ఉదయనిధి, ప్రియాంక్ ఖర్గేలపై యుపిలో ఎఫ్‌ఐఆర్

 
* దీటుగా సమాధానం చెప్పాలన్న ప్రధాని
తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు వ్యతిరేకంగా పోలీసు కేసు నమోదైంది. సనాతన ధర్మంపై ఉదయనిధి పరుష వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు, కర్ణాటక మంత్రి ప్రియాంక్‌ ఖర్గే సమర్థించారు. 
 
దీంతో ఉదయనిధి స్టాలిన్‌, ప్రియాంక్‌ ఖర్గేలకు వ్యతిరేకంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌ సివిల్‌ పోలీసు లైన్స్‌ పోలీస్టే స్టేషన్‌లో సెక్షన్‌ 295ఏ (మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టేలా ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు చేయడం), సెక్షన్‌ 153 ఏ (వివిధ మత గ్రూపుల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం) కింద ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారు. 
 
న్యాయవాదులు హర్ష గుప్తా, రామ్‌ సింగ్‌ లోధి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. ఉదయనిధి స్టాలిన్‌ తొలిసారిగా గత శనివారం తమిళనాడులో ఓ కార్యక్రమం సందర్భంగా సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని డెంగీ, మలేరియా వ్యాధులతో పోల్చారు. ఆయన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుండడం తెలిసిందే. 

‘సనాతన ధర్మ నిర్మూలన’ పేరుతో తమిళనాడు అభ్యుదయ రచయితలు, కళాకారుల సంఘం చెన్నైలో గత వారం ఓ సమావేశాన్ని నిర్వహించింది. ఉదయనిధి స్టాలిన్ ఈ సమావేశంలో మాట్లాడుతూ, సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా, కరోనా వంటి రోగాలతో పోల్చారు. వీటిని కేవలం వ్యతిరేకించలేమని, అంతం చేయాలని, నిర్మూలించాలని, అదే విధంగా సనాతన ధర్మాన్ని కూడా నిర్మూలించాలని స్పష్టం చేశారు. 

దీనిపై వివాదం రేగిన తర్వాత కూడా ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడానికి నిరాకరించారు. మరోవైపు కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే (కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు) మాట్లాడుతూ, ఉదయనిధి స్టాలిన్‌కు మద్దతిచ్చారు. సమానత్వాన్ని ప్రోత్సహించని ఏ మతమైనా, మానవుడిగా హుందాగా జీవించేందుకు భరోసానివ్వని ఏ మతమైనా, తన దృష్టిలో మతం కాదని చెప్పారు.

ఇలా ఉండగా, సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలకు దీటుగా సమాధానం చెప్పాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులను ఆదేశించారు. చరిత్ర లోతుల్లోకి వెళ్లవద్దని, రాజ్యాంగం ప్రకారం వాస్తవాలకు మాత్రమే కట్టుబడి ఉండాలని ఆయన తెలిపారు. ఈ అంశంలో ప్రస్తుత, సమకాలిక పరిస్థితి గురించి మాత్రమే మాట్లాడాలని స్పష్టం చేశారు.

ఇటీవల తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని సమూలంగా నిర్మూలించాలంటూ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ  ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలకు సరైన రీతిలో సమాధానం చెప్పాలని మంత్రులను ఆదేశించారు.

‘‘చరిత్ర లోతుల్లోకి వెళ్లవద్దు, రాజ్యాంగం ప్రకారం వాస్తవాలకు మాత్రమే కట్టుబడి ఉండాలి. ఈ అంశంలో సమకాలిక పరిస్థితి గురించి మాత్రమే మాట్లాడాలి’’ అని మంత్రులకు మోదీ చెప్పారు. ఇండియా వర్సెస్ భారత్ వివాదంపై వ్యాఖ్యలు చేయవద్దని చెప్పారు. ఈ అంశంపై సంబంధిత  వ్యక్తులు మాత్రమే మాట్లాడాలని తెలిపారు.