మంత్రి గంగుల కమలాకర్‌కు ఈడీ నోటీసులు

అక్రమ నగదు లావాదేవీల వ్యవహారంలో తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. కొద్ది నెలల క్రితం తెలంగాణలో ఈడీ సోదాలు కలకలం రేపాయి. మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు పలువురు నేతల ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించి కీలక సమాచారం సేకరించింది.

తాజాగా మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు ఈడి నోటీసులు జారీ చేసింది. మంత్రి గంగుల కుటుంబానికి చెందిన శ్వేతా గ్రానైట్స్‌ కంపెనీ ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆరోపణల నేపథ్యంలో ఈ నోటీసులు జారీ చేశారు.

గ్రానైట్ ఎగుమతుల ద్వారా ఫెమా నిబంధన లో రూ.4.8 కోట్ల వరకు పన్నలు ఎగవేసినట్లు గుర్తించారు. శ్వేతా ఏజెన్సీస్ ద్వారా చైనాకు గ్రానైట్ మెటీరియల్ ఎగుమతి చేయడంలో అక్రమాలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. కొద్ది నెలల క్రితం జరిపిన సోదాల్లో అక్రమ లావాదేవీలకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలను ఈడీ గుర్తించింది.

విదేశాలకు గ్రానైట్ ఎగుమతులు చేసినందుకు ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులో కేవలం రూ.3 కోట్లు మాత్రమే శ్వేతా ఏజెన్సీస్ చెల్లించినట్లు గుర్తించారు. సుమారు 50 కోట్ల వరకు పన్నులు ఎగవేసి అక్రమాలకు పాల్పడినట్లు ఈడీ ఆరోపిస్తోంది. గ్రానైట్ ఎగుమతులతో హవాలా మార్గంలో డబ్బు లావాదేవీలు జరిగినట్లు ఈడీ ఆధారాలు సేకరించింది.

 గత ఏడాది నవంబర్ లో శ్వేతా ఏజెన్సీస్ పై సోదాలు నిర్వహించిన సమయంలో ఈ వ్యవహారం వెలుగు చూసింది. విజిలెన్స్ రిపోర్టు ప్రకారం 7.6 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రానైట్‌ను గంగుల కుటుంబం అక్రమంగా తరలించినట్లు గుర్తించారు. చైనాకు చెందిన కంపెనీల నుండి హవాలా మార్గంలో నగదు లబ్ది పొందినట్టు గుర్తించారు.