ఆర్5 జోన్ పై ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో షాక్

అమరావతిలోని ఆర్5 జోన్ విషయంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. ఆర్5 జోన్ పై ఏపీ హైకోర్టు ఆర్డర్ పై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. అలాగే ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. వివరణ ఇచ్చేందుకు ప్రతివాదులకు మూడు వారాల గడువిస్తూ తదుపరి విచారణను నవంబర్ నెలకు వాయిదా వేసింది.
 
ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణం చేపట్టవద్దంటూ ఏపీ హైకోర్టు గతంలో మధ్యంతర ఉత్తర్వులను జారీచేసింది. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. తాజాగా ఈ పిటిషన్ పై జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఆర్-5 జోన్ వ్యవహారానికి, రాజధాని అంశానికి సంబంధం ఉందా? అని ప్రశ్నించింది. 
 
దీనిపై ఏపీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అభిషేక్ సంఘ్వీ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణం కోసమే ప్రభుత్వం ఈ ప్రాజెక్టు చేపట్టిందని, పట్టాలు పంపిణీ చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవగా, దీనిపై హైకోర్టు స్టే ఇచ్చిందని తెలిపారు.  ప్రభుత్వం తరఫున వాదనలు విన్న ధర్మాసనం స్పందిస్తూ జస్టిస్ జోసెఫ్ ఉత్తర్వుల తర్వాత హైకోర్టు విచారణ జరిపించింది.
 
ఈ విచార‌ణ‌లో అనేక అంశాలు ముడిప‌డి ఉన్నాయ‌ని, ఈ ద‌శ‌లో స్టే ఇవ్వాలేమ‌ని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. తదుపరి విచారణ చేపడతామని సంజీవ్ ఖన్నా వెల్లడించారు. భూమి అసలు యజమానులకు పరిహారం అందకపోవడం, గృహ నిర్మాణ ప్రాజెక్టు రూ. 1,000 కోట్ల పై విలువైనది కావడం సహా చాలా అంశాలను నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం పేర్కొంది. 
ప్రతివాదులకు నోటీసులు జారీచేసిన ధర్మాసనం మూడువారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది.  ప్రతివాదులు కౌంటరు దాఖలు చేసిన తర్వాత మరో మూడు వారాల్లో రిజాయిండర్ పిటిషన్ దాఖలు చేయాలని పిటిషనర్లను ఆదేశించింది. తర్వాత విచారణను నవంబర్ లో చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నిర్ణయంపై అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.