మాసనంలో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారు. 2020లో సుమారు 23 పిటీషన్లు దాఖలయ్యాయి.

2020లో అవి దాఖలైనప్పటికీ లిస్టింగ్‌ కాలేదు. వాటిపై విచారణ చేపట్టడానికి సుప్రీంకోర్టు పెద్దగా ఆసక్తి చూపలేదు. 2020 మార్చిలో చివరిసారిగా ఈ పిటీషన్లు లిస్ట్ అయ్యాయి గానీ బెంచ్ మీదికి విచారణకు రాలేదు. ఇటీవలే వాటిని విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు. 
ప్రత్యేకంగా రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. 
 
ఆర్టికల్ 370 రద్దయిన ఇన్ని సంవత్సరాల తరువాత సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలను జారీ చేస్తుంది?, పిటీషన్లపై విచారణ సందర్భంగా ఎలాంటి వాదనలు వెలువడతాయనేది ఆసక్తి రేపుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
పలు విషయాలపై సుప్రీంకోర్టు ధర్మాసనం సమగ్రంగా విచారించింది.
 
పిటీషనర్ల తరఫు న్యాయవాదుల అభ్యంతరాలను స్వీకరించింది. జమ్మూ కాశ్మీర్, లడక్ కేంద్రపాలిత ప్రాంతాల ఏర్పాటు, ఆర్టికల్ 320 రద్దుకు గల కారణాలపై కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలను వినిపించారు.
 
ఈ క్రమంలోనే జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికలను నిర్వహించడానికీ కేంద్రం సుముఖతను ఇదివరకే వ్యక్తం చేసింది. మూడు దశల్లో జమ్మూ కాశ్మీర్‌లో నిర్వహించడానికి కేంద్రం అంగీకారం తెలిపింది. ముందుగా పంచాయతీ రాజ్‌కు ఎన్నికలు, దాని తరువాత మున్సిపాలిటీలు, అనంతరం అసెంబ్లీకి ఎన్నికల ప్రక్రియ చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
 
 జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించడానికి నిర్దిష్ట కాలపరిమితిని ఇవ్వలేమని తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తేల్చి చెప్పారు. కేంద్ర పాలిత హోదా మాత్రం తాత్కాలికమేనని, సంపూర్ణ రాష్ట్రంగా జమ్మూ కాశ్మీర్‌ను అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రక్రియను కొనసాగిస్తోన్నామని తెలిపారు. ఆగస్ట్ 2న విచారణ ప్రారంభమై 16 రోజుల పాటు ఈ కేసుపై ఇరుపక్షాలు తమ వాదనలను వినిపించాయి.
పిటిషనర్ల తరుపున కపిల్ సిబల్, జఫర్ షా, గోపాల్ సుబ్రమణ్యం, రాజీవ్ థావన్, దుష్యంత్ దవే, దినేష్ ద్వివేది సహా సీనియర్ న్యాయవాదులు తమ వాదల్ని వినిపించారు. భారత ప్రభుత్వం తరుపున అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్ వెంకటరమణి, సోలిసిటర్ జనరల్ తుషార్ మోహతా, అదనపు సోలిసిటర్ జనరల్ కెఎం నటరాజ్ వాదనల్ని వినిపించారు.