డీకే అరుణను ఎమ్యెల్యేగా ప్రకటించిన ఎన్నికల కమిషన్

గద్వాల ఎమ్మెల్యే విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఉత్తర్వులను పాటించి తక్షణమే బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను ఎమ్మెల్యేగా  గద్వాల ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ నోటిఫికేషన్‌ను గెజిట్‌లో ప్రచురించాల్సిందిగా ఆదేశిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల ప్రధానాధికారికి లేఖలు రాసింది.
 
 హైకోర్టు తీర్పు ప్రకారం 2018 డిసెంబర్ 12 నుంచి డీకే అరుణను ఎమ్మెల్యేగా పరిగణించాలని కూడా ఆ లేఖలో పేర్కొంది. ఈ లేఖతో పాటు హైకోర్టు ఉత్తర్వులను జత చేసింది. తప్పుడు అఫిడవిట్‌ సమర్పించారని పేర్కొంటూ గద్వాల బిఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిపై హైకోర్టు వేటు వేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేగా ఆయన్ను అనర్హుడిగా ప్రకటించింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ తీర్పు వెలువరించింది. 
 
రెండో స్థానంలో ఉన్న డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది. ఇదే తీర్పు కాపీని అసెంబ్లీ కార్యదర్శికి కూడా అందించారు డీకే అరుణ. అధికారుల నుంచి స్పందన రాకపోవటంతో ఆమె ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. 2018 ఎన్నికల్లో బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి 1,00,415 ఓట్లు రాగా, కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో ఉన్న డీకే అరుణకు 72,155 ఓట్లు పోలయ్యాయి.
సమాజ్ వాది ఫార్వర్డ్ బ్లాక్ తరపున బరిలో ఉన్న అబ్జుల్ మోహిద్ ఖాన్ కు 7,189 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కృష్ణామోహన్ రెడ్డి 28,445 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక డీకే అరుణ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అధికారులు చర్యలు చేపడితేడీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించే అవకాశం ఉంది. ఎమ్మెల్యేగా గుర్తిస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రికార్డుల్లోకి ఎక్కుతారు.

తన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పున సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ నేత బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు కేసులు పెట్టారని పేర్కొన్నారు. కోర్టును తప్పుదోవ పట్టించారని చెప్పారు.  దీనిపై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఖరారు చేసుకున్న కృష్ణమోహన్ రెడ్డి ప్రచారం చేసే పనిలో పడ్డారు. ఇలాంటి సమయంలో  తెలంగాణ హైకోర్టు తీర్పు ఆయనకు ఇబ్బందికరంగా మారింది.

కొద్దిరోజుల కిందటే కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా కేసులో ఇదే తరహా తీర్పు వచ్చింది. తప్పుడు అఫిడవిట్ సమాచారం ఇచ్చారంటూ ఆయన ఎన్నికను రద్దు చేసింది. సమీప ప్రత్యర్థిగా ఉన్న జలగంను ఎమ్మెల్యేగా ప్రకటించింది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు వనమా. హైకోర్టు తీర్పు స్టే తెచ్చుకోగా విచారణ జరుగుతుంది.